
మంచి ఆలోచనలే మంచి కార్యాలకు నాంది
జరగాలనుకున్నవి జరగకపోయినా, జరిగినవి జరగకూడదనుకున్నా దుఃఖం తప్పదు. అదే కోరిక. మన తలలోని మెదడు కంప్యూటర్‌లోని హార్డ్‌వేర్‌లాంటిదైతే మనసనేది జరుగుతున్న ప్రోగ్రామ్- సాఫ్ట్‌వేర్ లాంటిది. మనసు మనం చేసే ప్రోగ్రామ్‌ను బట్టే నడుచుకుంటుంది. కంప్యూటర్‌లో తప్పుడు ప్రోగ్రామింగ్ వల్ల తప్పుడు ఫలితాలు వచ్చినట్టే మనసులో ప్రోగ్రామింగ్‌లో లోపం ఉంటే తప్పుడు రిజల్టే వస్తుంది. అదే మన ఎదుగుదలకు అవరోధంగా తయారవుతుంది.
పుట్టుకతో మెదడు ఉంటుంది కాని మనసు ఉండదు. సమాజం, తల్లిదండ్రులు, పెద్దలు, చదువు- ఇవి మైండ్ ఏర్పడటానికి బాధ్యులు. ఈ మైండ్‌లో నమ్మకాలు, ఆచారాలు, దేశకాల పరిస్థితులు అంతర్లీనంగా దాగి ఉంటాయి. భౌతికంగా ఏ ఉనికిలేని నీ మనసు నీవు ఊహించలేనంత శక్తిమంతంగా తయారవుతుంది. నీవు మాయలో చిక్కుకునేట్లు చేస్తుంది. నీవు ఏది కావాలో అనే నీవు అనుకునే భ్రమలో పడేస్తుంది. అసలు మైండ్ అంటేనే ఆలోచనల ప్రవాహం.
గతానికిగాని, భవిష్యత్తుకిగాని సంబంధించిన విషయాలు మైండ్‌లో ఆలోచనలుగా చోటు చేసుకుని నిన్ను నిన్నుగా ఉండనీయవు. శూన్యం, స్వచ్ఛత, శాంతి, ఆనందం అనేవి నీ నిజతత్వమైతే, ఆలోచనలు నిన్ను ఆవిహ ంచి నీ ఆనందాన్ని, శాంతినీ హరించి వేస్తాయి. గతంలో నీవు అనుభవించనిదే కోరిక. కలల రూపంలో, కోరికల రూపంలో ఆలోచనలు నిన్ను ఎప్పుడూ వెంటాడుతుంటాయి. నీవు అన్‌కాన్షియస్‌గా ఉంటే అప్పుడు వాటి విజృంభణ మొదలవుతుంది. నీ కాన్షియస్‌నెస్, స్వచ్ఛత, శూన్యతకు భంగం కలిగిస్తాయి. మైండ్ స్వచ్ఛం అయ్యేంతవరకు నీకు విజయం చేకూరదు.
ప్రతికూలమైన ఆలోచనలు, నెగటివ్ భావాలు మనస్సుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు ఆధ్యాత్మికపరమైన మంచి పుస్తకాల పఠనం, ధ్యానం, జపం, ప్రార్థనలపైన కూడా ఆధారపడాలి. ఎల్లప్పుడూ వేకువతో, చేతనతో, ప్రజ్ఞలో ఉండాలి. కొన్నిసార్లు బద్దకంగా కానీ, నిద్రాస్థలో ఉన్నప్పుడు కానీ కొన్ని ప్రాణాయామాలు, ప్రణవ మంత్రోచ్చారణ చేస్తుండాలి. రక్తానికి అలవాటు పడిపోయిన పులిని ఎలా అడ్డుకోలేమో అలాగే మైండ్ కూడా. ఏదైనా వ్యామోహానికి గురయినప్పుడు మనసు ఈ ఒక్కసారికే కదా! ఏమీ కాలేదులే అని అనుకుంటుంది. ఒక్కసారి అనుకున్నది అల వాటుగా మారి ఇక కోరికలను చంపుకోలేని స్థితికి తీసుకు వస్తుంది.
మనసుకి చెడు అలవాటు చేస్తే విముక్తి లభించడం అసాధ్యం. చెడు ఆలోచనలను ఆపేయాలి. టీవీలు, సినిమాలలో చూపించే సీరియల్స్, కథలలోని పాత్రలు ప్రదర్శించే కోపం, ద్వేషం, పగలాంటి నెగటివ్ ఆలోచనలు మనలో లేకపోయినా అవి మనలో కూడా కలిగే అవకాశం ఉంది. వాటిలో చూపించే పగ, ద్వేషం, కోపం లాంటి లక్షణాలు నిజంగా లేకపోయినా ఆ ప్రోగ్రాములు చూసేవారి మనసులో కూడా అవి నాటుకుంటాయి. దానివల్ల మనలో సంస్కారాలు పెరుగుతాయి. అవి ప్రక్షాళన చేసుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వ్యామోహాలకు తావివ్వకుండా చెడు విషయాలు మీ చుట్టూ లేకుండా బహిష్కరించండి. ఈ సందడిలో పడి అసలు విషయమైన మోక్షసాధనను మరువకూడదు.
మనసులో పేరుకుపోయిన సంస్కారాలను, కోరికలను తొలగించుకుని మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసు మనల్ని ఏదో ఒక మాయలో పడేస్తూనే ఉంటుంది. మనసులో మలినాలు పెరగడం వలన నేను ఆత్మను అనే విషయం మరచిపోవడం జరుగుతుంది. మన నిజతత్వాన్ని మరచిపోయి ఒక రకమైన అవిశ్రాంత స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ప్రేమ, కరుణ, శాంతి, సచ్చిదానందానికి దూరంగా ఉంటుంటాం. అందుకే ఆలోచనలలో స్వచ్ఛత ఉండాలి. ఒక ఆలోచనే కార్యాచరణకు నాంది కాబట్టి మంచి ఆలోచనలు చేయడం ఎంతో ముఖ్యం.
మైండ్ రకరకాలుగా మనల్ని లోబరచుకుని అహంకారం కలిగిస్తుందని గమనించాలి. సేవ, జపం, భగవన్నామ స్మరణ, దైవచింతన మనల్ని కోపం, దుఃఖం, అహంకారం, ద్వేషంలాంటి భావాలనుంచి బయటపడేస్తాయి. శాంతి, ధైర్యం, సంతోషం కలిగిస్తాయి.
-స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక గురువు
బుద్ధబోధ
ఓమారు పెనుతుపానుకు ఒక బుద్ధవిహారం కూలిపోయింది. అక్కడి బుద్ధవిగ్రహాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిరాదరణకు గురైంది. దీనిని చూసిన ఓ జెన్ గురువు మనసు కకావికలమైంది. ఆలయాన్ని పునర్నిర్మించి బుద్ధ విగ్రహాన్ని అందులో పునఃప్రతిష్టించాలనుకుని విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టాడు. మొదటి రోజు కొంత డబ్బు సేకరించిన తర్వాత ఆయన నిద్రపోయాడు. అప్పుడు కలలోకి బుద్ధుడి విగ్రహం ప్రత్యక్షమై అతనిని చూసి ఇలా అంటుంది....
‘‘పుత్రా, ఆ ఆలయం నాకొక చెరసాల. ఎగుడుదిగుళ్ళ మధ్య గడపనిదే జీవితమెందుకు? నన్ను నాలుగు గోడల మధ్య బంధించకు. నన్ను ఇలానే వదిలేసెయ్యి’’ అని. అప్పటికి గానీ ఆ గురువుకి బుద్ధతత్వం బోధపడలేదు.