సిల్లీ | A deep belief | Sakshi
Sakshi News home page

సిల్లీ

Published Tue, Jul 26 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

సిల్లీ

సిల్లీ

గాఢ నమ్మకం


ఓ ఊళ్లో ఒక వ్యక్తి పిల్లిని పెంచుకునేవాడు. అది ఎప్పుడు చూసినా చెంగుచెంగుమని తిరుగుతూ ఉండేది. అందరి కాళ్లకీ అడ్డుపడుతూ ఉండేది. అది పక్కింటి పెద్దాయనకి నచ్చేది కాదు. బైటికెళ్లినప్పుడు అది కానీ ఎదురు పడిందో... కోపం నషాళానికి ఎక్కేది. వెంటనే దాని యజమాని దగ్గరికెళ్లి గొడవ పెట్టుకునేవాడు. ఓరోజు సాయంత్రం కూడా అలాగే గొడవకు వెళ్లాడు. ‘ఈరోజు నీ పిల్లి ఎదురు రావడం వల్ల నా కొడుకు ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు, వాడికి ఉద్యోగం రాలేదు, పనికిమాలిన పిల్లి’ అంటూ తిట్టాడు. అప్పుడు యజమాని అన్నాడు... ‘నా పిల్లి ఎదురు రావడం వల్ల నీ కొడుక్కి ఉద్యోగమే రాలేదేమో, నీ కొడుకు ఎదురు రావడం వల్ల నా పిల్లి ప్రాణమే పోయింది. మధ్యాహ్నం లారీ కింద పడి అది చచ్చిపోయింది.’

ఇది విన్నప్పుడు ఆ పెద్దాయన రియాక్షన్ ఎలా ఉండివుంటుంది? బాధపడి ఉంటాడా? సిగ్గుపడి ఉంటాడా? లేక ఆ రోజు నుంచీ ఆ మూఢ నమ్మకాన్ని వదిలేసి ఉంటాడా?  పైన చెప్పుకున్నది ఎవరో రాసిన కథ. కానీ నిజానికది సమాజంలో ప్రతిరోజూ కనిపించే ఓ వాస్తవం. పిల్లి ఎదురుపడితే అపశకునం. నల్లపిల్లి అయితే మరీను. అది ఎదురొస్తే చెడు తప్ప మంచి జరగదు అంటారు. అలా అని ఎవరు చెప్పారు అంటే మాత్రం సమాధానం  ఉండదు. ఎందుకంటే... సమాధానం ఎవరికీ తెలీదు కాబట్టి. నిజానికి చాలా భయాలకు కారణం ఉండదు. కానీ ఏ భయమైనా ఒక్కసారి పుట్టిందంటే... అంత త్వరగానూ పోదు. ఇదీ అంతే.

యూరోప్ దేశాల వారికి నల్లపిల్లి అంటే మహా భయం. దురదృష్ట సంకేతమనీ, దుష్టశక్తులకు నిలయమనీ దాని మీద లెక్కలేనన్ని నిందలు మోపుతూ ఉంటారు. ఐర్లండ్ వాళ్లు అయితే మరో అడుగు ముందుకేసి... నల్లపిల్లిని శని అన్నారు. అది కనుక తమ చేతుల్లోనో, ఇంటి చుట్టుపక్కలో చనిపోతే పదిహేడేళ్ల పాటు శని వెంటాడుతుంది అనే కొత్త నమ్మకానికి నాంది పలికారు. మన దేశస్తులకు కూడా నల్లపిల్లిని చూస్తే దడ. అది ఇంట్లోకొస్తే దాని వెనుకే దెయ్యం వస్తుందని నమ్మేవాళ్లు కోకొల్లలు. ఇక చాన్‌‌స దొరికింది కదా అని సినిమా వాళ్లు, సీరియళ్ల వాళ్లు నల్లపిల్లికి మరింత మసి పూసేశారు. హారర్ అంటే చాలు... నల్లపిల్లి ఉండాల్సిందే. ఏదో దెయ్యం, నల్లపిల్లి అక్కాచెల్లెళ్లు అన్నట్టుగా రెండిటినీ ముడిపెట్టి చూపిస్తుంటారు. అసలు నల్లపిల్లి అంత పాపం ఏం చేసింది?

నిజానికి ఈ మూఢనమ్మకం మధ్య యుగంలో మొదలైందని చెబుతారు. దుష్టశక్తుల్ని పారదోలడానికి అప్పట్లో కొందరు నల్లపిల్లిని బలిచ్చేవారట. అది కాస్తా నల్లపిల్లి చెడ్డది కాబట్టి దాన్ని చంపితే చెడు కూడా పోయి మంచి జరుగుతుంది అన్న నమ్మకంగా మారి పోయింది. అంతే కానీ దీనికంటూ ఓ ఆధారం లేదు. నలుపు చెడ్డది కాబట్టి నల్లగా ఉండే పిల్లి కూడా చెడ్డది అనేస్తే ఎలా? కుక్కలు కూడా నల్లగా ఉంటాయి. అవి ఎదురొస్తే ఏమీ కాదా? స్టైల్‌గా ఉంటామనీ... స్లిమ్‌గా కనిపిస్తామనీ మనం బ్లాక్ డ్రెస్సులు ధరిస్తూ ఉంటాం. మరి ఆ నలుపు చెడ్డది కాదా? మనం వెళ్లిన చోటికి కూడా కీడు రావాలి కదా? నలుపు కేవలం నల్లపిల్లి మాత్రమే ఎందుకు చెడ్డదయ్యింది?! సరైన జవాబు దొరికితే ఇది నమ్మకం. దొరకనంత వరకూ మూఢనమ్మకమే!

 

మైఖేల్ జాక్సన్, మార్లిన్ మన్రో లాంటి కొందరు ప్రముఖులు నల్లపిల్లిని ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు. హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా, బాలీవుడ్ నటి ఆలియా భట్ వంటి మరికొందరు స్టార్‌‌సకి కూడా వాళ్లు పెంచుకుంటోన్న నల్లపిల్లి అంటే ప్రాణమట.  కొందరు హాలీవుడ్ హీరోయిన్ల పుణ్యమా అని విదేశాల్లో నల్లపిల్లి స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారింది.పార్టీలకి, ఫంక్షన్లకి వచ్చినప్పుడు చాలామంది హీరోయిన్లు నల్లపిల్లిని చేత పట్టుకుని వస్తుంటారు. నల్లపిల్లి చేతిలో ఉంటే స్టైలిష్‌గానూ రిచ్‌గానూ కన్పిస్తారట. బస్త్ అనే ఈజిప్షియన్ దేవత శరీరం మనిషిలా, తల నల్లపిల్లిలా ఉంటుంది. అందుకే ఈజిప్షియన్లకు నల్లపిల్లి అంటే అమితమైన ప్రేమ. ఒకప్పుడైతే నల్లపిల్లిని ఎవరైనా తక్కువగా చూసినా, హింసించినా మరణ దండన విధించేవారట. కాలక్రమంలో దాన్ని రద్దు చేశారు. స్కాట్లాండ్ వాళ్లకి నల్లపిల్లి అంటే చాలా ఇష్టం. పొద్దున్న లేవగానే దాన్ని చూస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల వారు కూడా నల్లపిల్లిని అదృష్ట సంకేతంగా భావిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement