ఆనవాళ్లు లేకుండా కాల్చినది ఎందుకో..!!
చెంఘీజ్‌ఖాన్‌పేటలో అనుమానాస్పదంగా సంఘటన
కాల్చిన బూడిదలో ఎముకలు లభ్యం
యడ్లపాడు: కొండవీడు రిజర్వు ఫారెస్టు కొండల సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపారన్న వార్త మండలంలో కలకలం రేపింది. యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామంలోని సచివాలయం వెనుకవైపు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని శుక్రవారం పోలీసులకు గొర్రెల కాపరులు సమాచారం ఇచ్చారు. దీంతో చిలకలూరిపేట రూరల్ సీఐ పి శ్రీనివాసరెడ్డి, యడ్లపాడు ఎస్‌ఐ జె శామ్యూల్ రాజీవ్‌కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
గ్రామ సచివాలయం వెనుక అటవీ ప్రాంతంలోని పూలలొద్ది ఆంజనేయస్వామి గుడి కొండవీడు కొండల నడుమ అనుమానాస్పదంగా కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి. సుమారు 4 అడుగుల వైశాల్యంలో కాల్చిన బూడిద, అందులో బొగిలిపోయిన ఎముకలు, ఘటనా స్థలికి కొద్దిదూరంలో ఓ పుర్రె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లా అధికారులకు సమాచారం అందించి క్లూస్ టీంను పిలిపించారు. సంఘటనా స్థలంలోని పలు ఆధారాలను క్లూస్‌టీం అధికారులు సేకరించారు. వీఆర్వోల ఫిర్యాదుతో అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేశారు. సీఐ పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చెంఘీజ్‌ఖాన్‌పేటకు చెందిన గొర్రెలకాపరులు ఇచ్చిన సమాచారం మేరకు తాము శుక్రవారం సంఘటనా స్థలాన్ని చేరుకున్నామన్నారు.
సంఘటనా స్థలంలో బాగా కాల్చడంతో కనీస ఆనవాళ్లను గుర్తించ లేకపోతున్నామన్నారు. దగ్ధమైన సంఘటన మాత్రం కనీసం మూడు రోజులు కిందట జరిగి ఉంటుందని భావిస్తున్నామని వివరించారు. అలాగే ఎముకలు చిన్నవిగా అందులోనూ నల్లగా మారిపోయి ఉండటంతో ఇవి మనిíÙవా లేక ఏదైన వన్య ప్రాణిదా అన్న విషయాన్ని తేల్చలేకపోతున్నామన్నారు. నిర్మానుష్య ప్రాంతంలో ఆ స్థాయిలో దగ్ధం చేయడానికి కారణాలు ఏమిటో తెలియాలంటే ముందుగా క్లూస్ టీం సేకరించిన ఫొరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఇచ్చిన ఆధారాలతో కేసు దర్యాప్తు ముందుకు పోతుందని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment