గాయాలతో తన్వీర్, పక్కన ముంతాజ్(ఫైల్)
కోల్‌కతా : భర్త తనను వదిలి ఇంటి నుంచి తరుచూ పారిపోతున్నాడనే కోపంతో గన్నుతో అతని రెండు చెవులను కాల్చేసిందో భార్య. ఈ ఘటన మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతాకు సమీపంలోని నర్కెల్‌గంగకు చెందిన తన్వీర్(20) రెండు సంవత్సరాల క్రితం తనకంటే వయస్సులో 20 సంవత్సరాలు పెద్దదైన ముంతాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ముంతాజ్ తన్వీర్‌ను తరుచూ చిత్రహింసలకు గురిచేసేది. ముంతాజ్ పెట్టే బాధలు భరించలేక అతను ఇంటి నుంచి పారిపోయిన ప్రతిసారి వెనక్కు పట్టుకువచ్చి చిత్రహింసలు పెట్టేది. తమ కొడుకును విడిచి పెట్టాల్సిందిగా తన్వీర్ తల్లిదండ్రులు ఆమెను బ్రతిమాలినా వినలేదు. భర్త ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బులు సైతం తీసుకుని అతన్ని ఇంటికి పంపించలేదు.
తన్వీర్ గత కొద్దిరోజులుగా ముంతాజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. అతన్ని సొంత ఊరికి పోనివ్వకుండా, తల్లిని కలవనీయకుండా ఆంక్షలు విధించింది. కొద్దిరోజుల క్రితం అతడు ఆ ఇంటి నుంచి మల్లిక్‌పుర్‌కు పారిపోయినా.. తన మనషుల సహాయంతో వెనక్కి రప్పించిన ముంతాజ్, ఆమె చెల్లెళ్లు అతన్ని తీవ్రంగా హింసించారు. మంగళవారం రాత్రి ముంతాజ్ గన్నుతో తన్వీర్ రెండు చెవులను కాల్చేసింది. దీంతో తన్వీర్ చనిపోయాడని అక్కాచెల్లెళ్లు భావించారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ తన్వీర్ అక్కడినుంచి తప్పించుకుని దగ్గరలోని ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. తన్వీర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముంతాజ్, ఆమె చెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment