భార్యాభర్తలు విడాకుల దాకా రావడానికి కారణాలివి... | Legal counseling | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలు విడాకుల దాకా రావడానికి కారణాలివి...

Published Mon, Apr 11 2016 12:04 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

భార్యాభర్తలు విడాకుల దాకా రావడానికి కారణాలివి... - Sakshi

భార్యాభర్తలు విడాకుల దాకా రావడానికి కారణాలివి...

 కేస్ స్టడీ

 

మంగమ్మగారు ఒక మాజీ కార్పొరేటర్. ప్రస్తుతం ఒక ‘కౌన్సెలింగ్ సెంటర్’ ఏర్పాటు చేయాలనుకున్నారు. విడాకుల సంఖ్య ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో అసలు జంటలెందుకు విడిపోతున్నారో తెలుసుకొని వారికి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి, సాధ్యమైనంతమంది జంటలను కోర్టు గుమ్మం తొక్కకుండా చేయడమే ఆ సెంటర్ స్థాపనలో ఉన్న ముఖ్యోద్దేశం. వారికి తెలిసిన న్యాయవాదిని కలిసి విషయం వివరించి జంటలు విడిపోవడానికి ప్రధాన కారణాలు తెలుసుకొని చర్చించుకొని ఒక అవగాహనకు వచ్చారు. అసలు జంటలు విడాకులదాకా రావడానికి గల ప్రధాన కారణాలు గురించి న్యాయవాది తెలిపిన వివరాలు.

 
1) ఇన్‌కంపాటబిలిటీ (అనుభవ రాహిత్యం) 2) అసహనం 3) అనుమానం 4) అధికారం (మేల్ డామినేషన్) 5) అహంకారం 6) వైవాహికేతర సంబంధాలు 7) దురలవాట్లు 8) వరకట్న డిమాండ్స్ 9) అంటువ్యాధులు 10) తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల అనవసరపు జోక్యం మొదలైనవి.


ఇక ఒక్కొక్క కారణం గురించి అధ్యయనం చేయాలని, వాటి గురించి చర్చించాలని నిర్ణయించుకొని ఒక గుడ్‌కాజ్ గురించి సెంటర్ అత్యంత త్వరలో ఏర్పాటు చేయాలని వెను తిరిగారు మంగమ్మగారు.

 

యాసిడ్ దాడులకు పాల్పడినా, అందుకు సహకరించినా... పదేళ్ల జైలు, జరిమానా
లీగల్ కౌన్సెలింగ్


మేడమ్, మేము ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థినులం. మా కాలేజీలో ఒక అల్లరి మూక ఉంది. అమ్మాయిలను ప్రేమించామని వెంటపడటమే వారి పని. ఇటీవల వారి ఆగడాలు ఎక్కువైనాయి. ప్రేమించలేదని కొందరు అమ్మాయిలను దారి కాచి మరీ వేధిస్తున్నారు. మొన్నటికి మొన్న చేతిలో ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఏదో ద్రవం నింపుకొని వచ్చి కాలేజీ దారిలో కొందరిని భయభ్రాంతులకు గురి చేశారు. మా యాజమాన్యం పట్టించుకోలేదు. ఆ ఆకతాయి ముఠా వెనుక పెద్దల అండదండ లున్నాయ్. ఆ బాటిల్స్‌లోని ద్రవం యాసిడ్ అని మా అనుమానం. అదే నిజమైతే మా గతేం కాను? చాలా భయంగా ఉంది. యాసిడ్ దాడులకు సంబంధించి చట్టాలేమైనా ఉన్నాయా? దయచేసి తెలుపగలరు?  - ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల బృందం, కాకినాడ
భయపడకండి. ఇటువంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా చాకచక్యంగా ఎదుక్కోవాలి. తగిన జాగ్రత్త అవసరం. స్వప్నిక, ప్రణీతల సంఘటన మీకు గుర్తుండి ఉంటుంది. అలాగే ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కూడా. అదే ‘నిర్భయ’ ఉదంతం. ఢిల్లీ గ్యాంగ్ రేప్‌కి ముందు మనకు యాసిడ్ దాడులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు/ఐపిసి సెక్షన్స్ లేవు. ఆ సంఘటన తర్వాత వెల్లువెత్తిన నిరసనల ఫలితంగా జస్టిస్ వర్మ కమిషన్ రిపోర్ట్‌ను/రికమెండేషన్స్‌ను అనుసరించి ‘నిర్భయ చట్టం’ లేక ‘క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ 2013’ రావడం జరిగింది. దానిలో యాసిడ్ దాడులను చేర్చడం జరిగింది. సెక్షన్ 326 ఐ.పి.సి.కి ఎ, బి లను చేర్చడం జరిగింది. 326ఎ ప్రకారం ఎవరైనా యాసిడ్ దాడులకు పాల్పడి/యాసిడ్ పోసి తీవ్రమైన గాయాలు కలుగచేస్తే 10 సం॥జైలు శిక్ష లేక యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. దాంతో పాటు బాధితురాలికి, నిందితుడికి జరిమానా విధించి ఆ సొమ్మును అందచేస్తారు. సెక్షన్ 326బి ప్రకారం ఎవరైనా యాసిడ్ పోసినా/పోసే ప్రయత్నం చేసినా 5 నుండి 7 సం॥జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. మీరు వెంటనే పోలీస్‌లను ఆశ్రయించండి. వారు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వండి. వీలుంటే వారి దుశ్చర్యలను మీ సెల్‌ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేయండి. వారు వెళ్లే దారిలో మీరు ఒంటరిగా సంచరించకండి.

 

మేడమ్, నేనొక పాఠశాల హెడ్ మాస్టర్‌ను. మాది బాలికల పాఠశాల. మా స్కూల్ ఉండే లైన్లో మా విద్యార్థినులు కొంతమంది ఒక చోట ఆగిపోయి తదేకంగా చూడడం గమనించాను. వారు వెళ్లిపోయిన తర్వాత నేను వెళ్లి, వారిని అంతగా ఆకర్షించిన విషయమేమిటా అని చూస్తే, ఒక పెద్ద వాల్‌పోస్టర్ ఉంది. ఒక సినిమాకు సంబంధించినది. ఇద్దరు యువతీ యువకులు అత్యంత అభ్యంతరకరమైన భంగిమలో ఉన్న దృశ్యం. నా మనస్సు చాలా బాధపడింది. విద్యార్థినులు ఇప్పుడిప్పుడే టీనేజ్‌లోకి వస్తున్నవాళ్లు. వారి మనస్సుపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టర్స్ ఎంత దుష్ర్పభావం చూపిస్తాయో తలచుకుంటే భయమేస్తుంది. ఒక బాధ్యతగల హెడ్ మాస్టర్‌గా నేనేమీ చేయలేనా? - జి.వి.రంగారెడ్డి, హైదరాబాద్
మీలాంటి బాధ్యతగల గురువులుండబట్టే మన వ్యవస్థ ఈ మాత్రమైనా ఉంది. మీ మనసును కలచివేసిన పోస్టర్‌ను తొలగించాలంటే మీరు తప్పకుండా పూనుకోవాలి. మీకా అధికారం ఉంది. దీనికి సంబంధించిన చట్టం కూడా ఉంది. అదే ప్రొహిబిషన్ ఆఫ్ ఆబ్‌సీస్ అండ్ అబ్జక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్‌టైజ్‌మెంట్స్ యాక్ట్ 1997.


ఈ చట్టాన్ని అనుసరించి: - వీక్షకులను నైతికంగా పతనం చేసేవి - లైంగిక వాంఛలను ప్రేరేపించేవి - వీక్షకులను సంస్కారహీనులుగా చేసేవి - మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు, మానభంగాలను ప్రేరేపించేవి - శృంగార భావాన్ని అసభ్యరీతిలో ప్రదర్శించేవి తదితర చిత్రాలను ‘అసభ్యకరమైన పోస్టర్‌లు’ అంటారు. పై నేరాలకు పాల్పడిన వారికి 6 నెలలు జైలు, 6 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. మీరు హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు కనుక ‘కమీషనర్ ఆఫ్ పోలీస్’ వారికి ఫిర్యాదు చేయండి.

 

మేడమ్, నా చెల్లెలి వివాహమై 8 సం॥అయ్యింది. పెళ్లి అయిన ఏడాది తర్వాత అతను చెప్పా పెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు. ఇద్దరి మధ్య ఏ గొడవలూ లేవు. ఎన్నో రకాలుగా అతని ఆచూకీ కనుక్కొనే ప్రయత్నం చేశాం. అతని అమ్మానాన్నలు కూడా ఎంతో సహకరించారు. స్టేషన్‌లో మిస్సింగ్ కేస్ కూడా పెట్టాం. అయినా ఆచూకీ దొరకలేదు. దాదాపు 7 సం॥నిండిపోయాయి. చెల్లికి సంతానం లేదు. అమ్మానాన్నలు పెద్దవారైపోయారు. చెల్లెలి భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది. ఏంచేయమంటారు? - ఒక సోదరుడు, ఆదోని

ఒక వ్యక్తి తన ఆచూకి, యోగక్షేమాలు తెలియవలసిన వారికి 7 సం॥నుండి తెలీకుండా పోయినప్పుడు అతను చట్టప్రకారం చనిపోయిన వ్యక్తిగానే పరిగణింపబడతాడు. మీరు వెంటనే పై కారణం వల్ల వివాహాన్ని రద్దు పరచమని కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టువారు ‘పేపర్ నోటిఫికేషన్’ ఆర్గర్ ఇచ్చి, తర్వాత వివాహాన్ని రద్దు చేస్తారు. మీ చెల్లికి పునర్వివాహం చేయవచ్చు.


ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్
ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement