నా భర్తకు ఇష్టం లేకుండా..... | Legal Counseling | Sakshi
Sakshi News home page

నా భర్తకు ఇష్టం లేకుండా.....

Published Sun, Jan 17 2016 10:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

నా భర్తకు ఇష్టం లేకుండా.....

నా భర్తకు ఇష్టం లేకుండా.....

లీగల్ కౌన్సెలింగ్
జైపూర్ చుట్టూ తిప్పుతున్నాడు... ఏం చేయాలి...
 
నాకు, నా భార్యకు చెప్పుకోదగ్గ పెద్ద గొడవలేమీ లేవు గానీ... తరచూ పుట్టింటికి వెళ్లిపోతుంటుంది. నేను ఎన్నిసార్లు వారించినా, హెచ్చరించినా వినిపించుకోలేదు. పెపైచ్చూ ఆమె ఎన్నాళ్లు అక్కడ ఉండాలనుకుంటే అన్నాళ్లు అక్కడ ఉండి సావకాశంగా తిరిగి వస్తుంటుంది. దీనివల్ల పిల్లల చదువులు పాడవుతున్నాయి. నాకు చెప్పలేనంత చిరాగ్గా, కోపంగా ఉంటోంది. నాకు ఈ కారణం వల్ల విడాకులు మంజూరవుతాయా?
 - సూర్యకుమార్, విజయవాడ

 మీ ప్రశ్నలో డిసర్షన్ గురించి ప్రస్తావించారు. హిందూ వివాహచట్టం 13 (1)లో దీని  గురించి కూలంకషంగా వివరించడం జరిగింది. మీ ఇద్దరి మధ్య ఉన్నవి సరిదిద్దుకోలేనంత పెద్ద సమస్యలు, పొరబాట్లు కాదని, విడాకులకు అప్లై చేయాల్సినంత పెద్ద గొడవలు లేవని మీరు చెబుతున్న దాన్నిబట్టి తెలుస్తోంది. 13(1) ప్రకారం విడాకులకు అప్లై చేసేనాటికి కంటిన్యువస్‌గా రెండు సంవత్సరాలు భర్తను భార్యగానీ, భార్యను భర్తగాని విడిచి విడిగా జీవిస్తుంటే దాన్ని డిసర్షన్‌గా పరిగణిస్తూ డైవోర్సు అడగవచ్చు. కానీ మీ కేసులో ఆమె వస్తూపోతూ ఉంది. మీతో సంసారం  చేస్తూ మీ మీ కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉంటోంది. కాబట్టి మీరు విడాకులు అడగటానికి సరైన కారణం లేదు. మీరు మీ అత్తమామలను పిలిపించి, ఆమెను కూర్చోబెట్టి మీకు నచ్చని విషయాలు ప్రస్తావించి ఆమె ప్రవర్తనను మార్చుకొమ్మని చెప్పండి. చిన్న చిన్న విషయాలకు విడాకుల కోసం కోర్టులకెక్కి సంసారాన్ని పాడుచేసుకోవద్దు. మంచిగా మాట్లాడుకుని సయోధ్యతో సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా జీవించండి.
 
నాకు పెళ్లయి పదేళ్లు అయ్యింది. నా భర్తకు ఇష్టం లేకుండా ఆయన తల్లిదండ్రులు నన్ను ఆయనకిచ్చి వివాహం చేశారు. నాకు పెళ్లిలో పెట్టిన డబ్బు, నగలు, వెండి మొదలైన విలువైన వస్తువులు నాకు తెలియకుండా తీసుకుని నా భర్త ఎనిమిదేళ్ల క్రితం  ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇప్పటివరకు తిరిగిరాలేదు. నిజానికి మా అత్తమామలు ఎంతో మంచివాళ్లు. ఒక్కటే సంతానం కావడం వల్ల అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కానరాకపోవడంతో వారూ తల్లడిల్లిపోయారు. ఇప్పుడు విసిగిపోయి ఎదురుచూడటం వృథా అని అర్థం చేసుకున్నాం. విలువలేని ఈ బంధానికి ముగింపు ఇచ్చి నా తల్లిదండ్రులు, అత్తమామ నిశ్చయించారు. నేనెలా ప్రొసీడ్ అవ్వాలి?
 - రాణీరెడ్డి, నిజామాబాద్

 మీ జీవితంలో మీరు చిన్నవయసులోనే దురదృష్టవశాత్తు చే దు అనుభవాలను చవిచూశారు. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. ‘‘నాట్ హర్డ్ ఫర్ సెవన్ ఇయర్స్’’ అనేది విడాకులకు గ్రౌండ్‌గా చూపిస్తూ, మీకు... ఆయనకు మధ్య సంసారం జరగలేదని, పెళ్లైన ఎన్ని రోజులకు మిమ్మల్ని విడిచి వెళ్లిపోయారో కూలంకషంగా వివరిస్తూ మీరు మీ లాయర్ ద్వారా విడాకులకు పిటీషన్ ఫైల్ చేయండి. కొద్దికాలంలోనే విడాకులు గ్రాంట్ అయ్యక, మీరు పునర్వివాహం చేసుకుని ఆనందంగా జీవించండి.
 
ఇదొక విచిత్రమైన సమస్య. నా కూతుర్ని మా బంధువులకు దత్తతకు ఇచ్చాను. మాది ఆర్థికంగా ఉన్నత కుటుంబం కాదనీ... మా బంధువులు కోటీశ్వరులని, పిల్లలు లేక బాధపడుతున్నారని మా బంధుమిత్రుల ప్రోద్బలంతో వారి మాటలు విని నా కూతుర్ని పెంపకానికి ఇచ్చాను. నా కూతురు ఇంకా మైనరు. వారు లీగల్‌గా అడాప్షన్ తీసుకుని రెండేళ్లు పెంచుకున్నాక వారికి సంతానం కలగడం వల్ల నా కూతుర్ని తెచ్చి మళ్లీ నా దగ్గరే వదిలివెళ్లారు. అప్పుడే అనుకోని పరిస్థితుల్లో నా భర్త చనిపోయారు. నా ముగ్గురి పిల్లలతో పాటు నేను పెంపకానికి ఇచ్చిన ఈ పాప బాధ్యత కూడా నామీదే పడింది. నేనెక్కువ చదువుకోలేదు. ఉద్యోగం, ఆస్తీపాస్తీ లేవు. నా ముగ్గురు పిల్లల్ని చూసుకోవడమే కష్టమంటే ఈ పాప బాధ్యత కూడా ఇప్పుడు నాపైనే ఉంది. లీగల్‌గా నేనేమీ చేయలేనా? నేను దత్తత ఇచ్చిన కూతురికి, ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల మీద ఏమీ హక్కులు లేవా?
 - శాంతకుమారి, విజయవాడ

 మీ బాధ అర్థమైంది. లీగల్‌గా అడాప్షన్ తీసుకుని ముచ్చట తీరేదాకా ఉంచుకుని, తీరా వారికి సంతానం కలిగేసరికి పాపను తిరిగి మీ ఇంట్లో దింపి వెళ్లడం ఏమీ బాగోలేదు. అడాప్టెడ్ పేరెంట్స్ పాపను అలా వదిలివేయలేరు. వారికి ఆ హక్కు లేదు. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 20 కింద మీరు మీ పాపకోసం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. ఆ పాపకు తప్పక మెయింటెనెన్స్ వచ్చి తీరుతుంది. లీగల్‌గా అడాప్షన్ తీసుకున్నారు కాబట్టి ఆ పాపకు మెయింటెనెన్స్ మాత్రమే గాక, పెరిగి పెద్దయ్యే వరకు చదువుల ఖర్చులు పెంపకానికి తీసుకున్న తల్లిదండ్రులే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ పాప పెళ్లి ఖర్చులు కూడా వాళ్లే భరించాల్సి ఉంటుంది. పెంపకానికి పోయిన పాపకు అందరు న్యాచురల్ డాటర్స్‌కు ఉండే హక్కులే ఉంటాయి. మీరు మెయింటెనెన్స్ కేసు వేసి ఆ కేసు డిస్పోజ్ అయ్యేవరకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వమని ఒక ఐ.ఏ. వేసుకుంటే... కేసు తేలేవరకు జడ్జీగారు ఇంటరిమ్ మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు. పాప చదువుసంధ్యలు, మెయింటెనెన్స్‌కు ఇబ్బంది ఉండదు. తల్లిదండ్రుల ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఈ మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు. వారు ఎలాగూ కలిగిన వారంటున్నారు. కాబట్టి పాపకు మంచి మెయింటెనెన్స్ వస్తుంది. దిగులు పడకండి.
 
నా భర్త కారణం లేకుండా నాకు వ్యతిరేకంగా ఉన్నవీ లేనివీ కల్పించి నన్ను పుట్టింటికి తరిమేసి ఇప్పుడు జైపూర్ కోర్టులో (ఆయన ఉద్యోగం చేస్తున్న ప్రదేశం) డైవోర్సు కేసు ఫైల్ చేశాడు. నేను ప్రతిసారీ జైపూర్ కోర్టుకు అటెండ్ అవ్వలేను. పైగా భాషా సమస్య. నా కాపురాన్ని నిలబెట్టుకోడానికి నేనేం చేయాలి? నాకు విడాకులు వద్దు. నా పిల్లల కోసమైనా నేను నా భర్తతో కలిసి ఉండాల్సిన పరిస్థితిన నాది. నేనేం చేయాలి?
 - పి. లత, ఆదిలాబాద్

 మీరు వెంటనే మీరుంటున్న ప్రదేశంలోని కోర్టుకు మీ కేసును ట్రాన్స్‌ఫర్ చేయమని కోరుతూ సుప్రీం కోర్టులో ట్రాన్స్‌ఫర్ పిటీషన్ దాఖలు చేయండి. మీ అడ్వకేటు ద్వారా మీరిప్పుడు నాకు చెప్పిన కారణాలన్నీ వివరిస్తూ ట్రాన్స్‌ఫర్ పిటీషన్ అప్లై చేయండి. మీ పిటీషన్ తప్పక ఆమోదం పొంది, మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశానికి కేసు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అప్పుడు ఆ కోర్టులో మీ అడ్వకేటు ద్వారా కౌంటర్ దాఖలు చేస్తూ విడాకుల పిటిషన్ డిస్మిస్ చేయమని కోర్టువారిని కోరండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement