సత్యం పలకడం అనేది సామాజిక ధర్మం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అబద్ధం ఆడడం తప్పేమీ కాదు.
కల్లలాడైనా సరే కాపురం నిలపాలి...
సత్యం పలకడం అనేది సామాజిక ధర్మం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అబద్ధం ఆడడం తప్పేమీ కాదు. దీనికి సంబంధించి మన పురాణాల్లో కొన్ని పిట్టకథలు కనిపిస్తాయి. పూర్వం ఒక సత్యవంతుడు దారిన పోతుంటే అతని ముందునుంచి ఎవరో ఒక వ్యక్తి పరుగెత్తుతూ ఒక సందులో దూరాడట. కొద్దిసేపటికి ఒక దొంగ అటుగా వచ్చి వచ్చి... ‘‘ ఇటు వైపు ఎవరైనా వచ్చారా?’’ అని అడిగాడట. ఎప్పుడూ అబద్ధం ఆడని సత్యవంతుడు అప్పుడు కూడా అబద్ధం ఆడలేదు. ‘‘అదిగో...ఆ సందులో దూరాడు’’ అని నిజం చెప్పాడు.
చనిపోయాక సత్యవంతుడు నరకానికి వెళ్లాడట. ‘‘ఇదేమిటి? నా జీవితంలో నేను ఒక్క అబద్ధమైనా ఆడలేదు. నన్ను నరకానికి తీసుకురావడం అన్యాయం. అసలు నేను చేసిన పాపం ఏమిటి?’’ అని అడిగాడట. అప్పుడు యమధర్మరాజు... ‘‘ఆరోజు నువ్వు చెప్పిన నిజం వల్ల ఒక అమాయకుడు దొంగ చేతిలో చనిపోయాడు. ఇది పాపం కాదా!’’ అన్నాడట.
భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే సంసారం సజావుగా సాగుతుంది. ఆ అన్యోన్యతకు అబద్ధమైనా సరే ఉపయోగపడితే అంతకంటే కావాల్సిందేముంది! ఆ విషయం చెప్పే సందర్భంలోనే కల్లలాడైనా సరే కాపురం నిలపాలి అన్న జాతీయాన్ని ఉపయోగిస్తారు.
సింగినాదం జీలకర్ర!
ఏంటి విశేషాలు అని అడిగితే కొందరు ‘ఆ ఏముంది! సింగినాదం జీలకర్ర’ అంటుంటారు. అంటే పెద్ద విషయమేమీ లేదని. పూర్వం జీలకర్ర వర్తకులు పడవల్లో జీలకర్ర వేసుకుని వెళ్లే వారు. ఏదైనా ఊరు సమీపించగానే ఒక కొమ్ము బూరతో శబ్దం చేసేవారు. ఆ బూరశబ్దాన్ని ‘శృంగనాదం’ అంటారు. శృంగం అంటే కొమ్ము.
నాదం అంటే ధ్వని. అయితే అది నోరు తిరక్క వాడుకలో సింగినాదం అయ్యింది. దాంతో బూర శబ్దం వినగానే కొందరు ‘సింగినాదం - జీలకర్ర’ అని అరిచేవారు. అవసరం లేనివాళ్లు మాత్రం ‘ఆ ఏముంది.. సింగినాదం జీలకర్ర’ అని కొట్టి పారేసేవారు. కాలక్రమేణా ముఖ్యం కాని విషయాల గురించి మాట్లాడేటప్పుడు ‘సింగినాదం - జీలకర్ర’ అనడం అలవాటుగా మారింది.
వనం విడిచిన కోతి!
వెనకటికి అడవిలో ఉండే ఒక కోతికి అడవి మీద ఆసక్తి పోయి, ఊళ్ల వెంట తిరగడం మొదలుపెట్టింది. ప్రతి ఊళ్లో దానికి ఇబ్బందులు, కష్టాలే. అడవిలో ఉన్నంత స్చేచ్ఛ, సుఖం, తన బంధుగణం లేక అల్లాడింది. అలాగే జీవనోపాధి కోసం సౌకర్యాలను, ఆత్మీయులను వదిలి దూర దేశాలకు పోయి కష్టపడేవాళ్ల గురించి చెప్పేటప్పుడు ‘వనం విడిచిన కోతి బతుకైంది తనది’ అంటుంటారు.
అంబాజీపేట ఆముదం!
ఒకప్పుడు దొంగలు ఒంటినిండా ఆముదం పూసుకొనిగాని డ్యూటీలోకి దిగేవారు కాదట. ఆముదం అంటుకుంటే ఓ పట్టాన వదలదు. కొన్ని గంటల వరకూ అలాగే ఉంటుంది. పొరపాటున ఎవరికైనా దొరికినా... వాళ్లు పట్టుకోబోతే జర్రున జారిపోతుంది. అందుకే ఆ ప్లాన్.
కొందరు మనుషులు కూడా అంతే. ఆముదంలాగా ఓ పట్టాన వదలరు. వాళ్లకి మనతో ఏదైనా పని ఉందంటే అది చేసి పెట్టేదాకా ఓ పట్టాన వదలరు. ‘ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా’ అంటూ వెంటపడి వేధిస్తూ ఉంటారు. ఇలాంటి వారి విషయంలో ‘‘అమ్మో అతనా? అంబాజీపేట అముదం. పట్టుకుంటే వదలడు’’ అంటుంటారు.