![Number of lawyers dwindled in Parliament - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/23/220820222211-PTI08_22_2022_.jpg.webp?itok=fCKiWe3M)
న్యూఢిల్లీ: ‘‘పార్లమెంటులో గతంలో న్యాయ కోవిదులు ఎక్కువగా ఉండేవారు. రాజ్యాంగ పరిషత్తులోనూ, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కొలువుదీరిన పలు పార్లమెంటుల్లోనూ చాలామంది వాళ్లే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగాన్ని, తిరుగులేని చట్టాలను మనకందించారు. కానీ కొంతకాలంగా పార్లమెంటులో న్యాయ కోవిదుల సంఖ్య బాగా తగ్గుతోంది. ఆ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తున్నారు. ఇంతకు మించి మాట్లాడబోను’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
ఉపరాష్ట్రపతిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన జగ్‌దీప్ ధన్‌ఖడ్ గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అపార అనుభవం ధన్‌ఖడ్ సొంతమన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఎలాంటి రాజకీయ గాడ్‌ఫాదర్లూ లేకుండానే దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొలువుదీరే స్థాయికి ఎదిగారు. ఇది మన ప్రజాస్వామ్య గొప్పదనానికి, ఉన్నత రాజ్యాంగ విలువలకు తార్కాణం’’ అన్నారు.
‘‘ప్రతి సభ్యుడినీ సంతృప్తి పరచడం తేలిక కాదు. కానీ ధన్‌ఖడ్ తన అపార అనుభవం సాయంతో రాజ్యసభ చైర్మన్‌గా రాణిస్తారని, అందరినీ కలుపుకునిపోతారని నాకు నమ్మకముంది. న్యాయవాదిగా అపార అనుభవం, గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహించి ఉండటం ఆయనకెంతో ఉపయోగపడతాయి. అతి త్వరలో రిటైరవుతున్న నేను ధన్‌ఖడ్ పర్యవేక్షణలో రాజ్యసభలో జరిగే నాణ్యమైన చర్చలను టీవీలో చూస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. ధన్‌ఖడ్‌ను ఆయన సన్మానించారు.
న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంబార్ అసోసియేసన్ అధ్యక్షుడు వికాస్‌సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతకాలంగా పార్లమెంటులో చర్చల కంటే అంతరాయాలే ఎక్కువయ్యాయని రిజిజు ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చర్చల నాణ్యత బాగా పడిపోయింది. ఇటీవలి దాకా లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభ కాస్త ప్రశాంతంగా ఉండేది. ఈ మధ్య అక్కడా గలాభా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సభను అదుపు చేసేందుకు ధన్‌ఖడ్ అనుభవం పనికొస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఓ లాయర్ ఉపరాష్ట్రపతి కావడం ఇదే తొలిసారని తుషార్ మెహతా అన్నారు.
ధన్‌ఖడ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ
Comments
Please login to add a commentAdd a comment