
పెద్ద పెద్ద యుద్ధాలు టీవీ డిబేట్‌లలోనే కాదు... మా ఇంట్లో కూడా జరుగుతుంటాయ్. ఉదాహరణకు టూ డేస్ బ్యాక్ నాకూ మా బుజ్జిగాడికీ మధ్య ఒక డిబేట్ మొదలయ్యింది. ‘‘పిట్టకు ఉండేది ముక్కా... నోరా? అప్పుడు పిట్టకు జలుబు చేస్తే అది తుడుచుకునేదేమిటి?’’ అని. ఆ కథ ఏమిటో తెలియాలంటే మీరీ కమామిషులో అడుగుపెట్టాల్సిందే.మా ఇంటి ముంగిట్లోకి తరచూ ఒక పిట్ట వస్తోంది. రోజూ వస్తుండటంతో మా బుజ్జిగాడు దానికి ధాన్యం గట్రా వేయడం మొదలుపెట్టాడు. వాకిలిలో వాలి అదీ ఇన్ని గింజలు హాయిగా తినేసి వెళ్తోంది. మావాడు గింజల్ని విసురుతున్నప్పుడు అదేమీ బెదరడం లేదు.
కాస్తంత వెనక్కు వెళ్లినట్టే వెళ్తోంది... గింజలు పడగానే ముందుకొచ్చి ముక్కుతో పొడిచి పొడిచి తింటోంది. గుప్పెట్లో గింజలు పట్టి చేయి విసురుతున్నా భయపడటం లేదు. దాని ధోరణి మావాణ్ణి ఇంకాస్త ఎంకరేజ్ చేసింది.మొన్నోరోజు పిట్ట రాగానే గింజలు వేయాలని చూశాడు. ఇంట్లో మామూలుగా బియ్యం, పప్పులే ఉన్నాయి తప్ప అది తినగల గింజలేమీ లేవు. అంటే పుట్నాలు, సజ్జలు, జొన్నల్లాంటివన్నమాట. కానీ మావాడి ఉత్సాహాన్ని కాదనలేక వాడికి కాసిన్ని వేరుశెనక్కాయలను ఇచ్చింది మా ఆవిడ. అవన్నీ మేం తినడం కోసం వేయించి పెట్టుకున్న పల్లీలు. సదరు డీప్ ఫ్రైడ్ పల్లీలను ఆ పిట్ట లొట్టలేసుకు తినడం చూసి మావాడు మరింత ఇన్‌స్పైర్ అయ్యాడు.
ఇంకొన్ని పల్లీలు పెట్టాడు. పిట్టకొంచెం మేత ఘనం అని ఆరోజే తెలిసింది. ఆరోజు చెట్నీ ముడిసరుకునంతా ఆ పిట్ట ఇట్టే స్వాహా చేసేసింది. అదలా గుప్పిళ్లకొద్దీ పల్లీలు లాగించేయడంతో ఆరోజు మా ఇంటిల్లిపాదీ ఇడ్లీల్ని కేవలం కారప్పొడితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకంతే... ఆరోజు నుంచి అదే ధోరణి. ‘‘తినే పిట్టదే గింజ. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా... పిట్టా తేరా గింజ రహేగా. వేయించిన వేరుశెనక్కాయలు మనుషులకేనా? ఇంకెంతకాలం ఈ వివక్ష? పిట్టా మనిషీ భాయ్ భాయ్. పిట్టల హక్కులు వర్ధిల్లాలి. మా నాన్న నైజం నశించాలి’’ అనే టైపులో ఉంది వాడి వ్యవహారం. దాంతో ‘ఎందుకైనా మంచిది’ పాలసీ కింద నేను సైలెంటైపోయాను.
నా ధోరణిని అలుసుగా తీసుకున్నాడు మావాడు. ‘‘పిట్ట ఎలాగూ వేయించిన వేరుశెనక్కాయలు ఇష్టంగా తింటోంది కదా. ఇక మనం దానికి ఫ్రిజ్జులోని ఐస్‌వాటర్ కూడా పోద్దాం నాన్నా. ఏమో... దానికి విపరీతంగా దాహం వేస్తోందేమో? నీళ్లు కూల్‌గా ఉంటే అదీ హ్యాపీగా తాగుతుంది’’ అన్నాడు. ‘‘ఒరేయ్ అది ఐస్‌వాటర్ తాగదురా. నేచురల్ వాటర్ తప్ప వేరేదేదీ దానికి ఇష్టం ఉండదు’’ అన్నాన్నేను. ‘‘ఎందుకుండదు. గత జన్మలో నువ్వేమన్నా పిట్టవా? అది వేయించిన పల్లీలు తినదన్నావు. కానీ తిన్నది కదా. ఇప్పుడు ఐస్‌వాటర్ తాగదంటున్నావ్. కానీ తాగుతుందేమో? అన్నీ నీకు తెలుసా? అసలు నీకేం తెలుసు? అయినా తన రెక్కల కష్టానికి తగినట్టుగా ప్రిజ్జువాటర్ రూపంలో దానికి ‘గిట్టుబాటునీరు’ దక్కితే నీకేంటి కష్టం’’ అంటూ నిలదీశాడు.
దాంతో నేను వాడిని కన్వీన్స్ చేయడానికి కాస్త వేరే దారి తొక్కాల్సి వచ్చింది. ‘‘ఒరేయ్ నాన్నా. మొన్న నువ్వు బోల్డంత ఐస్‌వాటర్ తాగేశావ్. అప్పుడేమైందీ? నీకు జలుబు చేసింది. నీకు గొంతు నొప్పి వచ్చింది. డాక్టర్ నీకు సిరప్పూ, మందులూ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఫ్రిజ్జువాటర్ తాగాక పిట్టకూ నీలాగే జలుబు చేసిందనుకో. పాపం దానికి మందులివ్వడానికి డాక్టరూ లేడు. ముక్కు తుడుచుకునే రుమాలివ్వడానికి తల్లీ లేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్‌తో గొంతులో ఖిచ్‌ఖిచ్ వస్తే దానికెవ్వడూ ఇంత విక్స్ ఇచ్చే దిక్కులేదు. అసలు ఇవన్నీ ఎందుకు?... కూల్‌నీళ్ల కారణంగా లోపల పేరుకుపోయేదాన్ని చీదడానికి... అసలు దానికి ముక్కే లేదు. అందుకే ఐస్‌వాటర్ వద్దురా‘‘ వివరంగా చెప్పిచూశాను.
‘‘ముక్కు లేదంటావేమిటి? అది గింజల్ని పొడుచుకునేది ముక్కుతోనే కదా. దాని మౌత్‌ను నేనెప్పుడో నోరు అంటే... నువ్వే కదా ఇంత పెద్ద క్లాసు తీసుకొని దాన్ని ముక్కు అనాలన్నావ్’’ నిలదీశాడు వాడు. ‘‘ముక్కులా ముందుకు పొడుచుకొచ్చింది కాబట్టి తెలుగులో దాన్ని మనం ముక్కు అంటాం గానీ వాస్తవంగా అది నోరు రా’’ ‘‘ఇప్పుడూ... పిట్టకు ముక్కే లేదన్నప్పుడు దానికి జలుబు ఎలా చేస్తుంది చెప్పు? అయినా... ఏమో నాన్నా... నాకు నువ్వూ అర్థం కావు... నీ భాషా అర్థం కాదు. పిట్టకు రెక్కలుంటాయి. నీకు ఉండవు. అయినా నీ చేతుల్ని నువ్వు రెక్కలంటావ్. రెక్కాడితేగానీ డొక్కాడదనీ, రెక్కల కష్టమనీ ఏదేదో మాట్లాడతావ్.
దానికి ఉండీ నీకు లేని వాటిని నీకున్నాయంటావ్. దానికి నోరున్నా సరే ఇగ్నోర్ చేసి, దాన్ని నువ్వు ముక్కంటావ్. దానిది టియ్యూ టియ్యూ భాష అనీ... మన తెలుగు దానికెలాగూ దానికి అర్థం కాదని... దాని బాడీ పార్ట్స్‌ను నీ ఇష్టం వచ్చినట్టు పిలుస్తావ్. అందుకే ఐ హేట్ యూ’’ అలిగాడు వాడు. వాడంటున్నదీ నిజమే కదా. ఇప్పుడనిపిస్తోంది నాకు... పిట్ట ముక్కును ముక్కు అని కాకుండా పేరు మార్చాల్సిన అవసరం ఉందని!! అలా మారిస్తే అది పిట్ట ముక్కు కాదూ... నోరు అని తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా... తెలుగుభాషలో మాటలు కొరవడి నోటికీ, ముక్కుకూ ఒకే మాట వాడతారనే అపప్రథ తప్పిపోవడంతో పాటు వాడి పిచ్చి లాజిక్కుల చిక్కులూ తప్పిపోతాయని!!
– యాసీన్
Comments
Please login to add a commentAdd a comment