దండకారణ్యంలో గాలిస్తున్న ప్రత్యేక పోలీసులు
చర్ల : దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఒక పక్క మావోయిస్టులు మరో పక్క పోలీసుల మధ్య ఆదివాసీలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మావోయిస్టులను నిర్మూలించే పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌లు సంయుక్తంగా ప్రకటన జారీ చేశారు. బంద్ పిలుపు నేపధ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, అధిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా, బస్తర్ మహారాష్ట్రంలోని గడ్చిరోలీ ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి, కోరాఫుట్, కందెమాల్, బలిగేల్, నూవాపాడ తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంత పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు భద్రత ఏర్పాట్లు చేశారు.
శనివారం రాష్ట్ర సరిహద్దున ఉన్న తోగ్గూడెం సీఆర్‌పీఎఫ్ 151 బెటాలియన్‌కు చెందిన బేస్‌క్యాంపు పైన రోడ్డు తనిఖీ చేస్తున్న ఎస్టీఎఫ్, బీఆర్‌జీ బలగాలపైన మావోయిస్టులు మూకుమ్మడిగా దాడికి యత్నించగా తమదైన శైలిలో బలగాలు తిప్పి కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడిలో మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా పార్టీకి చెందిన కంపెనీ పాల్గొన్నట్లు భావిస్తున్న పోలీసు యంత్రాంగం అదే స్థాయిలో వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్‌ఫీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్‌జీ, సీఏఎఫ్ బలగాలు మూకుమ్మడిగా ఆపరేషన్‌ను చేపట్టాయి.
అదనపు బలగాల తరలింపు..
సరిహద్దులో ఉన్న పోలీస్ స్టేషన్లు, బేస్‌క్యాంపులకు అదనపు బలగాలను తరలించి భద్రతను పటిష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ అగ్రనేతలే బంద్‌కు పిలుపునివ్వడంతో ఎటువంటి విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలను చూసి ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు పోలీసులు మరో వైపు మావోయిస్టులు మధ్య ఉన్న ఆదివాసీలు ఏ వైపు నుంచి ఏ తూటా వచ్చి ఎవరికి తగులుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లల్లో నుంచి బయటకు రావడానికి భయపడుతుండడంతో ఆదివాసీ పల్లెలన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఆదివాసీలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు కొనసాగుతున్న వారపు సంతలు సైతం నిలిచిపోయాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. సరిహద్దు ప్రాంత గ్రామాలలో చేస్తున్న అభివృద్ధి పనులకు వినియోగిస్తున్న యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రత్యేక పోలీసు బలగాలు వచ్చిపోయే వారిని నిశితంగా పరిశీలిస్తూ వారి నుంచి వివరాలను సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment