మెయిల్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, ఆహ్వానాలు | Legal counseling | Sakshi
Sakshi News home page

మెయిల్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, ఆహ్వానాలు

Published Sun, Jul 17 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

మెయిల్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, ఆహ్వానాలు

మెయిల్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, ఆహ్వానాలు

బహిరంగ ప్రదేశాలలో న్యూసెన్స్ చేస్తే...
 నెలరోజుల జైలు, జరిమానా తప్పదు!

 

లీగల్ కౌన్సెలింగ్
మేడమ్, మేము ఒక చిన్నబస్తీలో ఉంటున్నాము. నేను ఆ బస్తీ మహిళా సంఘం అధ్యక్షురాలిని. మా సమస్య ఏమిటంటే, కొంతమంది మహిళలు, పురుషులు అస్తమానం రోడ్డు మీదికి వచ్చి పెద్ద పెద్ద గొంతులతో అరుస్తూ ప్రతినిత్యం కొట్లాడుకుంటున్నారు. వారి అరుపులు, కేకలకు మేము ఉలిక్కిపడుతున్నాము. పిల్లలైతే గుక్కపట్టి ఏడుస్తున్నారు. నేను చాలాసార్లు వాళ్లను హెచ్చరించాను. మెల్లగా మాట్లాడుకోండని, గొంతులు తగ్గించుకొని పోట్లాడుకోండని అభ్యర్థించాను. రోడ్డు నీ సొమ్మా అని నాపై గొడవకు దిగారు. బస్తీ వాసులేమో వారి గోల భరించలేకపోతున్నామని, ఏదో ఒకటి చేయమని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మేము ఏం చేయాలో సలహా ఇవ్వండి.
 - కుసుమకుమారి, హైదరాబాద్

ఇలాంటి విషయాలు చాలా చోట్ల గమనిస్తున్నాము. కాకుంటే మన ప్రజలలో ప్రశ్నించే తత్వం చాలా తక్కువ. ఎవరైనా ప్రశ్నిస్తే కనీసం వారికి సపోర్టు కూడా చేయరు. మనకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు. మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎంతో ఆసక్తితో ఈ ప్రశ్న అడిగారు. మీకు నా అభినందనలు. ఇక మీ సమస్యకు సంబంధించి తగిన పరిష్కారానికి ఐ.పి.సి 159 సెక్షన్‌ను ఉపయోగించుకోవచ్చును. ఆ సెక్షన్ ప్రకారం ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది బహిరంగ ప్రదేశాలలో ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ, అనునిత్యం కొట్లాడుకుంటుంటే అది నేరం. దానికి సెక్షన్ 160 ఐపీసీ ప్రకారం ఒక నెల జైలుశిక్ష, కొంత జరిమానా పడుతుంది. ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీ సమస్య సద్దుమణుగుతుంది.
 
మేడం, నేనొక డాక్టర్‌ను. ఒక పేరు ప్రఖ్యాతులు గల వైద్యశాలలో పని చేస్తున్నాను. నిత్యం ఎంతోమంది రోగులు కన్సల్టేషన్ కోసం వస్తుంటారు. వారికి తగిన మందులు, చికిత్సల గురించి లెటర్ హెడ్ మీద రాస్తుంటాము కదా, లెటర్ హెడ్‌పై నా మెయిల్ ఐడీ ఉండటం వల్ల అది చాలా మందికి తెలుసు. దాంతో కొందరు వ్యక్తులు గత కొంతకాలంగా మెయిల్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, ఆహ్వానాలు పెడుతున్నారు. నా గురించి, నేనిచ్చే ట్రీట్‌మెంట్ గురించి బాధాకరమైన అభిప్రాయాలు పెడుతున్నారు. దాంతో మెయిల్ ఓపెన్ చేయాలంటే దడపుడుతోంది. ఆ మెయిల్ ఐడీ ఉన్న అకౌంట్‌ను క్లోజ్ చేసేశాను. కానీ ఇంకో ఐడీ తీసుకున్నా, ఇవి తప్పవేమోనని భయంగా ఉంది. ఈ వేధింపులకు అడ్డుకట్ట వేయడం ఎలా? - డా. కల్యాణి, అనంతపురం
కంప్యూటర్ ఆధారిత నేరాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000 వచ్చింది. ఈ నేరాలను సైబర్ క్రైమ్స్ అంటారు. సైబర్ నేరాలకు గురవుతున్నవారు అధికశాతం మహిళలే అని కొన్ని సర్వేలు తెలిపాయి. ఫేస్‌బుక్, ట్విటర్, మెయిల్స్ ద్వారా అనేకమంది వేధింపులకు గురవుతున్నారు. కొన్ని సైట్స్‌లో చైల్డ్ పోర్నోకు సంబంధించిన అనేక అసభ్యమైన అశ్లీలమైన విషయాలు పోస్ట్ చేస్తున్నారు. ప్రసారం చేస్తున్నారు. ఇవి చూసి యువత, పిల్లలు పెడత్రోవ పడుతున్నారు. ఇక మీ సమస్యను హెరాస్‌మెంట్ వయా ఇ-మెయిల్స్ అంటారు. మెయిల్స్ ద్వారా వేధించినా, బెదిరించినా పరువు నష్టం వాటిల్లే సమాచారం పోస్ట్‌చేసినా, పబ్లిష్ చేసినా అది నేరమవుతుంది. సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష, రెండులక్షల జరిమానా పడుతుంది. సైబర్ నేరాల విచారణకు ప్రత్యేకమైన పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. మీరు వారిని సంప్రదించి ఫిర్యాదు చేయండి.  మీరు మనోవేదన నుండి బయటపడి సమస్యను పరిష్కరించుకోండి.

అమ్మా, మాకు ముగ్గురు ఆడపిల్లలు. అందరికీ వివాహాలు అయ్యాయి. ముగ్గురూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఉన్నదంతా వారి చదువుకూ, పెళ్ళిళ్లకూ ఖర్చు చేశాము. వృద్ధాప్యంలో మాకు చిన్న ఇల్లు కూడా లేకుండా చేసుకున్నాము. గతిలేక అభిమానం చంపుకొని అమ్మాయిలను ఆర్థిక సాయం చేయమని అడిగితే, ‘కన్నందుకు పెంచి, పోషించి, పెళ్లిళ్లు చేశారు. అది మీ బాధ్యత’ అని కోప్పడుతున్నారు. ఏం చేయమంటారు?  - రామయ్య, లక్ష్మమ్మ, చీరాల
 తల్లిదండ్రులను అందులో వయోవృద్ధులను పోషించవలసిన బాధ్యత వారి పిల్లలదే. అంటే ఆడపిల్లలు/మగపిల్లలు మీరు మీ పోషణ కోసం సీఆర్‌పీసీ 125 ప్రకారం కేసు వేయండి.
 
 ఇ.పార్వతి
 అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
 parvathiadvocate2015@gmail.com
 
 
 
బాల్య వివాహం నుంచి అలా బయటపడింది!
కేస్ స్టడీ

పదిహేడేళ్ల అమూల్య ఒక కార్పొరేట్ కళాశాలలో హాస్టల్‌లో ఉండి ఇంటర్ చదువుకుంటోంది. తండ్రి పెద్ద భూస్వామి. లంకంత ఇల్లు. పనివాళ్లతో, వచ్చీపోయే బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది. ఇంటర్మీడియెట్ మంచి మార్కులతో పాస్ కావాలనీ ఎంసెట్ రాసి, ఎలాగైనా మెడికల్ సీట్ సాధించాలనీ తమ గ్రామంలో ధర్మాసుపత్రి పెట్టి సేవచేయాలనీ పట్టుదలగా చదువుకుంటోంది అమూల్య. ఇంతలో ఒకరోజు ఉన్నఫళంగా ఇంటికి రావాలని ఆమె చిన్నాన్న హాస్టల్‌కు వచ్చారు. వార్డెన్‌కి ఏం చెప్పాడో ఏమో, ఆమె పర్మిషన్ ఇచ్చింది. తీరా ఇల్లు చేరుకునేసరికి ఇల్లంతా పెళ్లి హడావుడి. పందిళ్లూ, బాజాలు, భజంత్రీలు, చుట్టాలు.. కన్నుమూసి తెరిచేంతలో మేనత్త కొడుకు అమూల్య మెళ్లో మూడుముళ్లూ వేశాడు. తీరా విచారిస్తే మేనత్త కొడుకు ఎవరినో ప్రేమించాడని చూచాయగా తెలిసిందనీ, పరాయి వారికి ఆస్తి దక్కకూడదనీ వారి రక్త సంబంధీకులకే చెందాలనీ, తండ్రులూ, మేనత్తలూ ఆలోచించి, ఈ రకంగా తన గొంతుకోసి బాల్యవివాహం చేశారని అర్థమైంది ఆమెకు. ఏం చేయాలో అర్థం కాలేదు.

అంతా మంచివారే. గారాబంగా పెంచిన అమ్మానాన్నలు, చిన్నాన్న, పిన్నమ్మలు, మేనత్తలు, వారిని చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్‌కు లాగడానికి మనస్కరించలేదు. వెంటనే తన క్లాస్‌మేట్ సంయుక్త అమ్మగారు పేరున్న లాయర్ అని గుర్తుకొచ్చింది. ఆమెను సంప్రదించి ఎవరికీ బాధ కలగకుండా ఏం చేయాలో చెప్పమంది. ఆమె అమూల్య బావ/భర్తను పిలిపించారు. అతనితో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎటువంటి క్రిమినల్ కేసులూ వేయకుండా, ఆ వివాహాన్ని రద్దు పరిచేలాగా సలహా ఇచ్చారు. అమూల్య హాస్టల్‌కి వెళ్లిపోయింది. ఇంటర్ పాసై, ఎంసెట్ లాంగ్‌టెర్మ్‌లో చేరింది. 18 నిండాయి. తను మైనర్‌గా ఉన్నప్పుడే తనకు వివాహమైందనీ, దానిని తాను వ్యతిరేకించాననీ, తనకు, భర్తకు ఏ సంబంధం లేదనీ, హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాననీ, తన మైనర్ వివాహాన్ని రద్దు చేయమని (అనల్‌మెంట్ ఆఫ్ మ్యారేజ్) ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయించారు న్యాయవాది. ఆమె బావ కూడా అందుకు అంగీకరించాడు. కుటుంబ సభ్యులు మొదట బాధపడ్డా, తాము చేసిన తొందరపాటు పెళ్లికి పశ్చాత్తాప పడ్డారు. అమూల్య అలా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement