దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బాంబే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)మరోమారు వార్తల్లో నిలిచింది. రామాయణంలోని కొన్ని అంశాల ఆధారంగా ఇక్కడి విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదంగా మారింది. రామాయణాన్ని అపహాస్యం చేసేవిధంగా విద్యార్థులు ఈ నాటకం వేశారంటూ పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి.
రామాయణం నాటకం పేరుతో బాంబే ఐఐటీ విద్యార్థులు సనాతన హిందూ సంప్రదాయాలను మంట గలిపారనే విమర్శలు వెల్లువెత్తాయి. రెండు నెలల క్రితం ఐఐటీ బాంబేలో ‘రాహోవన్’ పేరుతో విద్యార్థులు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఇది విమర్శలపాలైన నేపధ్యంలో తాజాగా ఆ విద్యార్థులపై ఐఐటీ బాంబే అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ నాటకంలో వివిధ పాత్రలు పోషించిన విద్యార్థులలో ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించారు. బాంబే ఐఐటీలో ప్రతియేటా ఆర్ట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. 2024 మార్చి 31న ఈ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకల్లో కొంత మంది విద్యార్థులు ‘రాహోవన్ ’ అనే నాటకాన్ని ప్రదర్శించారు.
రామాయణం ఇతివృత్తంగా ఈ నాటకాన్ని రూపొందించారు. అయితే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను వారు పోషించిన పాత్రలకు నేరుగా ఉపయోగించలేదు. అయితే రామాయణంలోని అరణ్య కాండంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలు వీరు ప్రదర్శించిన నాటకంలో ఉన్నాయి. అవి రామాయణాన్ని అపహాస్యం చేసేవిగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. వీరు వేసిన నాటకంలోని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment