మా వివాహమై పది సంవత్సరాలు ... | Legal Counseling | Sakshi
Sakshi News home page

మా వివాహమై పది సంవత్సరాలు ... సంతానం

Published Mon, Jan 25 2016 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

మా వివాహమై పది సంవత్సరాలు ...

మా వివాహమై పది సంవత్సరాలు ...

లీగల్ కౌన్సెలింగ్
 
మా వివాహమై పది సంవత్సరాలు అయింది. సంతానం లేదు. అన్ని ప్రయత్నాలు చేశాం. ‘సరోగసి’ మాకు ఇష్టం లేదు. మాకు బాగా తెలిసిన కుటుంబం వారు వాళ్ల పాపను మాకు దత్తత ఇస్తామంటున్నారు. దయచేసి వివరాలు తెలియ చేస్తారా? అంటే ఎలా తీసుకోవాలి, ఏమైనా కండిషన్స్ ఉంటాయా తెలియజేయగలరు.
 - ఒక సోదరి

 
హిందూ అడాప్షన్ అండ్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ 1956ను అనుసరించి దత్తత తీసుకోవాలి. దత్తత స్వీకారం గురించి దానికి సంబంధించిన షరతులు, అర్హతల గురించి ఆ చట్టంలో చెప్పబడింది. ఏ వ్యక్తి అయినా అంటే స్త్రీ అయినా, పురుషుడైనా, వివాహితులైనా, అవివాహితులైనా, వితంతువులయినా, విడాకులు పొందిన వారైనా దత్తత తీసుకోవచ్చును కానీ వారు
 1) మేజర్ అయి ఉండాలి 2) మానసిక స్వస్థత కలిగి ఉండాలి 3) అబ్బాయిని దత్తత చేసుకోవాలంటే వారికి అంతకుముందే జన్మించిన అబ్బాయి ఉండకూడదు 4) అమ్మాయిని దత్తత చేసుకోవాలంటే అంతకుముందే జన్మించిన అమ్మాయి ఉండకూడదు.
 ఇక ఎవరైతే వారి పిల్లలను ఇతరులకు దత్తత ఇవ్వబోతున్నారో వారికి కొన్ని షరతులు ఉన్నాయి.
 1) తల్లి అంగీకారంతోనే తండ్రి దత్తత ఇవ్వాలి 2) తండ్రి చనిపోయినా, హిందూ మతాన్ని వదలివేసినా తల్లి దత్తత ఇవ్వవచ్చును.
 దత్తత చేసుకోబోయే బాలుడు/బాలిక
 1) హిందువై ఉండాలి 2) 15 సం॥లోపు వయస్సు ఉండాలి 3) అవివాహితులై ఉండాలి. ఏవైనా కులాచారాలు, సంప్రదాయాలు అనుమతించితే 15 సం॥వయస్సు దాటిన వారిని, వివాహితులను కూడా దత్తత చేసుకోవచ్చును.
 కొందరు దత్తత సమయంలో ‘హోమం’లాంటి వైదిక కార్యక్రమాలు చేసుకుంటారు. చట్టంలో దాని గురించి కంపల్సరీ లేదు. అలాగే ‘దత్తత స్వీకార పత్రం’ రాయించుకొని రిజిస్టర్ చేయించుకుంటే మంచిది. ముందు జాగ్రత్త చర్యగా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం. అమ్మాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తండ్రి ఆమె కంటే 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. అబ్బాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తల్లి అతనికంటే 21 సంవత్సరాలు పెద్దదై ఉండాలి.


ఒక స్నేహితురాలు ఎంతో అవసరమని ప్రాధేయపడితే లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాను. తను దాని నిమిత్తమై ఒక పోస్ట్ డేటెడ్ చెక్ రాసి ఇచ్చింది, అప్పు తీసుకుంటున్నట్లు పేపర్ రాసి ఇచ్చింది. నెల రోజుల తర్వాత బ్యాంక్‌లో వేసి, నగదు తీసుకోమని చెప్పింది. నేను నెల తర్వాత చెక్ బ్యాంక్‌లో వేశాను. చెక్ బౌన్స్ అయిందని, వాపస్ వచ్చింది. బ్యాంక్ వారిని అడిగితే నా ఫ్రెండ్ అకౌంట్‌లో డబ్బు లేదని, అందువల్ల చెక్ బౌన్స్ అయిందని చెబుతూ ఒక ‘స్లిప్’ లాంటిది ఇచ్చారు. దానిపై ‘ఇన్ సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్’ అని రాసి ఉంది. నాకు కంగారుగా ఉంది. ఫ్రెండ్‌ని నమ్మి నా భర్తకు తెలియకుండా పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చాను. ఆమెను అడిగితే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది. నా డబ్బు నాకు తిరిగి వచ్చేలా లేవు. దయచేసి ఏం చేయాలో చెప్పండి.
 - జానకి, హైదరాబాద్

 ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మేట్లు లేదు. చెక్‌ల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. చెక్‌లకు సంబంధించి చాలామంది మోసపోతున్నారు. మీ విషయంలో కోర్టును ఆశ్రయించక తప్పదు. చెక్స్ బౌన్స్ అయినపుడు అంటే డిజానర్ అయినపుడు నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881ను అనుసరించి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు వేయాలి. నేరం నిరూపణ అయితే జైలు శిక్ష, చెక్‌లో రాసిన మొత్తానికి రెట్టింపు మొత్తం ఇవ్వమని ఆర్డర్. దీనితోపాటు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. కాకుంటే చెక్ డిజానర్ అయిన 30 రోజుల్లోగా చెక్ ఇచ్చిన వారికి నోటీస్ పంపాలి. నోటీసుకి స్పందించి డబ్బు వాపస్ ఇస్తే సరేసరి. లేకుంటే నోటీస్ చేరిన 15 రోజుల తర్వాత మీరు కోర్టులో కేస్ ఫైల్ చేసుకోవచ్చు. మీకు మీ ఫ్రెండ్ ఇచ్చిన చెక్ ఏ బ్యాంక్‌లో డిజానర్ అయిందో అంటే మీరు దాన్ని ఏ బ్యాంక్‌లో వేసుకున్నారో, ఆ బ్యాంక్ పరిధిలోని కోర్టులో కేసు వేసుకోవాలి. మీరు మీ ఫ్రెండ్ నుండి పేపర్ రాయించుకొని మంచి పని చేశారు. అయితే అప్పు ఎందుకిచ్చారో నిరూపించుకోవాలి. ఆ బాధ్యత ఫిర్యాదుదారులదే.
 

 
మా అబ్బాయి చిన్న దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికాడు. అతని వయస్సు 14 సం॥పోలీసులు అతడిని జువినైల్ హోంకు తరలించారు. ఇటీవల కాలంలో మైనర్లకు కూడా కఠినమైన శిక్షలు ఉండాలని, జైలుకు పంపాలని చట్టం వచ్చిందని విన్నాను. నాకు భయంగా ఉంది. మా అబ్బాయిని జైల్లో వేస్తారా?
 - ఒక సోదరి

 భయపడకండి. మీ అబ్బాయి మైనరు. అంటే 18 సం॥లోపు వయస్సు వాడు. దొంగతనం నేరం. అయితే ఈ నేరంలో మైనర్లకు శిక్ష వేయరు. మొదట కేసు విచారణలో ఉన్నపుడు మైనర్లను అబ్జర్వేషన్ హోంలో పెడతారు. నేరం చిన్న నేరమైతే మందలించి వదిలేస్తారు. ఒకవేళ కొంచెం పెద్దదైతే తల్లిదండ్రుల పూచీకత్తుతో వదిలి వేస్తారు. ఇంకా కొంచెం పెద్ద నేరమై అది నిరూపించబడితే వారి మైనారిటీ తీరే వరకు ‘జువినైల్ హోం’లో పెడతారు. అది జైలు కాదు. మైనర్ పిల్లలకు సంబంధించి ‘జువినైల్ జస్టిస్’ (కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్) 2000లను అనుసరిస్తారు. ఇక 2015 సం॥జువినైల్ జస్టిస్ చట్టానికి సవరణ తెచ్చారు. హత్య, అత్యాచారం మొదలైన పెద్ద నేరాలు చేసిన 16 నుండి 18 సం॥వయస్సుగల పిల్లలను నేరం రుజువైతే పెద్దల కారాగారానికి పంపాలని సవరణ చేశారు. మీ అబ్బాయి చేసిన నేరం చిన్నది. అతని వయస్సు కూడా 14 సం॥కనుక భయపడకండి. కానీ అతనిని మంచి మార్గంలో పెట్టే బాధ్యత మీదే!

 

ఆ పిటిషన్ ద్వారా కాపురాన్ని నిలబెట్టుకుంది!

కేస్ స్టడీ 

నళిది, సుధాకర్‌లది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్నారు. ఇరువైపులవారూ ఆగ్రహించి, వీరి పెళ్లికి హాజరు కాలేదు. ఇద్దరూ ఆర్థికంగా స్థిరపడిన వారైనందున మంచి ఇల్లు తీసుకొని కాపురం పెట్టారు. ఒక సంవత్సరం బాగా గడిచింది. తర్వాత సుధాకర్ పేరెంట్స్ అతడితో మాటలు సాగించారు. తమ ఇంటికి వస్తూ పోతుండేలాగా రిలేషన్ మొదలుపెట్టారు. ఈ విషయాలు నళినికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సుధాకర్‌ను కూడా నళినికి చెప్పనీయకుండా కట్టడి చేసి బ్రెయిన్ వాష్ చేశారు. ఫలితంగా సుధాకర్ నళినిని సం॥నుండి వదిలివేసి వేరే ఉంటున్నాడు. నళిని ఎంతగానో ప్రయత్నించింది సుధాకర్‌లోని మార్పు తెలుసుకోవడానికి. కానీ కుంటిసాకులు తప్ప, అసలు విషయం చెప్పలేదు.

చేసేది లేక నళిని ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్’ పిటిషన్ వేసుకుంది (కాపురాన్ని నిలుపుకోవాలని). సుధాకర్ కోర్టుకు హాజరై తనకు అప్పటికే ‘ఎక్స్‌పార్టీ’ డైవర్స్ వచ్చిందని చెప్పాడు. షాక్ తిన్న నళిని తనకు నోటీసు రాలేదని చెప్పుకొని, అతను పంపిన కోర్టు నోటీస్‌లు సెక్షన్‌లో విచారిస్తే ఆమె సంతకం చేసినట్లుగా ఉన్నది. కానీ ఆ సంతకం ఆమెది కాదు. సుధాకర్ ఫోర్జరీ చేసి, మేనేజ్ చేశాడు. అతనిపై ఫోర్జరీ, ఛీటింగ్ కేసు పెట్టి విడాకుల ఆర్డర్‌ను ‘సెట్‌ఎసైడ్’ చేయమని పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత తెలిసింది కోట్ల కట్నంతో సుధాకర్ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడని.
 
 
 ఇ.పార్వతి
 అడ్వొకేట్ అండ్
 ఫ్యామిలీ కౌన్సెలర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement