దట్టమైన అటవీ ప్రాంతంలో 10 కి.మీ. నడిచిన భద్రాద్రి కలెక్టర్, ఐటీడీఏ పీఓ
పోడు చేసుకోనివ్వడం లేదని హైకోర్టులో గిరిజనుల పిటిషన్
కోర్టు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఐఏఎస్‌లు
దుమ్ముగూడెం: ఇద్దరు ఐఏఎస్‌లు.. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్, మరొకరు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్. పోడు సాగు అంశంపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనలతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడవిబాట పట్టారు. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో రానుపోను 10కి.మీ. నడిచారు.
సమస్య ఏంటంటే...
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్ పరిధిలో పలువురు రైతులకు కొన్నాళ్ల క్రితం పోడు పట్టాలు అందాయి. అయితే, ఈ భూమిలో అటవీ అధికారులు తమను సాగు చేసుకోనివ్వడం లేదని, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ 23మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న కోర్టు సూచనలతో కలెక్టర్ పాటిల్, పీవో రాహుల్ మంగళవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం మండలంలోని ములకనాపల్లి ప్రధానరహదారి వరకు మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల్లో వెళ్లారు.
అక్కడినుంచి దట్టమైన అడవిలో రెవెన్యూ, అటవీ అధికారులతో కలిసి కాలిబాటన వాగులు, వంకలు దాటుతూ గౌరారం వరకు 5 కి.మీ. వెళ్లి సమస్యపై రైతులు, అటవీ అధికారులతో మాట్లాడారు. అడవిని నరికారని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమించినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పాటిల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హక్కు పత్రాల్లో ఉన్నంత మేరకు భూమి సాగు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సమయాన అటవీ ప్రాంతంలో ఇద్దరు ఐఏఎస్‌లు పర్యటించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment