తప్పులేకున్నా తప్పుడు కేసు పెట్టింది
లీగల్ కౌన్సెలింగ్
నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాను. నా పెళ్లయి ఆరునెలలైంది. పెద్దలు కుదిర్చిన వివాహమే మాది. నా భార్య బాగా చదువుకున్న వ్యక్తి. తను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. మొదటినుండి ఆమె నా పట్ల ఆసక్తి చూపించలేదు. కొత్త కదా కొంత టైమ్ పడుతుందిలే అని ఊరుకున్నాను. నేను ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్ వెళ్లేవాడిని. తను కనీసం నవ్వుతూ కూడా రిసీవ్ చేసుకునేది కాదు. మా సంసార జీవితం మొదలవలేదు. నేను మాత్రం తనతో ఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరించేవాడిని.
అయినా మాటామంతీ లేకపోవడంతో ఐదునెలలు వేచి చూసి మా అత్తామామలకు ఈ విషయం చెప్పాను. వారు నేను చేతగానివాడినంటూ నన్నే నిందించడం ప్రారంభించారు. అంతేకాని కూతుర్ని నా ముందు కూర్చోబెట్టి అడగలేదు. పరిస్థితి ఇలా ఉంటే, ఎక్కడో మారుమూల పల్లెటూళ్లో ఉండే మా అమ్మానాన్నలపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. పోలీసులు వాళ్లకు ఫోన్ చేశారట. వాళ్లిద్దరూ సీనియర్ సిటిజన్స్.
పైగా ఆరోగ్యాలు బాగాలేని వాళ్లు. ఇక నాకైతే వాళ్లకంటే ముందుగానే పోలీసుల నుండి ఫోన్లు వచ్చాయి. చాలా కరకుగా మాట్లాడుతున్నారు. అసలు నాతో సంసారమే చేయని అమ్మాయి.. పట్టుమని పదిరోజులు కూడా నాతో గడపని అమ్మాయి మా పైన కేసు వేయడం న్యాయమా? ఏ సంబంధం లేని అమాయకులైన నా తల్లిదండ్రులకు నేను ఏం సమాధానం చెప్పాలి? నేను ఎంతో కుంగిపోతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి.
- రాజేష్, బెంగళూరు
మీ ఆవేదన అర్థమైంది. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యా. పెద్దవయసులో తలిదండ్రులకు మనోవేదన, కోటి ఆశలతో వివాహం చేసుకున్న వారికి దారుణమైన వేధింపులు ఎదురవుతున్నాయి. ఆ అమ్మాయికి మీతో వివాహం ఇష్టం లేకపోయినా, తలిదండ్రుల బలవంతం మీద పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది. అందుకే మీతో సంసారం చేయలేదు. దిక్కుతోచని పేరెంట్స్ విషయం వివరించి, సజావుగా సమస్య పరిష్కరించుకోకుండా మీమీద ఇలా కేసు వేయడం న్యాయం కాదు.
కనీసం ఆ అమ్మాయి మీతో మనసు విప్పి మాట్లాడితే బాగుండేది. మీరు, మీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. ధైర్యంగా వారికి మీ వాదన వినిపించండి. పేరెంట్స్‌ని, సిస్టర్స్‌ని వేధించవద్దని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. మీరు కూడా వివాహమైనప్పటినుంచి ఆమె ప్రవర్తన ఎలా ఉండేది, మీరు అసలు ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చారో అన్నీ గుర్తుకు తెచ్చుకుని పోలీసులకు వివరించండి. ఒకవేళ వాళ్లు అంటే మీ అత్తమామలు ఏమైనా ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే ముందుగా మీరు యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నాలు చేయండి లేదా స్టేషన్ బెయిల్ అడగండి. తర్వాత ఎఫ్.ఐ.ఆర్ క్వాష్ చేయమని హైకోర్టును ఆశ్రయించండి.
మీ పేరంట్స్‌ను తప్పనిసరిగా పోలీస్ కేసునుండి డిలీట్ చేస్తారు. మంచి అనుభవజ్ఞులెన క్రిమినల్ లాయర్‌ను సంప్రదించండి. ఇక మీ వివాహం ఫలప్రదం (కాంజుమేట్) కాలేదు కనుక నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేయమని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించండి. ఏది ఏమైనా ఉట్టిపుణ్యానికి ఇన్ని బాధలా అనిపిస్తుంది. అది నిజం కూడా! కాని కొన్ని పరిస్థితులలో తప్పవు.
మా అమ్మగారు ఇటీవలే కాలం చేశారు. ఆమె పేరు మీద కొంత వ్యవసాయ భూమి, ఒక ఇల్లు ఉన్నాయి. మా నాన్నగారు తన సంపాదనతో అవి కొని అమ్మపేరున రిజిస్టర్ చేయించారు. అమ్మ ఎలాంటి వీలునామా రాయలేదు. నాన్నగారు వృద్ధులైపోయారు. మేం ముగ్గురం సంతానం. ఇద్దరు అన్నదమ్ములం, ఒక చెల్లెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. నాన్నగారు నా దగ్గరే ఉంటున్నారు. అమ్మపేరున ఉన్న ఆస్తిని ఎలా పంచుకోవాలి? చెల్లెలికి వాటా ఇవ్వాలా? దయచేసి సలహా ఇవ్వగలరు.
- ఎన్.శివ కుమార్, మంచిర్యాల
ఒక హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె తదనంతరం ఆమె ఆస్తికి మొదట కొడుకులు, కూతుళ్లు, భర్త, ఆమెకంటే ముందే చనిపోయిన కుమారుడు లేదా కుమార్తె సంతానం వారసులవుతారు. మీకు తండ్రి, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు కాబట్టి మీ అందరూ సమాన వాటాదారులవుతారు.
నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవారు. ఒకరోజు రాత్రి విధులు ముగించుకుని కంటోన్మెంట్ ఏరియా నుండి వస్తుండగా ఒక మిలిటరీ ట్రక్ ఢీకొని నా భర్త రెండుకాళ్లూ ఫ్రాక్చర్ అయి ఎడమ కాలు తీసేశారు. మేం నష్టపరిహారం గురించి కేసు వేద్దామంటే ఆ ట్రక్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ బలగాలకు సంబంధించినది కనుక నష్టపరిహారం రాదంటున్నారు. నిజమేనా? వివరించగలరు.
- శివమ్మ, సికిందరాబాద్
మీకు తప్పకుండా నష్టపరిహారం వస్తుంది. సాధారణంగా తమ వాహనాలకు నష్టపరిహార బాధ్యత ఉండదని ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వానికి మినహాయింపు ఇవ్వాలని వారి వాదన. తమ సేవకులు చేసిన తప్పిదానికి తాము బాధ్యత వహించమని ప్రభుత్వాల వాదన. కాని ఇది తప్పని సుప్రీంకోర్టు తన తీర్పులలో స్పష్టం చేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వ్యక్తులకు ప్రమాదం వాటిల్లితే ప్రభుత్వం ఆ తప్పుకు బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని కోర్టువారు అనేక కేసులలో తెలియపరిచారు.
పుష్పా టాగోర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు వారు ప్రభుత్వానికి నష్టపరిహార మినహాయింపు ఉండదని తీర్మానించారు. ఇక్కడ ట్రక్ ప్రభుత్వానిది. సేవకుడు డ్రైవర్. అంటే ప్రభుత్వంతో నియమించబడిన వ్యక్తి అని అర్థం. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మీకు తప్పకుండా పరిహారం అందుతుంది. మీరు నిపుణులైన లాయర్‌ను సంప్రదించి, కేసు వేయండి. విష్ యు ఆల్ ది బెస్ట్.
- ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com