అలా జరిగితే పారిపోయే దాన్ని: నటి
చెన్నై: తనకే అలా జరిగితే సినిమా నుంచి పారిపోయేదాన్ని అంటోంది నటి హన్సిక. తమిళం, తెలుగు, మలయాళం అంటూ ఒక్కో భాషలో ఒక్కో చిత్రం చేస్తూ బిజీగా ఉంది. మరో భారీ చిత్ర అవకాశం ఆమె ముంగిట వాలనుందనే ప్రచారం జరుగుతున్న వేళ ఆ ముద్దుగుమ్మ ఆడవారికి జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తారు. దీని గురించి ఈ అమ్మడు ఏమంటుందో చూద్దాం. ‘ఆడవారిపై అఘాయిత్యాలను అడ్డుకోవాలి. అలాంటి వాటికి పాల్పడే మగవారు మారాలి. అమ్మాయిపై జరిగే హింసాత్మక సంఘటన కారణంగా ఎందరు బాధింపులకు గురౌతారో అర్థం చేసుకోవాలి. సినిమా రంగంలోనూ నటీమణులు బాధింపులకు గురౌతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.
అదృష్టవశాత్తు నాకైతే అలాంటి సంఘటనలు ఎదురవ్వలేదు. అదే గనుక జరిగుంటే నేను సినిమాను వదిలి పారిపోయేదాన్ని. అదే విధంగా ఆడపిల్ల ఒంటరిగా ఫోన్‌లో మాట్లాడుతుంటే తల్లిదండ్రలు సందేహపడుతున్నారు. కానీ అదే యువతి గదిలో గంటల తరబడి కంప్యూటర్‌లో మునిగిపోతుంటే పట్టించుకోవడం లేదు. ఈ ధోరణి మారాలి. మగ పిల్లలపైనా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. అప్పుడే హింసాత్మక ఘటనలను అరికట్టవచ్చు. నాకు దేవుడిపై నమ్మకం అధికం. షూటింగ్ లేని సమయాల్లో ఏదో ఒక దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటాను. ఆ సమయంలో అభిమానులు చుట్టు ముడతారు. అది కాస్త ఇబ్బంది అనిపించినా వారి అభిమానం కావడంతో సహనం పాటిస్తాను.
నా పెళ్లి గురించి అడుగుతున్నారు. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నా దృష్టి అంతా సినమాలపైనే ఉంది. నేను చిన్న తనం నుంచి డబ్బు లేమీ తెలియకుండా ఎదిగాను. అయితే చాలా మంది పిల్లలు ఆకలి బాధతో రోడ్ల పక్కన గడపడం చూసి చలించి పోతాను. అందుకే అలాంటి వారిని ఆదుకునే విధంగా 31 మంది అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను తీసుకున్నాను. ఒక వృద్దాశ్రమాన్ని కట్టబోతున్నాను’ అని నటి తెలిపింది.