
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా కొనసాగుతోంది. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పవిత్ర సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాకు ఘనమైన ఏర్పాట్లు చేశారని యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం గురించి మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పరిస్థితులు సద్దుమణిగాయని, దీనిని చూస్తుంటే యూపీ సర్కారు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదో ఇట్టే గ్రహించవచ్చని అన్నారు. ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మెచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి(Vice President) అన్నారు. ఈ భూమిపై ఎక్కడా ఇంతటి భారీ కార్యక్రమం జరిగివుండదు. కుంభమేళా నిర్వహణకు యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ధన్కర్ పేర్కొన్నారు.
మహా కుంభమేళాలో లక్షకు పైగా మరుగుదొడ్లు నిర్మించారని, యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్(Maha Kumbh)కు వచ్చిన వారి సంఖ్య అమెరికా జనాభాకు సమానం అని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారని ఆయన అన్నారు. తాను కుంభ్ స్నానం కోసం నీటిలోకి దిగిన క్షణం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం అని ధన్కర్ పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం మరొకటి లేదని, అంకితభావం, సామర్థ్యం, సంస్కృతి పరిజ్ఞానం, దేశానికి సేవ చేసే స్ఫూర్తి ఇక్కడ ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.