సాక్షి, హైదరాబాద్: పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి.. లేదంటే చచ్చిపో... నన్ను కాదని ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటే యాసిడ్ పోసి చంపేస్తా.. అంటూ యువకుడు బెదిరిస్తుండటంతో బాధిత విద్యార్థిని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే డిగ్రీ ఫైనలీయర్ విద్యార్థిని(19) ఇంటి పక్కనే కొంత కాలం క్రితం హరీష్(22) అనే యువకుడు ఉండేవాడు.
ఆవారాగా తిరుగుతూ అమ్మాయిలను వేదిస్తూ స్థానికంగా న్యూసెన్స్‌కు పాల్పడుతుండటంతో తల్లిదండ్రులు ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి మాదాపూర్ వెళ్లారు. అయినాసరే హరీష్ తీరుమార్చుకోకపోగా సదరు విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. తల్లి లేని విద్యార్థిని తండ్రి డ్యూటీకి వెళ్లగానే ఒంటరిగా ఉండటం చూసి హరీష్ ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తుంటాడు.
అంతటితో ఊరుకోకుండా తన స్నేహితులను కూడా పంపిస్తూ ఆమెను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో చదువు మానేసి బాధిత విద్యార్థిని ఇంటిపట్టునే ఉండాల్సి వస్తున్నది. హరీష్ నుంచి ప్రాణహానితో పాటు రాకపోకల సమయంలో యాసిడ్ సీసా పట్టుకొని బెదిరిస్తుండటంతో రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ జితేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment