ఈ వార్త చదివాక ‘అరే ఈ పక్షికున్న పాటి అదృష్టం మనకు లేకుండా పోయిందే’ అనుకుంటారు. ఎందుకంటే మనలో చాలా మందికి విమానంలో ప్రయాణించడం ఓ కల. అది బిజినేస్ క్లాస్ ప్రయాణం అంటే అబ్బో ఇంకేముంది. ఎందుకంటే బిజినేస్ క్లాస్ టూర్ అంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. కానీ ఈ పక్షి మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బిజినేస్ క్లాస్‌లో దర్జాగా సింగపూర్ నుంచి లండన్ ప్రయాణించింది. ప్రస్తుతం ఈ పక్షి బిజినెస్ క్లాస్ టూర్ నెట్టింట్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. సామాన్య వ్యక్తికి దక్కని అదృష్టం పక్షికి దక్కిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
వివరాలు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సింగపూర్ నుంచి లండన్ బయలుదేరింది. అయితే ఎలా జరిగిందో తెలీదు కానీ విమానంలోని బిజినెస్ క్లాస్‌లోని ఓ సీటుపై పక్షి ప్రత్యక్షమైంది. అలా అది దాదాపు 12 గంటలపాటు విమానంలో ప్రయాణించి లండన్ చేరుకుంది. పక్షి ప్రయాణాన్ని కొందరు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
దాంతో సిబ్బంది ఈ సంఘటన గురించి వివరణ ఇచ్చింది. జనవరి 7న విమానంలో ఈ పక్షి కనిపించిందని పేర్కొంది. ‘ప్రయాణీకులు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది పక్షిని పట్టుకున్నారు’ అని తెలిపింది. పాపం పక్షిని పట్టుకోవడానికి సిబ్బంది చాలా కష్టపడ్డట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎలా అయితేనేం చివరకూ ఆ పక్షిని పట్టుకున్న సిబ్బంది తర్వాత దాన్ని లండన్‌లోని జంతు సంరక్షణ అధికారులకు అప్పంగిచారు.
‘వావ్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను ఎంచుకోవాలని పక్షికి కూడా తెలుసు’, ‘ఈ పక్షికి ఏ క్లాస్‌లో ప్రయాణించాలో బాగా తెలిసినట్లు ఉంది’, ‘ఈ పక్షి ఇమిగ్రేషన్‌ను ఎలా క్లియర్ చేసుకుందో?.. ఆశ్చర్యంగా ఉంది’, ‘పక్షుల్ని ఎలా పట్టుకోవాలి అనే విషయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment