నమ్మకం: అరచేతిలో అంత కథ ఉందా!
అదృష్టం దురదృష్టం: అదృష్టం చేతి గీతల్లో ఉంటుంది అంటారు కొందరు. అయితే కొందరు చేతిలో పుట్టే దురదలో కూడా ఉంటుందంటారు. పలు దేశాల వారు అరచేతిలో పుట్టే దురదతో తమ అదృష్ట దురదృష్టాలను అంచనా వేసుకుంటున్నారు. నమ్మనివారికి ఇది విచిత్రం. నమ్మేవారికి ఓ బలమైన విశ్వాసం.
అరచేయి దురదపెడితే ఏదో జరుగుతుందన్న నమ్మకం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచీ జనం దీన్ని నమ్ముతున్నారని తెలుస్తోంది. అయితే ఎక్కడా, ఏ ఒక్కరూ కూడా ఈ నమ్మకం ఎలా పుట్టింది అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగని తమ విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టలేకపోతున్నారు.
మన దేశంలో అరచేయి దురద పెడితే డబ్బులు వస్తాయని అంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాలవారు అదృష్టంతో పాటు దురదృష్టం కూడా కలుగుతుందని అంటున్నారు. కుడి అరచేయి దురద పెడితే మంచి జరుగుతుందని, ఎడమది పెడితే చెడు జరుగుతుందని కొందరు అంటే... కొన్ని దేశాల్లో మాత్రం ఇది రివర్సులో ఉంది. కుడి చేయి కనుక దురద పెడితే.. సంపద సర్వనాశనమైపోతుందట. ఎక్కడలేని ఖర్చులూ ఒకేసారి వచ్చి చుట్టుముడతాయట. దివాలా తీసి రోడ్డున పడేంత వరకూ శని వదలదట. అయితే ఎడమ చేయి దురద పెడితే... ఊహించని సంపద వెతుక్కుంటూ వస్తుందట. పేదవాడిని పేద్ద ధనవంతుడిగా మార్చేస్తుందట.
కొన్ని దేశాల్లో అయితే... చేతి దురద అనేది శక్తికి సంబంధించినది అన్న నమ్మకం కూడా ఉంది. మనిషిలో అంతర్గతంగా ఒక గొప్ప శక్తి ఉంటుందని, ఆ శక్తి, మనిషి అరచేతుల గుండా ప్రవహిస్తూ ఉంటుందని అంటారు వారు. అంతేకాదు, కుడి చేయి శక్తి వంతమైనదని, ఎడమచేయి బలహీనమైనదని నమ్ముతారు. అందుకే కుడి అర చేయి దురదపెడితే శక్తి పెరుగుతుందని, ఎడమచేయి దురదపెడితే శక్తి క్షీణిస్తుందని నమ్ముతారు. ఆ విధంగా శక్తి క్షీణించిపోయి అతడు మరణానికి చేరువవుతాడని కూడా చెబుతారు.
మరి రెండు చే తులూ ఒకేసారి దురద పెడితే ఏంటి పరిస్థితి? ఉంది. దాని గురించీ ఒక విశ్వాసం ఉంది. రెండు చేతులూ కనుక ఒకేసారి దురదపెడితే... కచ్చితంగా మంచే జరుగుతుందట. అదృష్టమే వరిస్తుందట. కాబట్టి దిగులు చెందాల్సిన పని లేదు అంటారు.
అసలు ఎలా నమ్మాలి వీటిని? దురద అనేది శరీరానికి కలిగే ఒక ఇబ్బంది. అపరిశుభ్రత వల్లనో, చర్మ సమస్య వల్లనో, ఏదైనా పురుగు వంటిది వాలడం వల్లనో, ఏదైనా కీటకం కుట్టడం వల్లనో కూడా దురద పుడుతుంది. మరి అలాంటిదాని గురించి ఇన్ని విశ్లేషణలు, ఇన్ని వివరణలు ఏమిటో అర్థం కాదు. అయినా శరీరంలో ఎక్కడ దురద పుట్టినా రాని అదృష్ట దురదృష్టాలు అరచేతిలో దురద పుడితేనే ఎందుకు వస్తాయి అంటే సమాధానం కూడా దొరకదు. కాబట్టి... దీనిని నమ్మాలో వద్దో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే!
కుడి అరచేయి దురద పెడితే ఓ కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తారని ఐర్లాండు వారు భావిస్తారు! అమెరికాలో ఉన్న అటవీ ప్రాంతంలో నివసించే కొన్ని తెగల వారు... కుడి అరచేయి దురద పెడితే అదృష్టంగా భావిస్తారు. ఎడమ అరచేయి దురద పెడితే కంగారు పడిపోతారు. వెంటనే ఎడమ చేతిలో ఉమ్మి వేసి, ఆ చేతిని నడుము దగ్గర రుద్దుకుంటారు. అలా చేస్తే ఏ ఆపదా రాదంటారు!
హంగేరీ వారు... అరచేయి కనుక దురద పెడితే వెంటనే జుట్టుతో చేతిని రుద్దుకుంటారు. తర్వాత అదే చేతితో జుట్టును ఒడిసిపడతారు. మొత్తం జుట్టుని ఒడిసి పట్టుకుంటే అదృష్టం వరిస్తుందట. అలా కాకుండా కాస్త బయట ఉండిపోతే కష్టాలు తప్పవని విశ్వసిస్తారు!
రెండు చేతులూ ఒకేసారి దురదపెడితే... వెంటనే చేతుల్ని జేబుల్లో ఉంచుకోవాలట. అప్పుడా అదృష్టం ఎక్కడికీ పోదని పలు ఐరోపా దేశాల వారు నమ్ముతారు!