గజకచ్ఛపాలు!
పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనే అన్నదమ్ములు ఉండేవారు. అన్నదమ్ములంటే ఐకమత్యానికి ప్రతీకలా ఉండాలి. ఈ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం ఆస్తి కోసం ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవారు.
ఒకసారి వీరి పోట్లాట శ్రుతి మించింది.
‘‘నువ్వు ఏనుగై పోవాలి’’ అని అన్న శపించాడు.
దీనికి ప్రతి శాపంగా-
‘‘నువ్వు తాబేలైపో’’ అని తమ్ముడు శపించాడు.
అలా ఇద్దరు ఏనుగు, తాబేలైపోయారు.
గజం అంటే ఏనుగు. కచ్ఛపం అంటే తాబేలు.
అన్నదమ్ములు ఏనుగు, తాబేళ్లుగా మారినా వారి బుద్ధి మాత్రం మారలేదు. ఎప్పటిలాగే ఆస్తికోసం పోట్లాడుకునేవారు. ఈ కథ నేపథ్యం నుంచి వచ్చిందే ‘గజకచ్ఛపాలు’ జాతీయం.
ఆస్తి కోసం తరచూ పోట్లాడుకునే అన్నదమ్ములను, దాయాదులను ‘గజకచ్ఛపాలు’ అంటారు.
గట్టి కొమ్మ!
ఆపదలో ఉన్నప్పుడో, కష్టాల్లో ఉన్నప్పుడో ఆదుకునే వ్యక్తిని ‘గట్టి కొమ్మ’తో పోల్చడం పరిపాటి.
ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు గెంతే ప్రయత్నంలో గట్టి కొమ్మను ఊతం చేసుకుంటారు.
కొమ్మ గట్టిదైతేనే క్షేమంగా అవతలి వైపుకు చేరుకుంటాం.
కొమ్మ బలహీనమైతే ప్రమాదంలో పడతాం.
మన క్షేమం అనేది కొమ్మ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది.
మనుషుల్లో కూడా గట్టి కొమ్మల్లాంటి వారు ఉంటారు. బలహీనమైన కొమ్మల్లాంటి వారు ఉంటారు. గట్టి కొమ్మల్లాంటి వారిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. పదిమందికీ ఉపయోగపడే వ్యక్తిని, ఆదుకునే వ్యక్తిని ‘గట్టి కొమ్మ’తో పోల్చు తుంటారు.
పులికి ఏ అడవి అయినా ఒక్కటే!
కొందరికి పని అనేది రెండో విషయం. సౌకర్యాలు, అనుకూలమైన విషయాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు. కొందరు మాత్రం పని గురించే ఆలోచిస్తారు. అసౌకర్యాలు, ప్రతికూలతల గురించి ఆలోచించరు. ఇలాంటి వారిని ఉద్దేశించి వాడే మాటే ‘పులికి ఏ అడవి అయినా ఒక్కటే’
పులి తాను ఉన్న అడవికి కాకుండా కొత్త అడవికి వెళితే? అయోమయానికి గురవుతుందా? బెదరుతుందా? భయపడుతుందా?... ఇవేమీ జరగవు. అది ఏ అడవికి వెళ్లినా తన సహజశైలిలో ఎప్పటిలాగే నిశ్చింతగా, నిర్భయంగా ఉంటుంది!
సమర్థుడికి ఎక్కడైనా ఒక్కటే అనే భావాన్ని స్ఫురింపచేయడమే ‘పులికి ఏ అడవి అయినా ఒక్కటే’ మాట ఉద్దేశం.
సింగడు బూరడు!
పూర్వం... యుద్ధం మొదలయ్యే ముందు కొమ్ము బూర ఊదేవారు.
కొమ్ము బూర ఊదడం (సింగినాదం) అనేది యుద్ధానికి సన్నద్ధం కావడం, కయ్యానికి కాలుదువ్వడానికి సూచనగా ఉండేది. ఈ నేపథ్యం నుంచే...
ఎవరైనా కయ్యానికి కాలుదువ్వితే ‘సింగడు బూరడు’ అయ్యాడు అని అంటుంటారు.
జాతీయాలు
Published Sat, Jun 4 2016 9:47 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
Advertisement
Advertisement