ఆ హెలికాప్టర్‌ను కూల్చింది ఓ పక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కాట్రా ప్రాంతంలో సోమవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి ఓ పక్షి కారణమని తెలుస్తోంది. హెలికాప్టర్‌కు ఓ పక్షి తగలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఘటనా స్థలంలో పక్షి మృతదేహం లభించిందని, ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మలా సింగ్ తెలిపారు.
సింగిల్ ఇంజన్‌తో కూడిన ఈ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఒక్కసారిగా పక్షి తగలడంతో అది అదుపు తప్పి కూలిపోయిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా, ఏడుగురు మరణించారు. వారిలో ముగ్గురు ఢిల్లీకి చెందినవారు కాగా, ఇద్దరు జమ్మూకు చెందినవారని అధికారులు గుర్తించారు. ఈ విమానం హిమాలయన్ హెలీ సర్వీస్కు చెందినది. దైవదర్శనానికి వైష్ణోదేవి బయల్దేరిన తమ కుటుంబసభ్యులు మరణించడంపై వారి బంధువులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.