నా వయస్సు 19 సంవత్సరాలు ..నేను మేజర్‌ని కదా... | Legal counseling | Sakshi
Sakshi News home page

నా వయస్సు 19 సంవత్సరాలు ..నేను మేజర్‌ని కదా...

Published Sun, Jul 10 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

నా వయస్సు 19 సంవత్సరాలు ..నేను మేజర్‌ని కదా...

నా వయస్సు 19 సంవత్సరాలు ..నేను మేజర్‌ని కదా...

 వైద్యచికిత్సలో నిర్లక్ష్యానికి గురైతే తగిన పరిహారం పొందవచ్చు!
లీగల్ కౌన్సెలింగ్


మేడం, నా వయస్సు 19 సంవత్సరాలు. కొన్నేళ్ల కిందట మా అమ్మానాన్న విడాకులు తీసుకున్నారు. మా అమ్మే ఇన్నాళ్లూ నా బాగోగులు చూసుకుంది. నా దురదృష్టం... నెలరోజుల కిందట  అమ్మ చనిపోయింది. మా నాన్న ప్రభుత్వ ఉన్నతోద్యోగి. అమ్మతో విడాకులైన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుకున్నాడు. వికలాంగుడినైన (పోలియోబాధితుడిని) నా బాధ్యత తీసుకున్న అమ్మ పునర్వివాహం చేసుకోలేదు. నేను పనీ చేయలేని అశక్తుడిని. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. చేతివేళ్లలో కూడా సత్తువ లేదు. మా నాన్న నుండి ఏదైనా ఆర్థిక సాయాన్ని ఆశించవచ్చా? నా అనుమానం ఏమిటంటే, నేను మేజర్‌ని కదా, నాకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉందా? - రాజు, కరీంనగర్
మీకు తప్పకుండా మీ తండ్రి నుంచి మెయింటెనెన్స్ వస్తుంది. ఎందుకంటే మీరు శారీరక వికలాంగులు. పైగా మీ శరీరం ఏ శ్రమా చేయలేని పరిస్థితిలో ఉంది కనక మీరు మేజరైనప్పటికీ మీకు మెయింటెనెన్స్ వస్తుంది. సెక్షన్ 125 సి. ఆర్.పి.సి ప్రకారం ఎవరైనా వ్యక్తి తనకు సరియైన వననులు ఉండి (ఆర్థికపరంగా) తమను తాము పోషించుకొనలేని భార్యను, మైనర్ పిల్లలను, తల్లిదండ్రులను, ఇల్లెజిటిమేట్ పిల్లలను, పోషించకుండా, నిర్లక్ష్యం చేస్తే లేదా తిరస్కరిస్తే ఆటువంటివారు కోర్టును ఆశ్రయించి పోషణ ఉత్తర్వులను పొందవచ్చు. మీ విషయంలో 125 (సి) మీకు వర్తిస్తుంది. అంటే మెజారిటీ వయసు వచ్చినప్పటికీ, శారీరక, మానసిక వైకల్యమున్న లేదా తీవ్రమైన గాయం వల్ల తమను తాము పోషించుకోలేని అక్రమ, సక్రమ సంతానాన్ని పోషించవలసిన బాధ్యత తండ్రిదే. మీరు వెంటనే కోర్టును ఆశ్ర యించవచ్చును. దానికంటే ముందుగా ఒకసారి మీ నాన్నగారిని మీరు సంప్రదిస్తే బాగుంటుంది. ఆయన స్పందించి మీకు శాశ్వతమైన ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది.

 

మేడమ్, నేనొక చిరుద్యోగిని. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. నా తల్లికి 75 ఏళ్లుంటాయి. ఇటీవల చూపు మందగించిందంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. రెండు కళ్లలో శుక్లాలు ముదిరి పోయాయన్నారు. డాక్టర్లను వివరాలడిగితే తప్పకుండా చూపు బాగుపడుతుందనీ, అమ్మకంటే పెద్ద వయసు వారికి కూడా కాటరాక్ట్ ఆపరేషన్ చేసి చూపు మెరుగు పరిచామని చెప్పారు. అమ్మకు శుక్లాల ఆపరేషన్ చేయించాను. దురదృష్టం ఏమిటంటే, ఆపరేషన్ తర్వాత అమ్మకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి, కళ్లు వాచి అరకొరగా ఉన్న చూపు కూడా పోయింది. ఈ వయసులో ఆమెకు ఈ కష్టం రావడం నాకు ఎంతో బాధగా ఉంది. డాక్టర్ల నిర్లక్ష్యం అని అనుమానంగా ఉంది. అమ్మ ఇంకా హాస్పిటల్‌లోనే ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కూతురు నారాయణరావు, విశాఖపట్నం
మీరు అనుమానిస్తున్నట్లు అది తప్పకుండా వారి నిర్లక్ష్యమే అయి ఉంటుంది. అసలెందుకు అలా అయిందో డాక్టర్లను అడగండి. ఇటీవల ఇటువంటి సంఘటనలు ప్రతినెలా ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఉచిత శస్త్ర చికిత్స శిబిరాల్లో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. కొన్ని కేసుల్లో డాక్టర్ల నిర్లక్ష్యం, కొన్ని సందర్భాల్లో నైపుణ్యం లేని, అనుభవం లేని డాక్టర్లు శస్త్రచికిత్సలు చేయడం కారణాలైతే, మందుల కల్తీలు, సెలైన్ కల్తీలు, ఆఖరికి రక్తం కల్తీలు కూడా కారణాలవుతున్నాయి. వీటికి తోడు అపరిశుభ్రమైన ఆపరేషన్ థియేటర్స్, స్టెరిలైజేషన్ చేయని శస్త్ర చికిత్స పరికరాలు వాడటం కూడా కారణాలవుతున్నాయి. మీరు మొదట డాక్టర్లను నిలదీయండి. కేస్ షీట్‌లో ఏమి రాశారో తెలుసుకోండి. మీరు డాక్టర్లపై, వారి నిర్లక్ష్యంపై ఉంటే కేసు పెట్టవచ్చు. ఐపీసీ సెక్షన్ 338 ప్రకారం ఒక వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత రక్షణకు ప్రమాదం వాటిల్లే పనులు చేస్తే అది నేరం. రెండు సంవత్సరాల శిక్ష పడుతుంది. మీరు మీ తల్లిగారికి కలిగిన శారీరక, మానసిక వేదనలకు నష్టపరిహారం కూడా పొందవచ్చును. మె డికల్ బిల్స్, రిపోర్టులు, ఎక్స్‌రేలు అన్నీ సేకరించుకోండి.

 

 వివాహమై ఐదేళ్లయింది. నాకూ, నా భార్యకూ సరిపడక సంవత్సరం నుంచి వేర్వేరుగా ఉంటున్నాము. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆమె నల్గొండలో ఉద్యోగం చేసుకుంటూ తలిదండ్రులతో ఉంటోంది. మా వివాహం వరంగల్‌లో జరిగింది. నేను నా భార్యనుండి విడాకులు తీసుకుందామనుకుంటున్నాను. ఆమె పరస్పర అంగీకార విడాకులకు ఒప్పుకోవడం లేదు. నేను ఏ కోర్టు పరిధిలో కేసు వేయాలి? తెలియజేయగలరు. అన్నట్లు మేము స్పెషల్  మ్యారేజ్ యాక్ట్’ కింద వివాహం చేసుకున్నాము.- వివేక్, హైదరాబాద్
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954ను అనుసరించి సెక్షన్ 31 ప్రకారం అందులో చెప్పినట్లు జ్యూరిస్ డిక్షన్ చూసుకుని పిటిషన్ వేయాలి. సెక్షన్  31 ప్రకారం...వివాహమైన ప్రదేశం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ విడాకుల పిటిషన్ వేయవచ్చు.ప్రతివాది ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ కేసు వేయాలి.వాది, ప్రతివాదులు ఏ ఊరిలో ఆఖరిసారి  కలిసి నివసించారో, ఆ కోర్టు పరిధిలో విడాకుల కేసు వేయవచ్చు.ఒకవేళ భార్య పిటిషనర్ (వాది)అయితే కేసే వేసేటప్పుడు ఆమె ఎక్కడ నివసిస్తోందో ఆ పరిధిలోని కోర్టులో కేసు వేయవచ్చును.


నా సలహా ఏమిటంటే, మీ భార్య ప్రస్తుతం నల్గొండలో ఉన్నారని చెప్పారు కనుక అక్కడే విడాకుల కేసు వేయండి. మీరు ఇతరత్రా ఎక్కడ కేసు వేసినా, ఆమె బదిలీ చేయించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భార్యలు నివసించే జ్యూరిస్‌డిక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

 

మేడమ్, మా పక్కింటివాళ్లు ఒక మైనర్ అమ్మాయిని పనిలో పెట్టుకున్నారు. ప్రతిరోజూ ఆ ఇంటియజమానులు  ఆమెను విపరీతంగా హింసిస్తున్నారు. మొన్న మిల్క్‌బూత్ దగ్గర కనిపించింది. ముఖమంతా వాచిపోయి ఉంది. మేము అడిగితే, బట్టలు శుభ్రంగా ఉతకలేదని వాళ్ల ఆంటీ (తను ఆమెకు ఆంటీ అవుతుందని, అలా అందరికీ చెప్పమని యజమానురాలి ఆదేశం) కొట్టిందనీ, తనకు అక్కడ ఉండటం ఇష్టం లేదనీ, ఏదైనా సాయం చేసి తనను బయటపడేయమని కన్నీళ్ల పర్యంతమైంది. మేము ఆరా తీస్తే, ఆ అమ్మాయి తమకు దూరపు చుట్టమని, ఏదైనా ఆధారం చూపిద్దామని తెచ్చుకున్నామని ఆ ఇంటివాళ్లు చెప్పుకుంటున్నారని తెలిసింది. ఆ పాపకు మేము ఏవిధంగా సాయం చేయగలం?- ఎం.సాయికిరణ్, కరీంనగర్
తప్పకుండా సాయం చేయవచ్చు. మీరు బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించవ చ్చును. అలాగే లేబర్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయవచ్చు. మైనర్లతో చాకిరీ చేయించుకోవడం, హింసించడం చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం నేరం. పిల్లల హ క్కుల ఉల్లంఘన అవుతుంది. అయితే ఫిర్యాదు ఇచ్చేముందు ఆ అమ్మాయి చెప్పినట్లు ఆమె మైనరై ఉండాలి. పనికోసమే ఆమెను ఆమె పేరెంట్స్ పంపి ఉండాలి. అది నిర్ధారించుకోండి.

 

 ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement