జాతీయాలు | Proverbs! | Sakshi
Sakshi News home page

జాతీయాలు

Published Sat, Feb 20 2016 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

Proverbs!

నందో రాజా భవిష్యతి!
‘‘నువ్వు చెప్పిన విషయం వింటుంటే ఆందోళనగా ఉందోయ్.’’
 ‘‘ఇప్పుడే ఆందోళన పడడం ఎందుకు? నందో రాజా భవిష్యతి... భవిష్యత్‌లో ఏం జరగనుందో ఎవరు చెప్పొచ్చారు?’’
 ‘భవిష్యత్‌లో ఏం జరుగుతుందో మనం ఊహించలేం’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
 దీని వెనక కథ ఇది:
 ఉత్తుంగభుజుడు అనే రాజు కుమారుడు నందుడు. ఉత్తుంగభుజుడు చెడు వ్యసనాలకు లోనై ఒక వేశ్య మాయలో పడిపోతాడు. రాణిని, కుమారుడు నందుడిని చిన్న చూపు చూస్తాడు. రాజులో వచ్చిన మార్పుకు ప్రజలు ఆందోళన పడతారు.
 ‘‘పాపం... ఆ కుర్రాడి భవిష్యత్ తలచుకుంటే బాధగా ఉంది. ఆ మహాతల్లి యువరాజా వారిని ఏం చేస్తుందో ఏమో’’ అని ఒకరంటే...
 ‘‘యువరాజా వారి భవిష్యత్ గురించి ఇప్పుడు ఆందోళన చెందడం ఎందుకు? కాలం ఎప్పుడూ ఒకే తీరులో ఉండదు. రాజావారు  చెడు వ్యసనాల నుంచి బయటపడవచ్చు. ఎప్పటిలాగే రాణిని, కుమారుడిని ప్రేమగా చూసుకోవచ్చు’’ అని ఒకరు ఆశావహదృక్పథంతో అనేవారు. నందుడి భవిష్యత్ గురించి ఆలోచన, ఆందోళన కాస్తా నందో రాజా భవిష్యతి అయ్యింది!
 
జిల్లేడు పెళ్లి!
‘‘అదో పెళ్లంటావా? ఉత్త జిల్లేడు పెళ్లి.’’
 ‘‘నువ్వు చేసుకుంది పెళ్లి కాదు జిల్లేడు పెళ్లి’’... ఇలాంటి మాటలు అసహనంతోనో, ఆగ్రహంతోనో వినిపిస్తుంటాయి.
  ఉత్తుత్తి పెళ్లి, దొంగపెళ్లి, ఎవరూ గుర్తించని పెళ్లిని జిల్లేడు పెళ్లి అంటారు. అసలీ మాట ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే...
  పూర్వం ఇద్దరు భార్యలు చనిపోయిన వ్యక్తి మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనికి మొదట జిల్లేడు పెళ్లి చేసేవారు. అంటే... ‘మూడు’ అనేది అంత మంచిది కాదన్న ఉద్దేశంతో జిల్లేడు చెట్టుకు తాళి కట్టించేవారు. దీంతో వరుడు చేసుకునే మూడో పెళ్లి కాస్త... నాలుగో పెళ్లి అయ్యేది. ఈ వ్యవహారం నుంచి పుట్టిందే... జిల్లేడు పెళ్లి!
 
గ్రంథసాంగుడు!
గ్రంథసాంగుడుకు నిజమైన అర్థం ఒక పుస్తకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు అని.
 గ్రంథం అంటే పుస్తకం. సాంగం అంటే... భాగాలతో కూడిన అని అర్థం.
 ఒక పుస్తకంలో భిన్నమైన భాగాలన్నింటినీ అధ్యయనం చేసినవాడు గ్రంథసాంగుడు.
 అయితే వ్యవహారికంలో గ్రంథ అధ్యయనంలో నిష్ణాతుడు అని కాకుండా... మోసం, రసికత్వం మొదలైన వాటిలో ఆరితేరిన వారిని ‘గ్రంథ సాంగుడు’ అనడం మొదలైంది.
 
తాపత్రయం
‘‘ఇంత తాపత్రయం’’ అవసరమా?
 ‘‘ఈయన తాపత్రయానికి అంతు లేదు’’... ఇలా తాపత్రయం అన్న పదాన్ని నిత్యజీవితంలో పదే పదే వింటూ ఉంటాం. అసలీ పదానికి అర్థం ఏమిటో తెలుసా?
 ‘అధిక ఆశ’, ‘అధికమైన ఆరాటం’ అనే అర్థాలతో ఈ మాటను వాడుతున్నప్పటికీ... నిజానికి తాపత్రయం అంటే లేని బాధలను కొనితెచ్చిపెట్టుకొని బాధపడడం.
 ఈ తాపత్రయంలో మూడు రకాలు ఉంటాయి.
 తన శరీరానికి కలిగిన బాధను తలచుకొని బాధ పడడం... ఆధ్యాత్మిక తాపం.
 తన కుటుంబానికి, స్నేహితులకు వచ్చిన కష్టాలను తలచుకొని బాధపడడం... అధి భౌతిక తాపం.
 ప్రకృతి వైపరీత్యాలను తలచుకొని బాధపడడం అధిదైవిక తాపం.
  ఈ మూడు తాపత్రయాల గురించి ఆలోచిస్తూ విచారపడడాన్ని తాపత్రయ పడడం అంటారు. బాధలు కాని వాటిని బాధలుగా అనుకుని బాధపడడం అన్నమాట.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement