బ్రహ్మాండం!
ఒక ఆలోచన గురించో, వస్తువు గురించో ప్రశంసాపూర్వకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు- ‘బ్రహ్మాండంగా ఉంది’ అనడం చూస్తుంటాం. ఇంతకీ ఈ ‘బ్రహ్మాండం’ ఏమిటి? సృష్టికర్త బ్రహ్మ భూగోళాన్ని, ఇతర గోళాలను గుడ్డు(అండం) ఆకారంలో తయారుచేశాడని నమ్ముతారు. భూగోళాన్ని, ఇతర గోళాలను కలిపి ‘బ్రహ్మాండం’ అంటారు.
పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినా, పెద్ద పెద్ద రాక్షసులు గట్టిగా అరిచినా... ఇంకేమైనా పెద్ద ఘటనలు జరిగినా బ్రహ్మాండ భాండం(కుండ) బద్దలవుతుంది అంటారు.
స్థూలంగా చెప్పుకోవాలంటే ‘బ్రహ్మాండం’ అంటే ‘చాలా పెద్దది’ అని అర్థం. అందువల్ల పెద్ద పనులు, వస్తువుల విషయంలో ఈ మాటను వాడేవారు. అయితే కాలక్రమంలో అద్భుతమైన, అసాధారణ విషయాలు, విజయాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ‘బ్రహ్మాండంగా ఉంది’ అనడం మొదలైంది.
దంపతి కలహం!
‘వాళ్ల పోట్లాట చూసి కంగారు పడకు. అది దంపతి కలహం’
‘దంపతులన్నాక కలహం మామూలే కదా. పెద్దగా పట్టించుకోవాల్సిన కలహం కాదు... దంపతి కలహం అనే మాట ఉండనే ఉంది కదా’... ఇలాంటి మాటలు వింటుంటాం.
దంపతి అంటే భార్యాభర్తలు.కలహం అంటే తగాదా.
దాంపత్యంలో ప్రేమానురాగాలు ఎంత సహజమో, తగాదాలు కూడా అంతే సహజం. కొందరు దంపతులు తీవ్రంగా తగాదా పడతారు. ఆ తరువాత కాసేపటికే మామూలై పోయి నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. భార్యభర్తలు తగాదా పడుతున్నప్పుడు మధ్యలో వెళ్లినవారిని- ‘అది భార్యభర్తల తగాదా. ఇప్పుడే తిట్టుకుంటారు. ఇప్పుడే కలుసుంటారు. మధ్యలో నువ్వెళ్లడం దేనికి?’ అనే మాట కూడా వింటుంటాం.
భార్యభర్తల మధ్య తగాద అనేది తాటాకు మంటలాంటిదని, అది శాశ్వతమైన శత్రుత్వం కాదు అని చెప్పడానికే ‘దంపతి కలహం’ అనే మాట వాడతారు.
చీకటిని నెత్తినేసుకొని...
సూర్యుడింకా ఉదయించక ముందే, చాలా పొద్దున్నే బయటికి వెళ్లినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది.
‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీకటిని నెత్తినేసుకొని వెళ్లాడు’ అంటారు.
తెల్లవారుజామున చీకటి చీకటిగానే ఉంటుంది.
బయటికి వెళ్లేటప్పుడు తలకు రుమాలు కట్టుకొని వెళుతుంటారు. అలా చీకటిని తల మీద వేసుకొని బయటికి వెళుతున్నాడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
నాథుడు!
‘ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు’
‘నగరంలో ఎటు చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. పట్టించుకునే నాథుడే లేడు’లాంటి మాటలను తరచుగా వింటుంటాం.
నాథుడు అనే పదానికి ‘భర్త’ ‘రాజు’ అనే అర్థాలు ఉన్నాయి.
అయితే వ్యవహారికంలో మాత్రం వేరే అర్థాలు ఏర్పడ్డాయి.
‘ఆధారం’ ‘పెద్దదిక్కు’ ‘బాగోగులు చూసేవాడు’ మొదలైన అర్థాలతో ఇప్పుడు ‘నాథుడు’ను వాడుతున్నారు.
జాతీయాలు
Published Sat, Mar 12 2016 9:53 PM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM
Advertisement
Advertisement