పక్కింట్లో గృహహింస? బాధితుల తరఫున మీరు కేసు వేయవచ్చు! | Domestic violence next door? On behalf of the victims of Case can you! | Sakshi
Sakshi News home page

పక్కింట్లో గృహహింస? బాధితుల తరఫున మీరు కేసు వేయవచ్చు!

Published Sun, Feb 14 2016 11:44 PM | Last Updated on Wed, May 29 2019 3:25 PM

పక్కింట్లో గృహహింస? బాధితుల తరఫున మీరు కేసు వేయవచ్చు! - Sakshi

పక్కింట్లో గృహహింస? బాధితుల తరఫున మీరు కేసు వేయవచ్చు!

లీగల్ కౌన్సెలింగ్
మా పక్కింట్లో ఒక జంట నివసిస్తున్నారు. వారికి దాదాపు ముప్ఫయ్యేళ్లు ఉండవచ్చు. అతను ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె గృహిణి. వారు ఆ ఇంట్లో అద్దెకు దిగి ఆరునెలలైంది. విషయమేమిటంటే ఆమె ఎప్పుడూ బయటకు రాదు. ఎవరితోనూ కలవదు. దాదాపు నెలరోజుల నుండి రాత్రివేళల్లో ఆమె ఏడ్పులు, కేకలు వినిపిస్తున్నాయి. అది భార్యాభర్తల విషయం ఏమో అని మేము మొదట్లో పట్టించుకోలేదు. ఆ తర్వాత ఉండబట్టలేక ఆమెను అడిగితే అతి కష్టం మీద చెప్పింది. తనను భర్త ప్రతిరోజూ హింసిస్తున్నాడనీ, బయటకు రానివ్వడం లేదనీ. ఎవరికైనా తెలియజేద్దామంటే కనీసం తన దగ్గర ఫోన్ కూడా లేదని, ఎలాగైనా తనను కాపాడమని అడిగింది. అయితే విషయం పోలీసుల వరకు వెళ్లనివ్వవద్దని అభ్యర్థించింది. మేము ఏం చేయమంటారు? సలహా ఇవ్వగలరు.
 - కనకలత, హైదరాబాద్

 
మీరు వెంటనే మీ పక్కింట్లో గృహ హింస జరుగుతోందని ఫోన్ ద్వారాగానీ, ఈ మెయిల్ ద్వారా గానీ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన రక్షణాధికారికి (ప్రొటెక్షన్ ఆఫీసర్)కు తెలియబరచండి. బాధితురాలు నిస్సహాయ స్థితిలో, బయటకు రాలేని సందర్భాల్లో, అత్యవసర పరిస్థితుల్లో బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారు ఆమె తరఫున ఫిర్యాదు చేయవచ్చు.

సమాచారం అందుకున్న వెంటనే అధికారులు తప్పకుండా స్పందిస్తారు. వారు వెంటనే ఆ ఇంటికి వచ్చి తమకు అందిన సమాచారం నిజమని రుజువైతే గృహహింస సంఘటన నివేదిక తయారు చేసి గృహహింస చట్టప్రకారం తగు ఆదేశాలు పొందడానికి ఎలాంటి జాప్యమూ లేకుండా తగిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుంటారు.
 
నేనొక సీనియర్ సిటిజన్‌ను. పైగా హార్ట్ పేషెంట్‌ను. వైద్యం నిమిత్తం శ్రీకాకుళం నుండి హైదరాబాద్‌కు రైలులో ప్రయాణించాను. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీ టికెట్ తీసుకున్నాను. మార్గంమధ్యలో రైల్వే అధికారులు చెకింగ్‌కు వచ్చి, వయస్సు ధృవీకరణ పత్రం చూపించమన్నారు. నేను నా హాస్పిటల్ రిపోర్టులు, హాస్పిటల్ ఐడీ చూపించాను. వారు అవి సరిపోవని ఛీత్కరిస్తూ నాకు పెనాల్టీ విధించారు. అంతేగాక డెబ్భయ్యేళ్ల వాడినని కూడా చూడకుండా నాపట్ల అగౌరవంగా ప్రవర్తించారు. నేనెంతో మానసిక వ్యధకు లోనయ్యాను. నేను నా పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్య తీసుకోవలసిందిగా రైల్వే ఉన్నతాధికారులను కోరవచ్చునా? అందుకు నేను ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వండి.
 - ఎం. పైడితల్లి, పాలకొండ

 
అనాగరిక చర్యలు సేవల్లోని లోపాలే అని వినియోగదారుల రక్షణ చట్టం స్పష్టంగా చెప్పింది. మీరు టికెట్ కొని రైలులో ప్రయాణించారు కాబట్టి మీరు వినియోగదారుడే అవుతారు. సీనియర్ సిటిజన్స్ పట్ల గౌరవంగా మెలగడమనేది కనీస బాధ్యత. చాలామంది అలా చేయడం లేదు. ఇలాంటి విషయాలు జాతీయ కమిషన్ దృష్టి వరకు వెళ్లాయి.

ఈ ప్రవర్తన మంచిది కాదని, దురుసు మరియు అగౌరవకరమైన ప్రవర్తనకు సంస్థలు బాధ్యత వహించవలసి ఉంటుందని అనేక సందర్భాలలో జాతీయ కమిసన్ సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించింది. వారి ప్రవర్తనలో మార్పు రావాలని సూచించింది. సీనియర్ సిటిజన్లకు సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంస్థలను బాధితులకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా చాలా సందర్భాల్లో, చాలా కేసుల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది.

వినియోగదారులందరి పట్లా సంస్థల ప్రవర్తనా సరళి సుహృద్భావంతో ఉండాలి మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల పట్ల. మీ వేదన తీరాలంటే వినియోగదారుల ఫోరంలో కేసు వేయండి. మీరు ఫైన్‌కట్టిన రశీదు, మీ రైల్ టికెట్ జతపరచి కేసు వేయండి. ఇందుకు నామమాత్రపు కోర్టు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మీకు తప్పక న్యాయం జరుగుతుంది. వయోవృద్ధులు కనుక మీ కేసు సత్వరం పరిష్కారమవుతుంది. మీకు నస్టపరిహారం అందుతుంది.
 
నా పేరు రుక్సానా. మాకు వివాహమై 8 సంవత్సరాలయింది. ఆరేళ్లబాబు, ఏడేళ్ల పాప ఉన్నారు. నేను నా భర్తనుండి విడాకులు తీసుకున్నాను. నా పిల్లలకు సంరక్షకులెవ్వరు? పిల్లలు నా దగ్గర ఉండవచ్చునా? 

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంరక్షణ విషయంలో తలిదండ్రులిద్దరూ సహజ సంరక్షకులే. అంటే నేచురల్ గార్డియన్స్. కానీ మహమ్మదీయ ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి మాత్రమే సహజ సంరక్షకుడు. పసిపిల్లల సంరక్షణ విషయంలో ప్రధాన బాధ్యత తండ్రిదే అయినప్పటికీ మగపిల్లలకు ఏడు సంవత్సరాల వయసు వరకు, ఆడపిల్లలకు యుక్తవయసు వరకు తల్లి అధీనంలో ఉండవచ్చు. ఈ కష్టడీని హిజానత్ అంటారు. విడాకులు పొందిన స్త్రీలకూ ఇది వర్తిస్తుంది. అయితే అబ్బాయికి ఏడు సంవత్సరాలు, అమ్మాయికి యుక్తవయసు రాకముందే మీరు మరలా వివాహం చేసుకుంటే పై అర్హతను మీరు కోల్పోతారు. అంటే పిల్లలు తండ్రి అధీనంలోకి వెళతారు.
 
నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. ఇంతవరకూ మా మధ్య ఎటువంటి శారీరక బంధమూ ఏర్పడలేదు. ఆయన సంసారానికి పనికిరారనే విషయాన్ని కప్పిపుచ్చి నన్ను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మా ఆయన, తమ తప్పును ఒప్పుగా చేసుకునేందుకు మా అత్తమామలు నాపైన లేనిపోని నిందలు మోపుతున్నారు. ఈ వైవాహిక బంధాన్ని కొనసాగించటం నాకు ఇష్టం లేదు. దీని నుంచి బయట పడాలంటే ఏం చేయాలి?
 -పి. కృష్ణావతి, పెదవడ్లపూడి

 
మీ వారు సంసారానికి పనికి రారంటున్నారు, పైగా మీపైన లేనిపోని నిందలు మోపుతూ మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా బాధిస్తున్నాడంటున్నారు. దీనికి తోడు మీ అత్తమామలు కూడా మిమ్మల్ని సూటిపోటి మాటలంటూ మిమ్మల్ని బాధపెడుతున్నారంటున్నారు కాబట్టి మీరు ఈ విషయాలను వివరిస్తూ, మీ వివాహాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతూ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయండి. మీరు చెప్పిన విషయాలను కోర్టులో నిరూపించగలిగితే కోర్టు మీ పెళ్లిని రద్దు చేస్తూ, మీకు విడాకులు మంజూరు చేస్తుంది. తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు.
 
కుక్క కాటుకి చెప్పుదెబ్బలా...
కేస్ స్టడీ

సుప్రియ, విజయ్‌లు భార్యాభర్తలు. వారి వివాహమై ఏడేళ్లయింది. ఒక పాప కూడా. అయితే ఇటీవల విజయ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చీటికి మాటికీ సుప్రియను మాటలతో, చేతలతో హింసిస్తున్నాడు. ఇంటికి ఆలస్యంగా రావడం, అర్ధరాత్రిళ్లు తగాదా పడటం, ఇంట్లోనుండి తక్షణమే వెళ్లిపొమ్మని ఆర్డరేయడం ఎక్కువైంది. సుప్రియ మౌనంగా భరించింది. అసలు కారణం కనుక్కునే ప్రయత్నం చేసింది కానీ వృథాప్రయాసే అయింది.

ఒకరోజు అర్ధరాత్రప్పుడు బాగా తాగి వచ్చి ఆమెనూ, పాపనూ ఇంటినుండి గెంటివేశాడు విజయ్. ఎక్కడికెళ్లాలో పాలుపోలేదు సుప్రియకు. అమ్మానాన్నా వృద్ధులు. వారి మీద తమ బరువు బాధ్యతలు వేయడం ఇష్టంలేదు. దాంతో ఒక స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుని భర్త మీద గృహహింస కేసు పెట్టింది. కొంతకాలంపాటు తాను తలదాచుకోవడానికి అత్యవసరంగా ఒక గూడు కావాలి కాబట్టి భర్తతో కలిసి ఉన్న ఇంటిలో నివసించేలాగా ఆర్డర్ కావాలని కోర్టువారిని అభ్యర్థించింది. ఆ ఇల్లు ఎలాగూ భర్తదే. అతని పేరు మీదే ఉంది.

కేసు దాఖలై విజయ్‌కు నోటీసు వెళ్లింది. మొదటి వాయిదా నాటికే ఆ ఇంటిని తల్లి పేరుమీద బదిలీ చేసి తనకసలు ఇల్లే లేదని, అది తల్లి ఇల్లనీ వాదించాడు విజయ్. భార్యాభర్తల మధ్య వివాదం మొదలైన తర్వాత అదీ కేస్ వేసిన తర్వాత దురుద్దేశ్యపూర్వకంగా ఆ ఇంటిని విజయ్ తల్లి పేరున బదలీ చేశాడనీ కనుక సుప్రియకు, పాపకూ నివాస హక్కులుంటాయనీ కోర్టువారు హెచ్చరించారు.

- ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement