
కూరలో పడి.. రంగు మారింది!
యునైటెడ్ కింగ్ డమ్ లో ఎక్కువగా కనిపించే సీ-గల్ పక్షి ప్రస్తుతం అక్కడ సెలబ్రిటీ అయిపోయింది. బాగా ఆకలితో నకనకలాడిందేమో! ఆహారం కనిపించగానే ముందు వెనుకా చూసుకోకుండా ఓ ఫ్యాక్టరీ దగ్గరలోని చెత్తకుండీలో పడేసి ఉన్న మసాలా చికెన్ టిక్కా కోసం వెళ్లింది. కుండీ లోపల ఉన్న ఆహారం అందుకోలేక బొక్కబోర్లా పడింది. అంతే, ఒక్కసారిగా తెల్లగా ఉన్న పక్షి ఆరెంజ్ రంగులోకి మారిపోయింది.
ఇది చూసిన అక్కడి ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు దానిని రక్షించారు. జంతు సంరక్షణ కేంద్రంలో అప్పజెప్పారు. దాని రంగు మారిపోవడాన్ని చూసిన ఓ నర్సు ముచ్చటపడి ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అంతే సోషల్ మీడియా ప్రపంచం ఒక్కసారిగా రంగు మారిన పక్షి అందానికి ముగ్ధులైపోయారు. లైక్ లు , కామెంట్లతో యూకేలో ఈ ఫోటో వైరల్ అయింది. ప్రస్తుతం సంరక్షణ కేంద్రంలోనే ఉన్న పక్షిని సిబ్బంది శుభ్రపరిచారు. దాని రంగయితే పోయింది కానీ, వాసన పోవడం లేదంటూ పోస్టులు పెట్టింది నర్సు.