ఆయనకి కొద్దిగా క్లోజ్‌గా మూవయ్యాను...
లీగల్ కౌన్సెలింగ్
మా వివాహమై నాలుగు సంవత్సరాలైంది. ఇరువురమూ లెక్చరర్లం. ఒకే కళాశాలలో పనిచేస్తున్నాము. కాలేజీకి కలసి వచ్చేవాళ్లం. కలిసి ఇంటికి వెళ్లేవాళ్లం. నాకు ఆరు నెలల క్రితం వేరే కాలేజీలో ఎక్కువ జీతంపై మంచి పోస్టింగ్ వచ్చింది. నా భర్త అంగీకారంతోనే జాయిన్ అయ్యాను. అక్కడ ఎక్కువ మంది పురుష లెక్చరర్లే ఉన్నారు. నా యూనివర్శిటీ క్లాస్‌మేట్ కూడా అక్కడే పని చేస్తుండడంతో పూర్వ పరిచయంతో నేనతనితో కొద్దిగా క్లోజ్‌గా మూవయ్యాను. అంటే కూరలూ వగైరా షేర్ చేసుకోవడం, ఇంటికి లంచ్‌కి పిలవడం వంటివి. ఎందుకంటే అతను బ్యాచిలర్. పైగా తలిదండ్రులు వేరే రాష్ట్రంలో ఉంటారు. మొదట్లో నా భర్త కూడా అతనితో కలివిడిగానే ఉన్నారు. తర్వాత ఏమైందో ఏమో కానీ, నన్ను తీవ్రంగా అనుమానించడం మొదలెట్టారు. చీటికిమాటికీ చిరాకు పడటం, ఆఖరికి కొట్టడం కూడా ప్రారంభించారు. భరించలేక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో చేరాను దూరంగా ఉంటే మారతాడని. కానీ మొన్న నాకు కోర్టునుండి విడాకుల నోటీసులు పంపారాయన. అదీ కూడా అడల్టరీ గ్రౌండ్స్‌మీద! నాకేపాపమూ తెలీదు. ఇది తెలిసి నా స్నేహితుడు రిజైన్ చేసి వెళ్లాడు. నాకు కోర్టు విచారణ భయంగా ఉంది. అంతమంది మధ్యలో ఈ ఆరోపణలు ఎలా ఎదుర్కోవాలి? నా నిజాయితీని నిరూపించుకోగలను కానీ, కోర్టునిండా న్యాయవాదులూ, కక్షిదారులూ ఉంటారు కదా! వాళ్లను చూస్తేనే భయం. పైగా తెలిసిన వాళ్లు కూడా కనపడుతుంటారు కదా! అవమానకరంగా ఉంటుంది. నేను ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?
- పుష్పకుమారి, ఆదోని.
అడల్టరీ గ్రౌండ్‌ను నిరూపించడం చాలా కష్టం. పైగా మీ వారిది కేవలం అనుమానం.. అందులో వాస్తవం లేదు కూడా! కాబట్టి మీరు తప్పకుండా కేసు గెలుస్తారు. కాకపోతే మీరు అంతలా భయపడ వలసిన అవసరం లేదు. ఇలాంటి సున్నితమైన విషయాలు విచారణకు వచ్చినప్పుడు సెక్షన్ 11, కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984 ప్రకారం అడల్టరీ ఆరోపణలు, పిల్లల లెజిటిమసీ గురించిన ఆరోపణలు, లైంగిక ప్రవర్తనల గురించి, నపుంసకత్వం గురించిన ఆరోపణలు మొదలైన విషయాలకు సంబంధించిన విచారణలను గోప్యంగా జరపమని కోరవచ్చు. అంతేకాకుండా హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 22 కూడా రహస్యంగా విచారణ జరపాలని తెలియజేస్తుంది. కనుక ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్ కావాలని అడగండి. కోర్టువారు తప్పకుండా అనుమతిస్తారు. అంటే విచారణ సమయంలో మీరు, మీ భర్త, మీ ఇరువురి న్యాయవాదులు, న్యాయమూర్తిగారు మాత్రమే కోర్టులో ఉంటారు. మిగతా వారినందరినీ బయటకు పంపించి, తలుపులు మూసివేసి, విచారణ ప్రారంభిస్తారు. మీరు స్వేచ్ఛగా, భయం లేకుండా మీ వాదనలను న్యాయమూర్తిగారికి విన్నవించుకోవచ్చును.
మేడమ్, నేను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు ఒక బాబు ఉన్నాడు. ఒక్కడే చాలని సరిపెట్టుకున్నాము. వాడికిప్పుడు 6 సంవత్సరాలు. స్కూలుకు వెళుతున్నాడు. నాకు ఇప్పుడు వీడితోపాటు ఒక పాప కూడా ఉంటే బాగుండుననిపిస్తోంది. కానీ నాకిక పిల్లలు పుట్టే అవకాశం లేదు. గైనకాలజిస్టుగా ఆ సంగతి నాకు తెలుసు. ఒక పాపను దత్తత తీసుకొని, తల్లిగా పెంచుకోవాలని కోరికగా ఉంది. బాధాకరమైన విషయమేమిటంటే, నేను ముస్లిమ్‌ని కనుక దత్తత తల్లిగా ఉండే అవకాశం లేదని, మమ్ములను చట్టం దత్తత తల్లిగా పరిగణించదని చెబుతున్నారు. దీనికి కారణమేమిటి? నా కొలీగ్. డా. సావిత్రి ఒకపాపను దత్తత తీసుకుని చట్టప్రకారం తల్లి అయారు. మరి నాకు ఆ అవకాశం ఎందుకు లేదు?
- హసీనా, గుంటూరు
పిల్లలను దత్తత తీసుకోవాలంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం తీసుకోవాలి. తీసుకున్న వారు చట్టప్రకారం తలిదండ్రులుగా పరిగణింపబడతారు. కానీ ఆ చట్టప్రకారం హిందువులు, సిక్కులు దత్తత తీసుకోవచ్చు. ముస్లిమ్‌లకు అది వర్తించదు. వీరికి సంబంధించి ప్రత్యేక చట్టం లేదు. అయినా మీకొక అవకాశ ం ఉంది. ‘గార్డియన్స్ అండ్ వార్డ్స్’ చట్టప్రకారం ఒక పాపను పెంచుకోవచ్చు. అంటే గార్డియన్‌గా మాత్రమే. అలాగని కోర్టు డిక్లేర్ చేస్తుంది. చట్టం మిమ్మల్ని గార్డియన్‌గా ఉండమంటుంది. కానీ అమ్మ అని పిలిపించుకోవద్దని శాసించలేదు కదా! తప్పకంండా పాపను పెంచుకోండి. గార్డియన్‌గా ఉంటూ అమ్మగా చలామణి అవుతూ అమ్మ అని పిలిపించుకోండి.
మేము గత పది సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నాము. మేము వివాహం చేసుకోలేదు. అలాగే ఇరువురమూ అవివాహితులమే. ఇటీవల కాలంలో నా సహచరుడు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాడు. నా జీతం మొత్తం తనే తీసుకుని, దుర్వ్యసనాలకు ఖర్చు చేస్తున్నాడు. నేను డి.వి. కేస్ వేయవచ్చా?
- రజిత, హైదరాబాద్
తప్పకుండా. వివాహం లేని బాంధవ్యాన్ని కూడా గృహహింస చట్టం వివాహ బాంధవ్యంగానే పరిగణిస్తుంది. అయితే మీరు భార్యాభర్తలుగా జీవించారని రుజువు చేయడానికి రే షన్ కార్డ్, ఓటర్ కార్డ్, సర్వీస్ రిజిస్టర్, బ్యాంక్ అకౌంట్స్ మొదలైన ఆధారాలను కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్
ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com