ససేమిరా!
పూర్వం ఒక రాకుమారుడు అడవికి వెళ్లాడట. అక్కడ పులిని చూసి భయపడి చెట్టు ఎక్కాడట. అప్పటికే ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి ఉంది. ‘రాకుమారా... నీవేమీ భయపడకు’ అని ధైర్యం చెప్పింది. మరోవైపు చెట్టుకింద ఉన్న పులి... రాకుమారుడికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘నువ్వు ఆ ఎలుగుబంటిని కిందికి తోసేయ్. నిన్నేమీ చేయను’ అంది పులి. ఇదేదో బాగుందే అనుకొని రాకుమారుడు ఎలుగుబంటిని కిందికి తోసేశాడట. దాని అదృష్టం బాగుండి, చెట్టు కొమ్మలను పట్టుకొని కింద పడకుండా ఉండిపోయింది. ‘కృతజ్ఞత లేని మనిషీ... ఈ క్షణం నుంచి నువ్వు గతమంతా మరిచి పోతావు’ అని శపించింది ఎలుగుబంటి. రాకుమారుడి అదృష్టం బాగుండి రెండో రోజే సైనికులు అతడి ఆచూకిని కనుక్కుని కోటకు తీసుకువెళ్లారు.
శాప ప్రభావంతో అన్నీ మర్చిపోయిన ఆ వ్యక్తికి తన ఊత పదమైన ‘ససేమిరా’ ఒక్కటే గుర్తుంది. ‘నీవెవరు?’ అని అడిగితే ‘ససేమిరా’ అనేవాడు. ‘మీ తండ్రిగారి పేరేమిటి’ అంటే ‘ససేమిరా’ అనేవాడు. దాంతో కోపం వచ్చిన మంత్రి... ‘రాకుమారా... మూర్ఖంగా ప్రవర్తించకు. అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పు’ అంటే... దానికీ ‘ససేమిరా’ అనే అనేవాడు. ఈ రాకుమారుడి జ్ఞాపకశక్తి ఎలా వచ్చింది అన్న విషయం పక్కనపెడితే... అది తర్వాత అందరికీ ఊతపదమైంది. తమకు నచ్చనిది చెప్పినప్పుడు ససేమిరా అనడం, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని చెప్పాల్సి వచ్చినప్పుడూ ససేమిరా అనడం అందరికీ అలవాటయ్యింది.
కోడిగుడ్డు తంటసం!
ఏ పని చేసినా దానికి ప్రయోజనం ఉండాలి. అప్పుడే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కాలం, శ్రమ... ఈ రెండూ విలువైనవి. వాటి విలువ పని చేసే క్రమంలో మరింతగా పెరుగుతుంది. పస లేని పనులు, అప్రయోజకమైన పనులు ఎంచుకున్నప్పుడు... ఈ రెండూ వృథా అయిపోయి, మన ఖాతాలో ‘అవివేకం’ మాత్రమే మిగిలిపోతుంది. అందుకే పనులు చేయడం ఎంత ముఖ్యమో, పనులు ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆ విషయాన్ని చెప్పేదే ఈ జాతీయం!
‘కోడిగుడ్డు తంటసంలాంటి పనులు చేయవద్దు’, ‘నేను మొదటి నుంచీ చెబుతున్నాను. మీరు చేసే పని కోడిగుడ్డు తంటసం అని!’.... ఇలాంటి మాటలు నిత్యజీవితంలో వినిపిస్తుంటాయి. ‘తంటసం’ అంటే వెంట్రుకలను లాగే పరికరం. మరి కోడిగుడ్డుకు తంటసం ఎందుకు? దాని మీద ఒక్క వెంట్రుకైనా ఉండదు కదా! ఇది మన అవగాహన. కానీ వెనకటికెవరో ‘ప్రయత్నిస్తే ఎందుకు ఉండదు!’ అని మొండిగా వాదించాడట. గుడ్డు మీద లేని వెంట్రుకలను లాగడానికి తెగ ప్రయత్నించి తీవ్రంగా నవ్వుల పాలయ్యాడట! తెలివి తక్కువ పనులు, పనికిరాని పనులు, ఆశ శృతి మించి చేసే పనుల విషయంలో ఉపయోగించే జాతీయం ఇది.
మిట్ట పెత్తనం!
‘ఊరకే అరవడం తప్ప పనేమీ చేయడు... అంతా మిట్ట పెత్తనం’... ‘నువ్వు చేయాల్సింది మిట్ట పెత్తనం కాదు... నలుగురితో కలిసి కష్టించడం’... ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. పని చేయకుండా హడావుడి చేసేవారి విషయంలో ఉపయోగించే మాట ఇది. పూర్వం పొలాల్లో మిట్ట (ఎత్తయిన ప్రదేశం) మీద కూర్చొని అది చెయ్, ఇది చెయ్, అలా చెయ్, ఇలా చెయ్ అని చెప్ప డానికి ఒక వ్యక్తి ఉండేవాడు. ఎండలో రెక్కలు ముక్కలు చేసుకునేవారి కంటే ఇతడి పని సుఖంగా ఉండేది. వాళ్లను చూసే ఈ మాట పుట్టింది!
చిలక చదువు!
‘చదువుకున్నాడన్న మాటేగానీ... అంతా చిలక చదువు’ అంటుంటారు కొందరు. అంటే అర్థం ఏమిటి? చదువు అనేది ‘ఇంతవరకే’ ‘ఇక్కడి వరకే’ అని ఉండదు. అదొక తీరని జ్ఞానదాహం. కొందరు మాత్రం కొంత చదువుకొని ‘ఇక తమకు అంతా వచ్చేసింది’ అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సామాజిక స్థితిగతులు, ధోరణులు వేటి గురించీ అవగాహన ఉండదు. నేర్చుకున్న దానికంటే ఒక్క అక్షరం ముక్క కూడా ఎక్కువ తెలియదు వీరికి. చిలకకు చదువు చెబితే, మనం ఎక్కడి వరకు చెబితే అక్కడి వరకే నేర్చుకుంటుంది. మరింత నేర్చుకోవాలనే ఆసక్తి దానికేమీ ఉండదు. నేర్చుకున్న దాని కంటే ఎక్కువ తెలివినీ ఉపయోగించదు. కొందరు మనుషులు కూడా అంతే అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం.
మన జాతీయాలు
Published Sat, Oct 31 2015 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM
Advertisement
Advertisement