జాతీయాలు | proverbs | Sakshi
Sakshi News home page

జాతీయాలు

Published Sun, Jul 17 2016 11:58 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

proverbs

గోవత్సం!
‘వాడి గురించి చెప్పకు... వాడుత్త గోవత్సం’
 ‘గోవత్సంలా బతికాడు... సొంతంగా ఏమీ తెలియదు’ ఇలాంటి మాటలు వింటుంటాం.
 కొందరు తల్లి చాటు బిడ్డలా పెరుగుతారు. పూర్తిగా తల్లి మీదే ఆధారపడతారు.
  ఏ పని చేయాలన్నా, చివరికి ఏ విషయమైనా ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలనుకున్నా కూడా అమ్మ జపమే చేస్తారు. ఇలాంటి అమ్మ కూచులను ‘గోవత్సం’ అంటారు.
 గోవు అంటే ఆవు.
 వత్సం అంటే దూడ.
 రెండిటినీ కలిపి ‘గోవత్సం’ అంటారు.
 ఆవుదూడలు అమ్మకానికి వచ్చినప్పుడు... ‘ఆవు ధర’, ‘దూడ ధర’ అని ప్రత్యేకంగా ఉండవు.
 ఆవు ధర లేదా విలువే దూడ ధర, విలువ అవుతుంది.
 అంతే తప్ప... ఆవుకు ఒక ధర, విలువ దూడకు ఒక ధర, విలువ  అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఈ నేపథ్యంలో నుంచి వచ్చిందే ‘గోవత్సం’ జాతీయం.
 
కేతిగాడు!
కొందరు ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్లను నవ్విస్తుంటారు.
 దీంతో వారు ఏది చెప్పినా ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు.
 ‘వాడు చెప్పింది నమ్ముతున్నారా? వాడో కేతిగాడు’, ‘పట్టించుకో దగ్గ వ్యక్తి కాదు... కేతిగాడికి ఇతడికి తేడాలేదు’ ‘కేతిగాడిలా తెలివితక్కువ పనులు, పిచ్చి వేషాలు వేయకు’... ఇలాంటి మాటలు అక్కడక్కడా వినబడుతుంటాయి.
 తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రల్లో జుట్టుపోలిగాడు, అల్లాటప్పగాడు, బంగారక్కలతో పాటు కేతిగాడు ఒకరు. మధ్యలో ఊడిపడి అప్పటికప్పుడు హాస్యం సృష్టించడంలో ఈ కేతిగాడు దిట్ట.
 
 
తాపత్రయం
తాపాలు మూడు రకాలు... 1. ఆధ్యాత్మికతాపం,
 2. అధిభౌతికతాపం, 3. అధిదైవికతాపం
 మూడు రకాల తాపాలను భరించడమే తాపత్రయం. తన వ్యక్తిగత విషయాలకే కాకుండా ప్రపంచ సమస్యను తన సమస్య అనుకోవడం. కవి మాటల్లో చెప్పాలంటే ‘ప్రపంచ బాధే నా బాధ’ అనుకోవడం. అయితే వాడుకలో మాత్రం ఆధ్యాత్మిక అర్థంలో కాకుండా  ‘తాపత్రయం’ అనేదాన్ని ‘అత్యాశ’, ‘ఆరాటం’ అనే అర్థంలో వాడడం కనిపిస్తుంటుంది.
 
వాతాపి జీర్ణం

భోజనం చేశాక మన పెద్దలు వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అంటూ పొట్టమీద చేతితో నిమురుకుంటారు. దీనికి నేపథ్యంగా మహాభారతంలో ఒక కథ ఉంది. వాతాపి, ఇల్వలుడూ ఇద్దరు అన్నదమ్ములు, వీళ్లు రాక్షస రాజులు. ఒకరోజు ఇల్వలుడు తాను కోరుకున్నది జరిగే వరం ఇవ్వమని ఒక మునిని అడుగుతాడు. అలాంటి వరం ఇవ్వడం కుదరదని ఆ ముని చెప్పగానే ఆగ్రహించిన ఇల్వలుడు... రుషి హత్యలు మొదలుపెడతాడు. తమ్ముడు వాతాపిని ఆహారంగా చేసి... మునులను, బాటసారులను విందుకు పిలిచి భోజనం పెడతాడు. విందు ఆరగించాక ... ‘వాతాపీ! బయటకు రా..’ అని పిలవగానే... అతడు వాళ్ల పొట్ట చీల్చుకుంటూ బయటకు వస్తాడు.

ఇలా మునులను, బాటసారులను చంపుతూ రాక్షసానందం పొందుతుంటారు ఇల్వలుడూ, వాతాపి. ఒకరోజు అగస్త్య మునిని విందుకు పిలుస్తారు. వాతాపిని ఆహారంగా మార్చి భోజనం పెడతాడు ఇల్వలుడు. మహా ముని అయిన అగస్త్యుడు సుష్టుగా భోంచేసి... తన మంత్ర శక్తితో పొట్ట లోపల వాతాపిని జీర్ణం చేసేస్తాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకు రాడు. ఇలాంటి నీచ కార్యాలు మానుకోమని ఇల్వలుడికి బుద్ధి చెప్తాడు అగస్త్యుడు. ఇది ఇతిహాస కథ. అయితే, నిత్యజీవితంలో మాత్రం సందర్భాన్ని బట్టి ‘జీర్ణం చేసుకున్నాడు’ అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement