‘కాకిపిల్ల’ కూర్చున్నందుకే వాహనాన్ని మార్చారా!.
బెంగళూరు: మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు తానే అలాంటి విశ్వాసానికి తలొగ్గారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం కాన్వాయ్‌లోని కారును మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. సీఎం కాన్వాయ్‌లో సీఎం ప్రయాణించే వాహనాన్ని మూడేళ్లకే మార్చేశారు. కోరమంగళ రీజనల్ ఆర్‌టీఓ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ పొందిన సరికొత్త ఫార్చునార్ కారు సీఎం కాన్వాయ్‌లో శనివారం చేరింది. అయితే మూడేళ్ల వ్యవధికే కారును ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. కారును మార్చేందుకు ఎలాంటి సాంకేతిక సమస్య కారణం కాదని తెలుస్తోంది.
కాన్వాయ్‌లోని సీఎం ప్రయాణించే కారుపై గత వారంలో ఓ కాకిపిల్ల కూర్చొని కాసేపు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ విషయంపై విస్తృత చర్చ జరిగింది. వాహనంపై కాకిపిల్ల వాలడం ఏదో సమస్య తలెత్తనుందనే సంకేతాన్ని అందజేస్తోందంటూ జ్యోతిషులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాకిపిల్ల వాలడాన్ని అపశకునంగా భావించిన సీఎం సిద్ధరామయ్య ఆ వాహనం స్థానంలో కొత్త కారును చేర్చారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాను మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తానని పదే పదే చెప్పుకునే సీఎం సిద్ధరామయ్య కాకిపిల్ల కూర్చుందన్న కారణంతోనే కారు మార్చడమేమిటనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.