కోకిలమ్మ మౌనరాగం | Old prabandhakarulu | Sakshi
Sakshi News home page

కోకిలమ్మ మౌనరాగం

Published Sun, Jun 12 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

కోకిలమ్మ మౌనరాగం

కోకిలమ్మ మౌనరాగం

స్వగతం

 

కాకిలా కారునలుపు కాకున్నా, నల్లగానే ఉంటాను నేను. వర్షం వచ్చినప్పుడు నెమలిలా పురివిప్పలేను కానీ, వసంతం వచ్చిందంటే మాత్రం కుహూ కుహూ రాగాలను కమ్మగా పాడుకుంటాను. అందుకే కాబోలు... ప్రాచీన ప్రబంధకారుల నుంచి, ఆధునిక కవుల వరకు నన్ను తలుచుకోనివారు లేరు, నా ప్రస్తావన తేకుండా కావ్యాలూ, కవితలూ అల్లినవారు లేరు. ఎవరైనా కమ్మగా పాడితే చాలు... నాతోనే పోలుస్తారు అందరూ! మూడేళ్ల పసివారి దగ్గర నుంచి, మూడుకాళ్ల ముదుసలి వారి వరకూ నా గొంతును ఇష్టపడని వారుండరు. నేను కుహూ అన్నప్పుడల్లా వారు కూడా కుహూ అంటారు. అలా నా గొంతుతో ఎవరైనా గొంతు కలిపారంటే మహా ఇష్టం నాకు. ఎవ రైనా నన్ను అనుకరిస్తే, నేను సంతోషంగా బదులిస్తాను.

 
అవునూ.. మా పుట్టుపూర్వోత్తరాలు మీకు పూర్తిగా తెలియవు కదూ! మాలో మొత్తం 54 రకాలున్నాయి. యూరప్ ఖండంలో రెండే రకాలు ఉన్నాయి కానీ మిగిలిన మా జాతులన్నీ కూడా ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో జీవిస్తున్నాయి! ఒక చిన్న విషయం... మీరు అసహ్యించుకోనంటే చెబుతా... మేము మావి చిగుళ్లు మాత్రమే తింటామని మీరనుకుంటారు కానీ, మాకు గొంగళిపురుగులన్నా ఇష్టమే. కంటికి కనిపిస్తే చాలు... అమాంతం కిందికి దిగి, గుటకాయ స్వాహా చేసేదాకా మాకు తోచదు. ఇంకోటి... మాలో మగకోకిలలు పాడలేవు. ఆడకోకిలలు మాత్రమే పాడగలవు. అన్నట్టు మేము గూళ్లు కట్టుకోలేం. పిల్లల్ని పొదగలేం. ఎందుకంటే మాకు చేతకాని విద్యలు అవి. వేరే పక్షులు ముఖ్యంగా అవి మమ్మల్ని అంత తొందరగా కనుక్కోలేవు కదా అనే ధైర్యంతో మేము కాకి గూళ్లలో మా గుడ్లు పెడతాం. అట్లాగని గుడ్లు పెట్టేసి ఊరుకోం. మేము పెట్టిన గుడ్లను అవి పొదుగుతున్నాయో లేదో కూడా ఓ కంట కనిపెట్టి ఉంటాం. మా గుడ్ల నుంచి పిల్లలు బయటికొచ్చి, కాస్త పెద్దయ్యాక మా గొంతును గుర్తుపట్టి కాకులు మా పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా పొడిచి వెళ్లగొడతాయి. అయినా సహించి ఊరుకుంటాం. ఎందుకంటే పాపం అవే కదా, మా గుడ్లని పొదిగి పిల్లల్ని చేసింది అనే జాలితో! అవి వెళ్లగొట్టిన తర్వాత మా పిల్లల్ని మేం అక్కున చేర్చుకుంటాం. పండ్లు, ఆకులు, చిగుళ్లు పెట్టి ప్రేమగా పెంచుకుంటాం. మాకొచ్చిన రాగాలనే మా పిల్లలకు నేర్పిస్తాం.

 
మండు వేసవి అన్నా, మావిచిగుళ్లన్నా ప్రాణం నాకు. మామిడి పూత పూసిందంటే ప్రాణం లేచొస్తుంది. తెలియకుండానే మా గొంతు విచ్చుకుంటుంది. అప్రయత్నంగానే రాగాలు పలుకుతాం మేము. అందుకే మా మీద మీ సినీ కవులు ఎన్ని పాటలు రాశారో! ఎవరైనా బాగా పాడారంటే మాతోనే పోలుస్తారు గాన కోకిల అని. గుర్రం జాషువా గారినయితే కవి కోకిల అని బిరుదిచ్చారు. ఆవిడెవరూ... ఆ... సరోజినీ నాయుడు. ఆమె చక్కగా రాయడమే కాదు.. గొంతెత్తి కమ్మగా పాటలు పాడేదని నైటింగేల్ ఆఫ్ ఇండియా అన్నారామెని. అసలు సినిమా వాళ్లు మా మీద ఎన్నెన్ని పాటలు కట్టారో తెలుసా? ఆ పాటలకు పురస్కారాలు కూడా పుచ్చుకున్నారు కానీ, మమ్మల్ని మాత్రం పట్టించుకోలేదు. అయినా మేమేమీ చిన్నబుచ్చుకోము లేండి... ఆ పాటలు విని మాలో మేమే పొంగిపోతుంటాం.

 మా పక్షి జాతికంతటికీ చెట్లంటే చాలా ఇష్టం. కాదు, ప్రాణం. చెట్లే మా నివాస స్థావరం. మీరు మాత్రం మీ నివాస స్థానం కోసం మా నివాస స్థావరాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. మేము ఎక్కడ ఉండాలి? మా బతుకు ఏం కావాలి? అడవుల్లోకెళ్లి తలదాచుకుందామనుకుంటే అక్కడికీ అడుగుపెట్టేస్తున్నారు. ఇది చాలా అన్యాయం.  ఇప్పటికే మేము ఇదివరకటంత బాగా మీకు వినిపించట్లేదు. మీరిలాగే చేస్తుంటే మీ పిల్లలకు మీరు మా బొమ్మల్ని తప్ప మమ్మల్ని చూపించలేరు. మా కుహు కుహూలు ఇక మీకు నహీ నహీ!

 

 - బాచి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement