సరిహద్దుకు బలగాలు | Police High Security For Bhadradri Event | Sakshi
Sakshi News home page

సరిహద్దుకు బలగాలు

Published Fri, Mar 23 2018 9:03 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

Police High Security For Bhadradri Event - Sakshi

సరిహద్దులో కూంబింగ్‌కు వెళ్తున్న ప్రత్యేక బలగాలు

చర్ల: సరిహద్దు ప్రాంతానికి ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా తరలుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసే క్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నెల 26న భద్రాచలంలో శ్రీరామ నవమికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టుల నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతాచర్యలు చేపట్టారు.

మార్చి 2న బీజాపూర్‌ జిల్లాలోని పూజారికాంకేడ్‌ ఆటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నేతలను మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ తీవ్రంగా హెచ్చరించిన విషయం పాఠకులకు తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మావోయిస్టుల నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకుగాను సరిహద్దులో విస్తృతంగా కూంబింగ్‌ ఆపరేషన్‌ను బలగాలు చేపట్టాయి. గ్రేహౌండ్స్, సీఆర్‌ఫీఎఫ్, స్పెషల్‌ పార్టీ, కోబ్రా బలగాలు కూడా సరిహద్దుకు తరలుతున్నాయి.  

ఇద్దరు ఆదివాసీలను విచారించిన పోలీసులు 
సరిహద్దు ప్రాంతంలోని చెన్నాపురం గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. బైండోవర్‌ కేసులో భాగంగా సంతకాలు చేసేందుకు చర్ల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వారిలో చెన్నాపురం గ్రామస్తులు మడకం మంగయ్య, మడకం బాము ఉన్నారు. వీరిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిచిపెట్టకపోవడంతో కుటుంబీకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గురువారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించి వదిలేశారు. దీనిపై సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను వివరణ కోరగా.. ‘‘వారిద్దరిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమే. విచారించి విడిచిపెట్టాం’’ అని చెప్పారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement