‘కాకి’ అపశకునమేమీ కాదు !
‘కాకి పిల్ల’ కూర్చున్నందుకు కారు మార్చలేదు
సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: ‘కాకి అపశకునాన్ని సూచించే పక్షి అని నేను భావించడం లేదు. నా కారును మార్చేందుకు కాకి కారణం కాదు. ఇప్పుడు ఉన్న కొత్త కారుపై ఎన్ని కాకులు వాలినా కారును మాత్రం మార్చబోను’ అంటూ సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిపర మఠాధిపతుల వేదిక ఆధ్వర్యంలో సోమవారమిక్కడి అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ చనిపోయిన వ్యక్తులకు మన పల్లెల్లో పిండప్రదానం చేస్తారు. ఆ పిండాలను కాకులు వచ్చి తిని వెళ్లిన తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. అలాంటి పక్షిని అపశకునం అంటూ చెబుతున్నారు. మూఢాచారాలు, అసమానతలు ఉన్నప్పుడే కొన్ని వర్గాలు అజమాయిషీ చూపడం సాధ్యమవుతుంది. అందుకే కొన్ని మూఢాచారాలను ఇప్పటికీ అనేక మంది కొనసాగిస్తూ వస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను మూడేళ్లుగా కారును వాడుతున్న నేపథ్యంలో ఆ కారును మార్చాల్సిందిగా రెండు నెలల క్రితమే అధికారులను ఆదేశించానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అయితే అకస్మాత్తుగా ఆ కారుపై కాకి పిల్ల వాలిందని, అంత మాత్రానికే కాకి పిల్ల వాలడం వల్లే నేను కారు మార్చానని దుష్ర్పచారం చేశారని ఆరోపించారు. తాను ఇలాంటి వాటిని ఎప్పటికీ నమ్మనని, ఇప్పుడు కొన్న కారుపై నాలుగైదు కాకులు వాలినా ఆ కారును మార్చబోనని అన్నారు. అయితే ఇదే సందర్భంలో తాను నాస్తికుడిని కూడా కాదని, మూఢాచారాలను మాత్రం నమ్మబోనని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఆంజనేయ, రోషన్‌బేగ్, కె.జె.జార్జ్ , వివిధ మఠాల అధిపతులు పాల్గొన్నారు.