ఆట విడుపు
ఇప్పుడు విద్యాలయాలకు ఆదివారాల్లో సెలవు ఉన్నట్లే... పూర్వం వీధి బడులలో వారానికి ఒకసారి సెలవు ఇచ్చేవారు. దీన్ని ఆట విడుపు అంటారు. వారంలోని మిగిలిన అన్ని రోజులు చదువుల కోసం కష్టపడే విద్యార్థులు ఆ సెలవు రోజు మాత్రం తమకు ఇష్టమైన ఆటలు ఆడుకునే వారు. చాలా సంతోషంగా గడిపేవారు. కేవలం విద్యార్థుల విషయంలోనే కాకుండా ఇతర సందర్భాల్లోనూ ఈ జాతీయాన్ని ఉపయోగించడం మొదలైంది. ఒకే పనిలో తలమునకలవుతూ... కాస్త విశ్రాంతి కోసమో, మార్పు కోసమో వేరే పని ఏదైనా చేస్తే... అది ఆట విడుపు అవుతుంది.
ఉదా: ‘ఈ పనిలో మూడు రోజుల నుంచి తీరిక లేదు. ఆట విడుపుగా ఏదైనా సినిమా చూసొస్తేగాని బండి కదిలేట్టు లేదు’
ఉంగరాల చేతి మొట్టి కాయ!
‘నాలాంటి బీద వాడు చెబితే వినే రకమా? ఉంగరాల చేతి మొట్టికాయ పడితేగానీ దారిలోకి రాడు’
‘నా మాటను పూచికపుల్లలా తీసేశాడు. ఆ కోటీశ్వరుడు చెబితే మాత్రం తు.చ తప్పకుండా పాటించాడు. ఉంగరాల చేతి మొట్టికాయ అంటే ఇదేనేమో’
బీదవాడి మాటకు, బలహీనుడి మాటకు కొద్దిమంది విలువ ఇవ్వరు.
వారి విషయంలో అది పట్టించుకోవాల్సిన విషయం కూడా కాదు.
‘నాకు అన్యాయం జరుగుతోంది’ అని నెత్తీ నోరు మొత్తుకున్నా చాలా మొండిగా వ్యవహరిస్తారు. ఇక చచ్చినా మారనట్లు కనిపిస్తారు. ఇదే వ్యక్తులు... కాస్త అధికారం, డబ్బు, హోదా ఉన్నవాళ్ల విషయంలో మాత్రం వేరే విధంగా వ్యవహరిస్తారు. వారు చెప్పినట్లు చేస్తారు. పోలీసులు, నాయ్యస్థానాల పుణ్యమా అని కొందరు వ్యక్తులు చచ్చినట్లు దారిలోకి వస్తారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో ఎక్కువగా ఉపయోగించే జాతీయమే... ఉంగరాల చేతి మొట్టికాయ.
గజస్నానం
ఏనుగు ఎంతో లోతుగల నీటిలో శుభ్రంగా స్నానం చేస్తుంది.
చూసేవాళ్లకు...
‘ఆహా! ఎంత శుభ్రత! ఎంత శుభ్రత!’ అనిపిస్తుంది.
శుభ్రంగా స్నానం చేసిన ఏనుగు...అవతలికి వచ్చిన వెంటనే... దారిలోని దుమ్మూ ధూళిని పైన చల్లుకుంటుంది.
చేసిన స్నానం వృథా అవుతుంది.
ఒక పని చేసినప్పటికీ అది వ్యర్థమైన సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది.
పులినోటి కండ
‘నువ్వు పులినోటి కండను ఆశిస్తున్నావు. అది సాధ్యమా?’
‘ఆ పని చేయడం ఎంత ప్రమాదకరం అంటే... పులినోటి కండను తేవడంలాంటిది’ వివిధ సందర్భాల్లో ఇలాంటి మాటలు వింటుంటాం.
పులినోట్లో మాంసం కండ ఉంది.
దగ్గరకు వెళ్లి దాని నోట్లోని కండను తేవడం సాధ్యమయ్యే పనేనా?
ప్రాణాల మీద ఆశ వదులుకున్నప్పుడే అలాంటి దుస్సాహసానికి ఒడిగడతారు.
అసాధ్యమైన పని, ప్రమాదకరమైన పని గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించే జాతీయం ‘పులినోటి కండ’
జాతీయాలు
Published Sat, Sep 17 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
Advertisement
Advertisement