Bachi
-
మా ఇంటి ఆవకాయ... చెప్పుకుంది ముచ్చట్లెన్నో!
ఎండలు మండుతున్నాయి. పచ్చడి మామిడి కాయలు మార్కెట్లోకి రావడం ఇప్పటికే మొదౖలñ పోయింది. రెండున్నర నెలల క్రితం గృహప్రవేశానికని మాతోబాటు చిన్నక్కా వాళ్ల ఇంటికి వచ్చి, నేను మళ్లీ ఇంత తొందరగా ప్రయాణం చేయలేనంటూ అక్కడే దిగబడిపోయింది అమ్మ. ఎప్పుడొస్తున్నావమ్మా అనడిగితే ‘ఇక్కడే ఉండి పచ్చళ్లు పెట్టుకొని వస్తాలే, అయినా, నేను వచ్చి మాత్రం చేసేదేముంది ఇప్పుడక్కడ?’ అంటూ అక్కడే ఉండిపోయింది. పచ్చళ్లు అంటే ఆవకాయ, మాగాయే. అదీ మహా అయితే ఓ పాతిక కాయలతో మాగాయ, ఓ డజనో, డజనున్నర కాయలతో ఆవకాయ పెట్టుకొస్తుందేమో! ఈలోగా నేను ఊరుకోలేక పప్పులోకని కొనుక్కొచ్చిన కాయల్లో కాస్త పెద్దవి చూసి వాటితో ఆవకాయ, కొంచెం పీచుపట్టిన కాయలతోనేమో మాగాయ మా శ్రీమతితో పెట్టిస్తూ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటున్నాన నుకోండి... ఆవకాయ, మాగాయ ... కాదు కాదు.. ఎండాకాలం అంటే నాకు గుర్తొచ్చేది మా చిన్నప్పుడు మా తాతయ్య చేసిన హడావుడి... దాదాపు రెండు వందల చిన్నరసాల కాయలతో మాగాయ, నూటయాభైకి తక్కువ కాకుండా పెద్దరసాలు లేదా జలాలతో ఆవకాయ పెట్టించేవాడు. ముందుగా తోటనుంచి బస్తాలతో కాయలు దిగేవి. అమ్మ, పిన్నులు వాటికి ముచికలు తీసి నీళ్ల తొట్లు, బకెట్లలో పడేసేవాళ్లు. మధ్యాన్నం అన్నాలు తిన్నాక వాటిని తీసి శుభ్రంగా తుడిచి పాత చీర మీద గుట్టలుగా పోసేవాళ్లు. రెండు మూడు కత్తిపీటలు తీసుకుని ఇంట్లో ఆడవాళ్లందరూ తరిగేవాళ్లు వాటిని. మధ్యలో కాయలు కాస్త రంగు మారినట్టు అనుమానం వస్తే రుచి చూడమని నాకిచ్చేవాళ్లు. నేనేదో మేధావిలా పోజు కొడుతూ ‘ఈ ముక్క అంత పుల్లగా ఉన్నట్టు లేదు మామ్మా’ అని చెప్పేవాణ్ణి ఒక పక్క పులుపుతో కన్ను మూసుకుపోతున్నా కూడా! వెంటనే ఆ ముక్కకి కాస్త ఉప్పూ కారం అద్ది ప్లేటులో పెట్టి ఇచ్చేసేవాళ్లు. అట్లాంటి బేరాలు ఇంకొన్ని తగిలాయంటే ఇంక నాకు పండగే పండగ. కొన్నింటిని తరగబోతుండగానే తీసేయించేవాణ్ణి. వాటిని మెల్లగా తీసుకెళ్లి వడ్లపురిలోనో, బియ్యం రమ్ములోనో (డ్రమ్మునే మా మామ్మ, ఇంకా పెద్దవాళ్లు అలా అనేవాళ్లు) దాచేవాణ్ణి. రెండు రోజుల తర్వాత సగం పండిన మామిడికాయను బయటికి తీసి రుచి చూస్తూ పుల్లగా ఉన్నట్టు ట్ట ట్ట ట్ట అంటూ లొట్టలు వేస్తూ ఊరించుకుంటూ తినేవాణ్ణి. ఇంట్లో ఆడవాళ్లెంత మంది ఉన్నా, మాగాయ కలిపేది మాత్రం మా మామ్మే. బేసిన్లోకి తీసి పైనుంచి కిందికి బాగా కలిపి జాడీలో పెట్టేసేది మా మామ్మ. ఇక మాగాయ తిరగమోత వేసేటప్పుడు ఇంగువ వాసనతో ఇల్లంతా ఘుమ ఘుమలాడిపోయేది. అందుకోసం బెజవాడలోని నంబూరు సాంబశివరావు కొట్టునుంచి తాతయ్య ప్రత్యేకమైన పచ్చళ్ల ఇంగువ తెప్పిస్తే ఘుమఘుమలాడక ఏం చేస్తుంది మరి! మాగాయ కలిపిన బేసిన్లో అన్నం కలిపి ముద్దలు పెట్టేది మామ్మ. తినేటప్పుడు తాతయ్య అందరికేసీ చూసి కళ్లెగరేసేవాడు... ఎట్లా ఉంది అన్నట్టు. అందరూ ఆహా అనే అనేవాళ్లు. మా మామ్మ పెట్టిన మాగాయ రుచికి వంక పెట్టగలరా ఎవరైనా... అయిపోయిన తర్వాత ఆవకాయ పని పట్టేవాళ్లు. ఆవకాయకి మాత్రం మా నాన్న, బాబాయిలు, పెద్దమ్మమ్మతో సహా అందరూ రంగంలోకి దిగిపోయేవాళ్లు. మా నాన్న చేతికి దెబ్బ తగలకుండా ముందుగానే ఒక చిన్న టవల్ను కట్టుకునేవాడు. కడిగి తుడిచి పెట్టిన కాయలను తీసుకుని కత్తిపీటతో టకాటకా కొట్టేసేవాడు. ‘‘జాగర్త రా కిష్టీ... ముక్కలు పెద్దవవుతున్నాయనో, నీ హడావుడి చూస్తుంటే వేళ్లు కూడా తరుక్కునేట్టున్నావురా...’’ అంటుండేవాడు తాతయ్య. ఈ లోగానే నాన్న చిన్నగా అరిచి వేలును ఉఫ్ఫూ ఉఫ్పూ అని విదిలించడం, అట్లా విదిలించిన వేలినుంచి రక్తం ధారలుగా కారడం... ‘‘అదిగో చూశావా, వేలు కూడా తరుక్కున్నావురా, ముందు కట్టుకట్టుకో ఆ వేలికి, ఇంక నువ్వు తప్పుకోరా కిష్టీ... అందుకే నిన్ను సాంబక్కాయి కాళిదాసూ అనేది’’ అంటూ కంగారుగానే అరిచేవాడు తాతయ్య. నాగన్నాయి బాబాయి ముందే అరిచేవాడు. శేషాద్రి బాబాయి తర్వాత ఆదిత్య బాబాయి కొన్ని కాయలు ముక్కలు కొట్టేవాడు. గోపీ బాబాయి, శీను బాబాయి ముందుగా తోటకెళ్లి కాయలు, వాటికి కావలసిన ఉప్పులూ, కారాలూ, ఆవాలూ, మిరపకాయలూ నూనె డబ్బాలూ మోసుకొచ్చి పడేసేది వాళ్లే కాబట్టి, ముక్కలు కొట్టడంలో పెద్ద పనుండేది కాదు వాళ్లకి. కొట్టిన ముక్కలమీద ఉండే పై పొరను పెద్దమ్మమ్మ, అమ్మ, పిన్నులు చెంచాలతో జీడిని వేరు చేసి, ముక్క మీద ఉండే పొరను గీరి తీసేసేవాళ్లు. మామ్మ వాటిని మరోసారి శుభ్రంగా తుడిచి నూనెలో ముంచి ఆవ పిండి, ఉప్పు కలిపిన పెద్ద బేసిన్లకు ఎత్తేది. ఒక జాడీడు పచ్చడిలో వెల్లుల్లి గర్భాలు కలిపితే, ఇంకో చిన్నజాడీలో మెంతిపిండి, మరో జాడీలో పెసరపిండి కలిపి మెంతికాయ, పెసరావకాయ కూడా పెట్టేసేది పనిలో పనిగా. షరామామూలుగా ఆవకాయ కలిపిన బేసిన్లను అలాగే ఉంచి అన్నం కలిపి, అందరికీ తలా ఓ ముద్ద పెట్టి ఉప్పుకారాలు సరిపోయాయో లేదో చూడమనేది మామ్మ. ఒకళ్లు ఉప్పు తక్కువైందంటే, ఇంకోళ్లు కారంఎక్కువైందంటే.. మరొకళ్లేమో ఆవఘాటు ఎక్కువైందనో, తక్కువైందనో... ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసేవాళ్లు. ఇంక నాలుగైదు రోజులు గడిచాక ఎన్ని కూరలు చేసినా సరే, ఇంటిల్లిపాదీ ఆవకాయ మాగాయ, పెసరావకాయ, మెంతికాయలతోనే లాగించేవాళ్లు. మా నాన్న, తాతయ్య, బాబాయిలు అయితే వేడి వేడి అన్నంలో ఎర్రటి ఆవకాయ కలిపేవాళ్లు. నాన్నేమో వెన్నపూస ఉందామ్మా అని అడిగేవాడు. తాతయ్య, బాబాయిలు నూనె వేయించుకునేవాళ్లు. పిల్ల బ్యాచి మాత్రం లైటు లైటుగా ఆవకాయ కలుపుకుని అందులోకి రెండు మూడు మిల్లు గరిటల వేడి వేడి నెయ్యి వేయించుకుని తినేవాళ్లం. ఇప్పుడు ఆ రోజులు రమ్మన్నా రావు... కిరాణా షాపులకో బిగ్ బజార్ల వంటి మాల్స్కో వెళ్లి ప్యాకెట్లలో తెచ్చిన ఆవపిండి, మెంతిపిండి, టాటా సాల్టు, ఇదయం నువ్వుల నూనె తెచ్చి పెట్టుకుని, డజను మామిడికాయలు ముక్కలు కొట్టించుకుని తెచ్చి, మరో పదిహేను కాయలు మాగాయకని తెచ్చుకుని, దానితోపాటు ఎవరెస్టో, ఎల్జీనో, జీడీనో, పతంజలి ఇంగువ డబ్బానో తెచ్చుకుని మేమూ ఆవకాయ మాగాయ పెట్టుకున్నామనిపించుకుంటున్నాం. కష్టపడి పెట్టుకున్న వాటిని కడుపునిండా తినాలన్నా భయమే. ఒక్కొక్కళ్లకీ మూడున్నర పదులకే బీపీలూ, షుగర్లూ, కొలెస్ట్రాళ్లూ... అయినా సరే, పచ్చడి పెట్టుకున్న కొత్తల్లో నాలుగురోజులపాటు వరసగా వేసుకుని, తర్వాత అప్పుడప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తింటున్నారందరూ. ఏం చేస్తాం... కాల మహిమ! – బాచి -
కోకిలమ్మ మౌనరాగం
స్వగతం కాకిలా కారునలుపు కాకున్నా, నల్లగానే ఉంటాను నేను. వర్షం వచ్చినప్పుడు నెమలిలా పురివిప్పలేను కానీ, వసంతం వచ్చిందంటే మాత్రం కుహూ కుహూ రాగాలను కమ్మగా పాడుకుంటాను. అందుకే కాబోలు... ప్రాచీన ప్రబంధకారుల నుంచి, ఆధునిక కవుల వరకు నన్ను తలుచుకోనివారు లేరు, నా ప్రస్తావన తేకుండా కావ్యాలూ, కవితలూ అల్లినవారు లేరు. ఎవరైనా కమ్మగా పాడితే చాలు... నాతోనే పోలుస్తారు అందరూ! మూడేళ్ల పసివారి దగ్గర నుంచి, మూడుకాళ్ల ముదుసలి వారి వరకూ నా గొంతును ఇష్టపడని వారుండరు. నేను కుహూ అన్నప్పుడల్లా వారు కూడా కుహూ అంటారు. అలా నా గొంతుతో ఎవరైనా గొంతు కలిపారంటే మహా ఇష్టం నాకు. ఎవ రైనా నన్ను అనుకరిస్తే, నేను సంతోషంగా బదులిస్తాను. అవునూ.. మా పుట్టుపూర్వోత్తరాలు మీకు పూర్తిగా తెలియవు కదూ! మాలో మొత్తం 54 రకాలున్నాయి. యూరప్ ఖండంలో రెండే రకాలు ఉన్నాయి కానీ మిగిలిన మా జాతులన్నీ కూడా ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో జీవిస్తున్నాయి! ఒక చిన్న విషయం... మీరు అసహ్యించుకోనంటే చెబుతా... మేము మావి చిగుళ్లు మాత్రమే తింటామని మీరనుకుంటారు కానీ, మాకు గొంగళిపురుగులన్నా ఇష్టమే. కంటికి కనిపిస్తే చాలు... అమాంతం కిందికి దిగి, గుటకాయ స్వాహా చేసేదాకా మాకు తోచదు. ఇంకోటి... మాలో మగకోకిలలు పాడలేవు. ఆడకోకిలలు మాత్రమే పాడగలవు. అన్నట్టు మేము గూళ్లు కట్టుకోలేం. పిల్లల్ని పొదగలేం. ఎందుకంటే మాకు చేతకాని విద్యలు అవి. వేరే పక్షులు ముఖ్యంగా అవి మమ్మల్ని అంత తొందరగా కనుక్కోలేవు కదా అనే ధైర్యంతో మేము కాకి గూళ్లలో మా గుడ్లు పెడతాం. అట్లాగని గుడ్లు పెట్టేసి ఊరుకోం. మేము పెట్టిన గుడ్లను అవి పొదుగుతున్నాయో లేదో కూడా ఓ కంట కనిపెట్టి ఉంటాం. మా గుడ్ల నుంచి పిల్లలు బయటికొచ్చి, కాస్త పెద్దయ్యాక మా గొంతును గుర్తుపట్టి కాకులు మా పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా పొడిచి వెళ్లగొడతాయి. అయినా సహించి ఊరుకుంటాం. ఎందుకంటే పాపం అవే కదా, మా గుడ్లని పొదిగి పిల్లల్ని చేసింది అనే జాలితో! అవి వెళ్లగొట్టిన తర్వాత మా పిల్లల్ని మేం అక్కున చేర్చుకుంటాం. పండ్లు, ఆకులు, చిగుళ్లు పెట్టి ప్రేమగా పెంచుకుంటాం. మాకొచ్చిన రాగాలనే మా పిల్లలకు నేర్పిస్తాం. మండు వేసవి అన్నా, మావిచిగుళ్లన్నా ప్రాణం నాకు. మామిడి పూత పూసిందంటే ప్రాణం లేచొస్తుంది. తెలియకుండానే మా గొంతు విచ్చుకుంటుంది. అప్రయత్నంగానే రాగాలు పలుకుతాం మేము. అందుకే మా మీద మీ సినీ కవులు ఎన్ని పాటలు రాశారో! ఎవరైనా బాగా పాడారంటే మాతోనే పోలుస్తారు గాన కోకిల అని. గుర్రం జాషువా గారినయితే కవి కోకిల అని బిరుదిచ్చారు. ఆవిడెవరూ... ఆ... సరోజినీ నాయుడు. ఆమె చక్కగా రాయడమే కాదు.. గొంతెత్తి కమ్మగా పాటలు పాడేదని నైటింగేల్ ఆఫ్ ఇండియా అన్నారామెని. అసలు సినిమా వాళ్లు మా మీద ఎన్నెన్ని పాటలు కట్టారో తెలుసా? ఆ పాటలకు పురస్కారాలు కూడా పుచ్చుకున్నారు కానీ, మమ్మల్ని మాత్రం పట్టించుకోలేదు. అయినా మేమేమీ చిన్నబుచ్చుకోము లేండి... ఆ పాటలు విని మాలో మేమే పొంగిపోతుంటాం. మా పక్షి జాతికంతటికీ చెట్లంటే చాలా ఇష్టం. కాదు, ప్రాణం. చెట్లే మా నివాస స్థావరం. మీరు మాత్రం మీ నివాస స్థానం కోసం మా నివాస స్థావరాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. మేము ఎక్కడ ఉండాలి? మా బతుకు ఏం కావాలి? అడవుల్లోకెళ్లి తలదాచుకుందామనుకుంటే అక్కడికీ అడుగుపెట్టేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికే మేము ఇదివరకటంత బాగా మీకు వినిపించట్లేదు. మీరిలాగే చేస్తుంటే మీ పిల్లలకు మీరు మా బొమ్మల్ని తప్ప మమ్మల్ని చూపించలేరు. మా కుహు కుహూలు ఇక మీకు నహీ నహీ! - బాచి -
మామిడి పళ్లూ... పెసర గుగ్గిళ్లు
వేసవి జ్ఞాపకం... వేసవి ఉక్కపోతను తట్టుకోలేక చాలామంది తిట్టుకుంటూ ఉంటారు కానీ నాకు మాత్రం ఎండాకాలమంటే ఇష్టం ఎందుకంటే మగ్గిన మామిడి పళ్ల వాసనలు, మల్లెపూల పరిమళాలూనూ. లేత తాటిముంజలు, ఈతపళ్ల తియ్యదనాన్ని రుచి చూడాలంటే వేసవి కాలం రావలసిందే కదా. చిన్నప్పుడు ఎండాకాలం మొదలవడంతోటే అమ్మా, అమ్మమ్మా, నాయనమ్మా, అత్తలు కలిసి పెట్టిన అప్పడాలు, వడియాలను కాకులు ఎత్తుకుపోకుండా, కుక్కలు ముట్టుకోకుండా కాపలా కాసే డ్యూటీ పడేది! మధ్యమధ్యలో ఎండినయ్యో లేదో చూసే వంకతో పచ్చిపచ్చిగా ఉన్న వడియాలను రుచి చూడటం ఒక పచ్చి జ్ఞాపకం. అన్నట్టు అప్పడాలు ఎండినయ్యో లేదో కనుక్కోవడానికి మా అమ్మమ్మ ఒక చిట్కా చెప్పింది. అదేమంటే అప్పడాలు వాటంతట అవి బోర్లాపడుకోబెట్టినట్టుగా కొద్దిగా పైకి లేస్తే అవి ఎండినట్టు. ఆరేసిన బట్ట కింద చిన్నగా చెయ్యి పోనివ్వగానే ఊడి వస్తుంటే గనక వడియాలు ఆరినట్టు. వాటి సంగతి ఏమోగాని వాటి వంకతో చెట్టు కింద కూచుని చందమామ పుస్తకంలో విక్రమార్కుడి భుజాన వేళ్లాడే తెల్ల తోకదెయ్యం బొమ్మను చూస్తూ కూచోవడం ఒక జ్ఞాపకం. పొద్దున్న పదింటికల్లా అన్నం తినేసి, ఒక రౌండు ఆటలు ఆడుకునేవాళ్లం. మధ్యాన్నం పన్నెండున్నరా ఒంటిగంటకల్లా మా తాతయ్య ఇంట్లో కిటికీలన్నింటికీ తడిబట్టలు కట్టించి ఇంటిని ఏసీలా మార్చేసేవాడు. నాలుగున్నరా అయిదు వరకూ పిల్లలెవరూ ఇంట్లో నుంచి బయటకు కదలడానికి వీల్లేదు. నిద్దరొచ్చేదాకా తాతయ్య చెప్పిన కబుర్లు వింటూ వాసాలు లెక్కిస్తూ ఎండకు చివ్వుచివ్వుమనే పిచ్చుక కూతలను వింటూ చాపల మీద పడి దొర్లేవాళ్లం. కాసేపు బజ్జోని లేచేసరికి మామిడిపళ్ల వాసన గాలిలోంచి తేలుతూ వచ్చి పలకరించేది. ఒక చిన్నగిన్నెలో మామిడిపండు పెట్టి ఇచ్చేది మా నానమ్మ. అది తినకుండానే ఆశగా రెండో పండు వైపు చూసేవాణ్ణి. ‘ముందు ఇది తిను, దాని సంగతి తర్వాత చూద్దువుగానీ’ అనేది నవ్వుతూ. మామిడిపండో, ఈతకాయలో, సపోటా పళ్లో... ఇలా ఏవో ఒక చిరుతిళ్లు సిద్ధంగా ఉండేవి ఇంట్లో ఎప్పుడూ! ఏవీ లేకపోతే కందులో పెసలో ఉడకబెట్టి, ఉప్పూకారం కొత్తిమీర, కరివేపాకు వేసి ఘుమఘుమలాడే గుగ్గిళ్లు చేసి పెట్టేది. ఇక సాయంత్రం పూట ఆడపిల్లలకు పూలజడలు వేసేవాళ్లు. జడతో ఫొటోలు తీయించేవాళ్లు. పూలజడ వేయించుకుని వచ్చి, పెద్దవాళ్లకు దణ్ణం పెట్టడం వాళ్లు ప్రేమగా బుగ్గలు పుణికి పదో పరకో చేతిలో పెట్టడం ఒక రూపాయి కాసులాంటి జ్ఞాపకం. ఇప్పుడు అప్పడాలూ వడియాలూ పెట్టడం, పూలజడలు వేయించుకోవడం పల్లెటూళ్లలో కూడా చాలా అరుదుగా కనిపించే దృశ్యమే అయింది. పెద్దోళ్లేమో ఏసీలు, కూలర్లు పెట్టుకుని టీవీ చూస్తూ ఇంట్లో పడుకోవడం, పిల్లలేమో కంప్యూటర్లోనో, స్మార్ట్ ఫోన్లలోనో గేమ్స్ ఆడుకోవడం సర్వసాధారణమైపోయింది. ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ నవ్వులు, ఉట్టుట్టి ఆటలు... అంతా ఉట్టుట్టికే! అసలు ఉబ్బరింత ఇదే కదా. - బాచి -
రిపోర్ట్ ప్రవర్ ఫుల్
ఇప్పుడంటే మగవాళ్లని ఆడిపోసుకుంటున్నారు కానీ, అప్పట్లో అంటే పురాణకాలంలో అందమైన మగవాళ్లకు ఆడవాళ్ల నుంచి ముప్పు ఉండేదట! ప్రవరాఖ్యుడినే తీసుకుంటే... వరూధిని అనే అందగత్తె మనవాణ్ణి ఎన్ని తిప్పలు పెట్టింది... ఎంత కవ్వించింది, ఎంత లవ్వించింది..? అసలే పెళ్లయిన వాణ్ణి అని మొత్తుకుంటున్నా వినకుండా వచ్చి మీదపడిపోయిందట. అయినా సరే, ప్రవరుడు ఆవిడ అందచందాలకు, హావభావ వచోవిన్యాసాలకూ మీసమెత్తు కూడా చలించక ఛీ పొమ్మన్నాడట. అప్పుడు ఆమెగారు అంటే వరూధిని అప్పట్లో అత్యంత సౌందర్యవంతులుగా పేరు పొందిన నలకూబరుడు, జయంతుడు, వసంతుడు... అనే ముగ్గురు మగానుభావులను తలచుకుని, వారెవ్వరూ కూడా చక్కదనంలో ఇతగాడి కాలిగోరు పాటి చెయ్యరే! అని వాపోయిందట. సూర్యుణ్ని సానబట్టి పొడితీసి ఆ బంగారు అడుసులో ఈ రజనుకలిపి అమృతం చేర్చి ఆ బ్రహ్మ ఈతణ్ణి సృష్టించాడా అన్నంత అందంగా ఉన్నాడే... అసలింత అందమెలా సాధ్యమీ యువకునిలో!’’ అని తలపోసిందట. ఆమె ఎంతగా రెచ్చగొట్టినా మనవాడు మాత్రం ఖాతరు చెయ్యకుండా, కాదు పొమ్మన్నాట్ట. చేసేదేమీ లేక అతణ్ణే తలచుకుని బాధపడుతుంటే, అదను చూసి మాయాప్రవరుడు ఆమె తాపం తీర్చాడట. మరొకావిడ... రంభ కూడా ఇలానే చేసిందట.. అర్జునుణ్ణి చూసి మనసు పారేసుకుని వచ్చి మీదపడితే, మనవాడు ఎంతో వినమ్రంగా, ‘నువ్వు నాకు అమ్మమ్మ వరుస’ అన్నాడట. దాంతో ఆమెకు రోషమొచ్చి, ‘ఆడదాని మనసు గ్రహించలేని నువ్వు నపుంసకుడివైపోతావులే’ అని శపించదట. అయితే అర్జునుడు ఆమెను అరటిచెట్టై పొమ్మని ప్రతిశాపమిచ్చి, తనకిచ్చిన ఆ శాపాన్ని అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో బృహన్నలగా ఉంటూ వరంగా మార్చుకున్నాడట. రామలక్ష్మణులను చూసి, శూర్పణఖ అనే రాకాసి ఇలానే మోహించిందా, ఆ తర్వాత భీముడిపై హిడింబ అనే మాయావి మనసు పారేసుకుంది. చెప్పుకుంటూ పోతే జాబితా కాస్తా కొండవీటి చాంతాడంత అవుతుందికానీ వారిలో ప్రవరుడే పవర్ ఫుల్! - బాచి