జాతీయాలు | Proverbs | Sakshi
Sakshi News home page

జాతీయాలు

Published Sat, Jun 25 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

Proverbs

కాలనేమి జపం
రామాయణం నుంచి పుట్టిన జాతీయం ఇది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ద్రోణగిరిపై ఉన్న ఒక మూలికను తేవడానికి సన్నద్ధుడవుతాడు ఆంజనేయుడు. ఈ విషయం రావణాసురుడికి తెలుస్తుంది. హనుమంతుడిని దారి తప్పించి మాయాసరస్సులో స్నానం చేసేలా చేయమని మారీచుడి కొడుకైన కాలనేమితో చెబుతాడు రావణాసురుడు. ద్రోణగిరిని వెదుకుతూ వెళుతున్న హనుమంతుడికి  దారిలో మహర్షి రూపంలో జపం చేస్తున్న కాలనేమి కనిపిస్తాడు.

ద్రోణగిరికి దారి చెప్పమని హనుమంతుడు అడిగినప్పుడు-
 ‘‘అక్కడ ఉన్న కొలనులో స్నానం చేస్తే కొత్త శక్తి వస్తుంది’’ అని తప్పుడు సమాచారం ఇస్తాడు. ఆ తరువాత ఏమైంది అనేది వేరే విషయంగానీ... దొంగ భక్తులను, చిత్తశుద్ధి లేకుండా పూజాపునస్కారాలు చేసేవాళ్లను, పవిత్రంగా కనిపిస్తూ ఇతరులను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించే వాళ్లను ‘కాలనేమి జపం’తో పోల్చుతారు.
 
చిదంబర రహస్యం!
పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన ఆలయం చిదంబరం. ఈ ఆలయంలో శివుడు నిరాకార స్వరూపుడిగా కొలవబడతాడు. గర్భగుడిలోని ఖాళీ స్థలాన్ని తెరతో కప్పిపెడతారు.  పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ఈ ఖాళీస్థలం ప్రతీక.
 
ఏమీ లేకపోయినా తెరను అలా ఎందుకు కప్పిపెడతారు? దీనికి ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు ఎన్ని ఉన్నా చాలామందికి ఇది ‘రహస్యం’గానే మిగిలిపోయింది. ఆ తెర వెనుక ఎన్నో కనిపిస్తాయనేది కొందరి నమ్మకం. కొందరికి బంగారు బిల్వ పత్రాలు కనిపిస్తే కొందరికి మరొకటి.  ఈ మర్మం ఎవరికీ అర్థం కానిది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏదైనా తెలియని రహస్యం లేదా తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని ‘చిదంబర రహస్యం’ అనడం పరిపాటిగా మారింది.
 
తంజావూరు సత్రం
‘రాను రాను ఈ ఇల్లు తంజావూరు సత్రంలా తయారైంది. పని చేసే వాళ్లు తక్కువ... పడి తినేవాళ్లు ఎక్కువ’ ఇలాంటి మాటలు వింటుంటాం. తమిళనాడులోని ప్రాచీన పట్టణం తంజావూరు. కావేరి నది తీరాన ఉన్న ఈ పట్టణం ఆలయాలకి ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చేవారు. ఆ రోజుల్లో... రాజులు ఆలయాలు కట్టించడమే కాదు... యాత్రికుల సౌకర్యం కోసం అన్నసత్రాలు కట్టించేవాళ్లు. ఈ అన్నసత్రాల వల్ల జరిగిన మంచి మాట ఎలా ఉన్నా... సోమరులకు ఇవి నిలయాలుగా ఉండేవి. ఈ సత్రాల వ్యవహారం ఒక ప్రహసనంలా తయారైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పుట్టిందే ‘తంజావూరు సత్రం’ జాతీయం.
 
ఒక ఇంట్లో ఒక్కరే కష్టపడుతూ, ఏ పనీ చేయకుండా సోమరిగా కాలం వెళ్లదీసే వాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంటిని తంజావూరు సత్రంతో పోల్చుతుంటారు.
 
శ్రావణ భాద్రపదాలు
కొందరు ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా ఉంటారు. వారికి సమస్యలు లేవని కాదు... ఉన్నా వారి సంతోషానికి అవేమీ అడ్డు కాదు.
 కొందరు మాత్రం ఎప్పుడు చూసినా ఏడుపు ముఖంతో కనిపిస్తారు. సమస్యలు ఉన్నా లేకున్నా  ఒకేవిధంగా ఉంటారు. ఏదో విషయంలో ఏదో ఒక అసంతృప్తి కనిపిస్తూనే ఉంటుంది. వారి కళ్లల్లో సంతోషం కాకుండా దుఃఖ వర్షమే ఎప్పుడూ కనిపిస్తుంటుంది.

దీన్ని దృష్టిలో పెట్టుకొనే ‘అతడి కళ్లు శ్రావణ భాద్రపదాల్లా ఉన్నాయి’ అంటారు. శ్రావణ భాద్రపదాలు తెలుగు నెలలు. ఇవి వర్షాకాలపు నెలలు. వర్షాన్ని గుర్తు చేసే నెలలు. కళ్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి అని చెప్పడానికి ఉపయోగించే జాతీయం ఇది.
 సంతోషాన్ని ఇష్టపడే వాళ్లు స్నేహితులైనట్లే,  ఎప్పుడూ విచారంతో కనిపించేవారు కూడా స్నేహితులవుతారు. ఇలాంటి జంటను ‘శ్రావణ భాద్రపదాలు’ అని పిలుస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement