ఇంటì కెళ్లకుండా కొన్ని గంటలుగా బయట బయటే తిరుగుతున్నాడు ఖడ్గధారి. ఇంటికెళితే భార్య ఏడుపు చూడలేడు. అందుకే బయట తిరుగుతున్నాడు. అతడితో పాటు అతడి ఆలోచనలూ తిరుగుతున్నాయి. భర్త చనిపోతే భార్య ఎందుకు ఏడుస్తుందో అతడికి అర్థం కావడం లేదు! కడుపున పుట్టినవాళ్లు చనిపోతే ఏడ్వడంలో అర్థం ఉంది. కట్టుకున్నవాడు కడుపున పుట్టినవాడు కాదు. మరెందుకు ఏడుస్తారు ఈ ఆడవాళ్లు?! భర్తనేవాడు ఎక్కడో బయటి నుంచి వస్తాడు. ఎప్పుడో చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. మధ్యలో కొన్నాళ్లు కలిసి ఉన్నందుకేనా ఇంత దుఃఖం! భార్య మీద కోపం వచ్చిందతడికి. పెద్ద పిల్లే కదా.
చావులు చూడకుండానే పెరిగిందా! ఇదేమైనా చావులు లేని లోకమని ఎవరో చెబితే నమ్మి వచ్చేసిందా! చికాకేసింది ఖడ్గధారికి. భార్య అమాయకత్వం అతడిని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఎట్లా బతుకుతుందీ అనుకున్నాడు. ఆ వెంటనే మళ్లీ అనుకున్నాడు. తను ఆమెను బతికించిందేమీ లేదు కనుక, ఎలా బతుకుతుందన్న చింత తనకు అవసరం లేదనుకున్నాడు. కానీ ఆమె ఏడుపే! ఎవరూ పట్టలేకపోతున్నారు. గుండెలు బాదుకుంటోంది. స్పృహ తప్పి పడిపోతోంది. ముఖం మీద నీళ్లు చల్లుతున్నారు. కళ్లు తెరిచి చూసి, మెడలో మంగళసూత్రాన్ని రెండు గుప్పెళ్లతో బిగించి పట్టుకుని, దేవుణ్ణి శాపనార్థాలు పెడుతోంది! రోజూ పూజ చేసే దేవుణ్ణేనా తను ఇంతగా తిట్టగలుగుతోంది?!
ఖడ్గధారి చనిపోయి అప్పటికి కొన్ని గంటలే అయింది. ఆ ఉదయం నోట్లో బ్రష్ పెట్టుకుని పళ్లు తోముకుంటూ, కళ్లు మూసుకుని పక్కింట్లోంచి టీవీలో వస్తున్న డైలాగులేవో వింటూ అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయాడు. అవేమీ గుండెను ఆపేంత బరువున్న డైలాగులు కావు. వాటికి సంబంధం లేకుండా గుండె తనకై తాను ఆగిపోయింది.
తను విన్న ఆ చివరి డైలాగ్ ఖడ్గధారికి గుర్తుంది. ఏ సినిమాలోనిదో మరి. రాజేంద్రప్రసాద్ అంటుంటాడు.. ‘ఇదివరకట్లా ఆడవాళ్లు అమాయకులు కాదు’ అని. ఆ మాట.. కోట శ్రీనివాసరావుతోనో, మరెవరితోనో అంటున్నట్లున్నాడు.
ఖడ్గధారికి ఓ అలవాటుంది. మాట గానీ, పాట గానీ ఏదీ పూర్తిగా వినడు. టీవీ అయినా అంతే. సినిమా అయినా అంతే. మనుషులైనా అంతే. వినకూడదనేం కాదు, కొంత విన్నాక, కొంత చూశాక తనకు తెలియకుండానే ఆ విన్నదాన్ని, ఆ చూసినదాన్ని పట్టుకుని తన ఆలోచనల్లోకి తను వెళ్లిపోతాడు. ‘ఇదివరకట్లా ఆడవాళ్లు అమాయకులు కాదు’ అన్న మాటను పట్టుకున్నాయి అతడి ఆలోచనలు. అసలు ఆడవాళ్లు ఇప్పుడైనా, ఎప్పుడైనా అమాయకంగా ఎందుకుండాలి? ఉంటారని ఎందుకనుకోవాలి? ఒకవేళ ఆడవాళ్లు అమాయకులే అయితే, వాళ్లను అమాయకులుగా ఉంచేసింది మగవాళ్లే కదా.. ఇలా ఆలోచనలు సాగుతూ ఉండగా.. నోట్లో బ్రష్షు నోట్లో ఉండగానే టప్పున ఎగిరిపోయాడు ఖడ్గధారిలోని జీవుడు! ఖడ్గధారి కుప్పకూలిన విషయం లోపల ఉన్న భార్యకు తెలీదు.
ఎప్పట్లా అతడు బయట సింకు దగ్గర నిలబడి గోడవతలి నుంచి వచ్చే పాటల్ని, మాటల్ని వింటూ కాలకృత్యాలను మెల్లిగా కానించుకోవడం ఆమెకు తెలియని సంగతేం కాదు. ప్రతి ఉదయం అతడికి అదొక ఇష్టమైన వ్యాపకం.పక్కింట్లోంచి వినిపించే పాటే.. వీళ్లింట్లోనూ వస్తుంటుంది. అయితే అది అతడి గమనింపులో ఉండదు! అటువైపు నుంచి వచ్చే పాటలకు, మాటలకు మాత్రమే అతడు ట్యూన్ అవుతాడు. ఆ అలవాటు అతడికి ఎలా అయిందనే మాట అటుంచితే.. అది ఎంతలా అయ్యిందంటే.. పక్కింటివాళ్లు ఓసారి నాలుగు రోజులు ఊరెళ్లినప్పుడు ఖడ్గధారి బాగా ఇబ్బందిపడిపోయాడు. ఆ సంగతిని అతడి భార్య ఏదో సందర్భంలో పక్కింటి వాళ్లతో చెప్పింది కూడా. అందుకు వాళ్లు ఎంతగానో సంతోషించారు.
తిరిగినంతా తిరిగి, ఇంటివైపు నడుస్తున్నాడు ఖడ్గధారి. తన భార్య ఇంకా గుండెలు బాదుకుంటూనే ఉంటుందా? ఏడిచే ఓపిక కూడా లేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుందా? చీకట్లో నడుస్తూ ఆలోచిస్తున్నాడు. దారి మధ్యలో శ్మశానం ఉంది. అది దాటుకుని కిలోమీటరు దూరం వెళితే ఖడ్గధారి ఇల్లు వస్తుంది. నడక మధ్యలో ఓ మనిషి ఖడ్గధారికి తగిలాడు. ఖడ్గధారిని అతడు అనుమానంగా చూశాడు. ‘‘ఏంటలా చూస్తున్నావు?’’ అడిగాడు ఖడ్గధారి. ‘‘ఈ దారిన, ఈ సమయంలో వెళ్లేవాళ్లందర్నీ నేను ఇలాగే చూస్తాను. నన్ను ఈ శ్మశానం నుంచి దాటిస్తారా?’’ ప్రాధేయపడినట్లుగా అడిగాడు ఆ వ్యక్తి. ‘దెయ్యాలంటే ఈ మనుషులెందుకు ఇంత భయపడి చస్తారో’ అనుకున్నాడు ఖడ్గదారి. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ‘‘ఎప్పుడో గానీ ఈ దారి గుండా రాను. కానీ నేనెప్పుడు ఇటువైపు వచ్చినా ఒక చితి కాలుతూ ఉంటుంది’’ అన్నాడు ఆ వ్యక్తి.
ఖడ్గదారి అతడివైపు, చితివైపు చూశాడు. దూరంగా కాలుతున్న చితి మంటల వెలుగులో అతడి ముఖంలోని భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ చితిలో మండుతున్నది తనేనని అతడికి చెప్తే! ‘‘ఏమైనా మాట్లాడండి.. మౌనంగా ఉంటే నాకు అదోలా ఉంది’’ అన్నాడు ఆ భయపడుతున్న మనిషి. మాట్లాడే మూడ్‌లో లేడు ఖడ్గధారి. ‘నువ్వే మాట్లాడొచ్చు కదా’ అనొచ్చు. కానీ అతడు మాట్లాడినా వినే మూడ్ ఖడ్గధారికి లేదు. భార్య గురించి ఆలోచిస్తున్నాడతడు. తనిక్కడ చితిలో ఉంటే తనక్కడ కాలిపోతూ ఉంటుంది. త్వరగా ఇంటికి చేరుకుని, ‘ఇలాగైతే ఎలా! ధైర్యంగా ఉండలేవా?!’ అని ప్రేమగా మందలించాలని అతడి మనసు ఆరాటపడుతోంది. ఖడ్గధారి, ఆ వ్యక్తి.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే కొంత దూరం నడిచారు. చితిని కూడా దాటుకుని ముందుకు నడిచారు.
‘‘ఒక్కటే అనుకున్నాను’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘ఏంటి.. ఒక్కటే ?’’ అని అడిగి, సమాధానం వినకుండా మళ్లీ ఆలోచనల్లో పడిపోయాడు ఖడ్గధారి. మరికొంత దూరం కలిసి నడిచాక, ఇద్దరూ విడిపోయారు. ఖడ్గదారి నేరుగా తన ఇంటివైపు వెళ్లాడు. ఇంటి దగ్గర వీధిలో మాటలు వినిపిస్తున్నాయి. ‘‘ఇద్దర్నీ పక్కపక్కనే పేర్చారు. ఎంతైనా భార్య కదా. పాడెను లేపుతుంటే చూళ్లేక అక్కడే కుప్పకూలిపోయింది’’.‘‘పక్కింటి వాళ్లతో ఏవేవో ఆలాపనగా మాట్లాడిందట. ‘ఆయన చనిపోలేదు, ఉదయాన్నే టీవీ పెట్టడం మర్చిపోకండి’ అని అంటుంటే వాళ్లకు కన్నీళ్లు ఆగలేదట’’. ఖడ్గధారి గుండె ముక్కలయింది. తిరిగి అతడు చితి వైపు గాలిలోకి లేస్తుండగా ఎవరో అంటున్న మాట చెవులకు సోకింది – ‘‘ఈ భార్యలు ఇంత అమాయకంగా ఉంటారెందుకో!’’
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment