అంపశయ్య
భీష్ముడు తనను నిరాకరించాడనే కోపంతో ‘నిన్ను సంహరిస్తాను’ అని శపథం చేస్తుంది అంబ. దీనికి సమాధానంగా ‘నువ్వు ఏ రోజు అయితే ఆయుధం చేతపూని నా ఎదుట నిల్చుంటావో... అప్పుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను’ అని ప్రతిన పూనుతాడు భీష్ముడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి శివుడి కోసం తపస్సు చేసి ‘అంబ’ శిఖండిగా మారుతుంది. మహాభారత యుద్ధంలో... శిఖండిని అడ్డు పెట్టుకొని పాండవులు యుద్ధం చేయడం వల్ల భీష్ముడు అస్త్రసన్యాసం చేస్తాడు. భీష్ముడు అస్త్రసన్యాసం చేసిన వెంటనే అర్జునుడు అతని శరీరంపై బాణాల వర్షం కురిపిస్తాడు. ఆ బాణాలే అతని శయ్యగా మారుతాయి. ఎవరైనా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు లేదా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ‘అంపశయ్య పై ఉన్నట్లు ఉన్నాడు’ అంటారు.
పెదగంగ ఉదకం
గంగానది గురించి పురాణాల్లో ఎన్నో విశిష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. ‘దేవగంగ’, ‘ఆకాశగంగ’ అనే పేర్లతో స్వర్గలోకంలో ప్రవహించేదట. ఆకాశగంగలో రాజహంసలు విహరిస్తాయట. బంగారు తామరలు అందంగా వికసిస్తాయట. స్వర్గానికి వెళ్లిన వారు ఇందులో స్నానం చేస్తారట. ఆకాశంలోని పాలపుంతను కూడా పెద గంగ అంటారు. ఆకాశ గంగ గొప్పదనం, అందం మాట ఎలా ఉన్నా... అది నిజంగానే ఉందా? లేక కల్పనా? అనేది తెలియదు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టిందే ‘పెదగంగ ఉదకం’ పెదగంగ ఉదకం అంటే ఆకాశగంగ. ఇది ఉందో లేదో ఎవరికీ తెలియదు. అంటే గగన కుసుమం లాంటిదన్నమాట!
సంపాతి జటాయువులు...
చాలా పాత తరం వ్యక్తులు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఇది. సంపాతి మరియు జటాయువులు రామాయణంలో పాత్రలు. సంపాతి, జటాయువులు అన్నదమ్ములు. గద్దలు. సూర్యమండలానికి ఎవరు త్వరగా చేరుకుంటారనే దానిపై ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడతారు. ఈ పోటీలో జటాయువు త్వరగా సూర్యమండలం వైపు దూసుకెళతాడు. ఈ సమయంలో జటాయువు రెక్కలు కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సంపాతి తన రెక్కలు అడ్డుపెడతాడు. రెక్కలు కాలిపోతాయి.
జటాయువు సీతమ్మను రక్షించే ప్రయత్నంలో రావణాసురుడితో యుద్ధం చేసి చనిపోయిన విషయం తెలిసిందే. సంపాతి, జటాయువుల త్యాగాల మాట ఎలా ఉన్నా... ‘పాత తరం వ్యక్తులు’, ‘చాలా అనుభవం ఉన్న వాళ్లు’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఏదైనా సందేహం ఉంటే వాళ్లను అడుగు. ఎంతో అనుభవం ఉన్నవాళ్లు. సంపాతి జటాయువులు’ అంటారు.
శకారుడు!
శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం ‘మృచ్ఛకటికం’. పది అంకాలున్న నాటకం ఇది. ‘వసంతసేన’ అనే పాత్ర ఈ నాటకంలోనిదే. ఉజ్జయినిని పరిపాలించే రాజు బావమరిది శకారుడు. శకారుడికి లేని దుష్ట లక్షణం లేదు. శకారుడిలో మూర్ఖత్వం, అజ్ఞానం, దుర్మార్గం మూర్తీభవించి ఉంటాయి. తన అహంకారంతో ప్రజలను పట్టి పీడించేవాడు శకారుడు. దుర్మార్గాలకు పాల్పడేవాళ్లను, బంధువుల అధికారాన్ని అడ్డు పెట్టుకొని అరాచకాలు సృష్టించేవాళ్లను శకారుడితో పోల్చుతారు.
జాతీయాలు
Published Sat, Jul 9 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement