అమ్మాయిలు చదువుల్లో ఫస్ట్, ఉద్యోగాల్లో బెస్ట్..కానీ..!
లీగల్ కౌన్సెలింగ్
మాకు ఒక్కగానొక్క కూతురు. నేనొక చిరుద్యోగిని. అమ్మాయిని ఏ లోటూ లేకుండా పెంచాము. తను చాలా బ్రైట్ స్టూడెంట్. ఇంజినీరింగ్ పాసై క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం తెచ్చుకుంది. వివాహం చేద్దామని సంబంధాలు చూడటం మొదలుపెట్టాం. తన క్లాస్‌మేట్‌ను ప్రేమిస్తున్నానని వివాహం చెయ్యండని అడిగింది. అబ్బాయిని చూశాము. బాగున్నాడు. అతనికి ఎవరూ లేరని, ఉన్న ఒక అక్క విదేశాల్లో సెటిలైందని చెప్పాడు. సింపుల్‌గా పెళ్లి చేశాం. అమ్మాయి కోసం జాగ్రత్త చేసిన పది లక్షలు ఇచ్చాం. వాళ్లు వేరే కాపురం పెట్టారు. నెలకోసారి వచ్చివెళ్లేవాళ్లు. కొత్త జంట అని మేమూ పెద్దగా వెళ్లేవాళ్లం కాదు. ఆర్నెల్లు గడిచాయి. ఒక రోజు అల్లుడు ఫోన్ చేసి మీ అమ్మాయి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేశాడు. మా గుండె ఆగిపోయింది. ఎవరెవరో వచ్చారు. ఏమేమో అడిగారు. సంతకాలు తీసుకున్నారు. అంతా అయోమయం. అంత్యక్రియలు హడావిడిగా ముగిశాయి. మూడో రోజు అమ్మాయి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. తన టేబుల్ డ్రాలో ఉన్న వస్తువులు పట్టుకెళ్లమని. ఆ వస్తువుల్లో హ్యాండ్‌బ్యాగ్‌లో మా అమ్మాయి రాసిన లెటర్ దొరికింది. తనది రాంగ్ సెలక్షన్ అని, అతను పెట్టే వేధింపులు భరించలేకపోతున్నానని, అతనికి అంతకు ముందే పెళ్లి అయిందని, మోసపోయానని.. ఎన్నో విషయాలు ఉన్నాయి. అల్లుడిని నిలదీశాం. కేస్ వేస్తామన్నాము. అమ్మాయి మానసిక స్థితి బాగాలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుందని మేం సంతకాలు చేసిన పేపర్స్ బయటకు తెచ్చాడు. అవి మేం దుఃఖంలో ఉన్నప్పుడు పెట్టిన సంతకాలు. మేమేం చేయాలి? - ఓ ఆడపిల్ల తల్లిదండ్రులు, హైదరాబాద్
మీ పరిస్థితి చూస్తే బాధగా ఉంది. ఇప్పటి అమ్మాయిలు చదువుల్లో ఫస్ట్, ఉద్యోగాల్లో బెస్ట్, కానీ భర్తల సెలక్షన్‌లో లీస్ట్. మీరు వెంటనే కంప్లైట్ ఇవ్వండి. పోలీసులు ఎటూ కేస్ నమోదు చేసి ఉంటారు. మీ దగ్గర దొరికిన ఆధారాలు వారికి చూపించండి. విషాదంలో, దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడు సంతకాలు పెట్టమని, అది ఎందుకో ఎవరూ చెప్పలేదని తెలియజేయండి. వివాహిత మహిళ వివాహమైన ఏడు సం॥కాలిన గాయాలతోకాని, శారీరక గాయాలతోకానీ, అనుమానస్పద పరిస్థితుల్లో చనిపోతే దానికి కారణం భర్త, అతని కుటుంబ సభ్యుల వేధింపులు, హింస కారణమైతే దానిని వరకట్నపు మరణము లేక ‘డౌరీ డెత్’ అంటారు. సెక్షన్ 304బి ఐ.పి.సి. ప్రకారం ఏడు సం॥నుండి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ పడుతుంది. దానితోపాటు సెక్షన్ 306 ఐ.పి.సి. కూడా మీ కేస్‌లో అన్వయిస్తారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తే అది 306 ఐ.పి.సి. కిందకు వస్తుంది. పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. అది హత్యా లేక ఆత్మహత్యా అన్నది పోలీసులు తేలుస్తారు. కనుక జాగ్రత్తగా కేస్ నడుపుకోండి. అది హత్య అయితే శిక్షలు వేరుగా ఉంటాయి.
మేడమ్, మా అక్కకు ఇద్దరు చిన్న పిల్లలు. అనారోగ్యంతో ఆమె ఇటీవలే చనిపోయింది. బావగారు బాగా ఆస్తిపరుడు. పిల్లలను తన దగ్గరే ఉంచుకుంటానని అనడంతో మేము వాళ్ల గురించి పట్టించుకోలేదు. కన్న తండ్రికే పిల్లలు చెందుతారని అనుకున్నాం. ఒక సం॥బాగానే ఉన్నారు. అక్క సంవత్సరీకాలకు వెళ్లి వచ్చాం. వారం క్రితం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. వెళ్లి చూస్తే, నా ఇద్దరు మేనకోడళ్లు ఏడుస్తూ నన్ను అల్లుకుపోయారు. వాళ్ల నాన్నే వారిని పార్క్‌కు తీసుకొని వెళ్తానని కార్లో తెచ్చి ఊరి బయట వదిలేసి వెళ్లాడంట. వాళ్ల ఇంటికి ఇటీవల ఎవరో ఒక మహిళ వచ్చి తిష్ట వేసిందట. ఆమె, వాళ్ల నాన్న ఇద్దరూ పిల్లలను వేధించేవారట. నాన్న అంటే వణికిపోతున్నారు. మా అమ్మానాన్నలు ఉన్నారు. మేం లక్షణంగా పిల్లలను పెంచుకోగలం. కస్టడీ కోసం కేస్ వేయలేకపోతున్నాం. పిల్లలను ఆ రకంగా నిర్జనమైన ప్లేస్‌లో వదిలి వెళ్లాడు అతను. మాకు గుండె రగిలిపోతుంది. ఎవరో సమయానికి ఆదుకోకపోతే వాళ్ల గతేమయ్యేది. అతనిపై ఏమైనా కేస్ పెట్టవచ్చా? - పరమేశ్వరి, విశాఖపట్నం
తప్పకుండా. పన్నెండు సం॥వయసులోపు పిల్లలను వారి తండ్రి, తల్లి, లేక వారి రక్షణ వహించే వారెవరైనా, ఆ పిల్లలను శాశ్వతంగా వదిలించుకునే ఉద్దేశంతో, ఏదైనా ప్రదేశంలో విడిచిపెట్టి వెళ్లితే అలాంటి వారికి సెక్షన్ 317 ఐ.పి.సి. ప్రకారం ఏడు సం॥జైలు శిక్ష పడుతుంది. మీ పిల్లలను పోలీస్‌లు మీకు అప్పగించారు కనుక వారి దగ్గర నుండి మీకు పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయి.
నా పేరు సరోజ, మాకు ఇద్దరు పిల్లలు. నా భర్త యాక్సిడెంట్‌లో మరణించారు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుండగా ఒక ట్రక్కు ఢీ కొట్టింది. హాస్పిటల్‌కి తీసుకెళ్లే సమయానికే ప్రాణం పోయింది. మోటారు వాహన ప్రమాదాల చట్టం ప్రకారం నష్టపరిహారం కోరమని తెలిసిన వారు చెబుతున్నారు. ఆ ట్రక్కు యజమాని తనకేం సంబంధం లేదంటున్నారు. డ్రైవర్‌కేమో లెసైన్సే లేదని తెలిసింది. ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదిస్తే మాకు సంబంధం లేదంటున్నారు. మాకు ఎవరు నష్టపరిహారం ఇస్తారో తెలియచేయండి. పిల్లల వయస్సులు రెండేళ్ల లోపే. నా పరిస్థితి దీనంగా ఉంది. - గుంటూరు
మీ కేస్‌లో ట్రక్కు యజమానినీ, డ్రైవర్‌నీ, ఇన్సూరెన్స్ కంపెనీని పార్టీలుగా చేస్తారు. కానీ డ్రైవర్‌కి లెసైన్స్ లేదు. ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనల ప్రకారం లెసైన్స్ లేని వ్యక్తులు వాహనం నడిపితే వారు నష్టపరిహారం చెల్లించరు. కనుక మీ కేస్‌లో యజమానే.. అంటే ట్రక్కు యజమానే నష్టపరిహారం చెల్లించాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు వారు కొన్ని కేసులలో తీర్మానించారు.
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
parvathiadvocate2015@gmail.com