దట్టమైన అడవులు, కొండలు, బోలెడన్ని పక్షులు , మంచి నీటి సరస్సులు, అద్భుతమైన పగడపు దీవులతో నాగరికతకు దూరంగా ఒక దీవి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.ఆ దీవిలో ఒక విషపూరితం కాని పాము కూడా ఉందనుకోండి. అలాంటి ఒక దీవిని చూడాలని నేను ఎన్నో ఏళ్లగా అనుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఒక రోజు నా కల నిజమైంది.
అండమాన్ సముద్రములో 48 అడుగుల పడవపై నేను, మరో తొమ్మిది స్నేహితులు కలిసి నార్కోండం అనే ఒక నిద్రాణ అగ్నిపర్వతపు దీవిని పరిశీలించడం కోసం వెళ్ళాము.
ఈ దీవిపై అతి కొద్దిమంది మాత్రమే కాలుమోపారు. ఆలా వెళ్లిన వారిలో నార్కోండం హార్నబిల్ అనే అరుదైన పక్షిని చూడటానికి వెళ్లిన పక్షి ప్రేమికులే ఎక్కువ. నార్కోండం హార్నబిల్ పక్షులు కేవలం 7 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణము కలిగిన ఈ నార్కోండం దీవిపై తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కాకపోతే ఈ మధ్య కాలంలో సింగపూర్లోని పక్షులని అధ్యయనం చేసి ఒక సంస్థ ఈ జాతి ఆడ పక్షిని అక్కడ చూసినట్టు చెప్పారు. బహుశా ఎవరో కొన్నింటిని అక్రమంగా రవాణా చేసినట్టున్నారు.
మా పడవ దీవి దక్షిణ అంచుని దాటి ఈశాన్య అంచున ఉన్న పోలీస్ పోస్ట్ అనే లంగరు వేసే చోటుకి చేరుకుంటూండగానే మాకు నార్కోండం హార్నబిల్ పక్షులు ఎగురుతూ కనిపించాయి. మా పడవ నుంచి చూస్తే 710 మీటర్ల ఎతైన ఆ అగ్నిపర్వతము ఆంతా దట్టమైన అడవితో నిండి ఉంది.
ఈ దీవి భారత భూభాగ పరిధిలోకి వస్తుంది, అందుకే ఇక్కడ ఇండియన్ రిజర్వు బటాలిన్ వారి పారా మిలిటరీ పోలిసుల పోస్టు ఉంటుంది. ఒకప్పుడు ఏపుగా ఉండే బర్మా జీలుగ చెట్ల స్థానంలో ఇప్పుడు అక్కడ కొబ్బరి , అరటి , వక్క వంటి మనుషులకు ఉపయోగ పడే చెట్లు కనిపిస్తున్నాయి. ఆ దట్టమైన అడవిలో అనేక మేకలు మొక్కలను తింటూ హార్నబిల్ పక్షుల మనుగడకు ముప్పుగా తయారయ్యాయని ఒక కధనం విన్నాను.
ఈ మేకలు ఆ దీవిపై సహజంగా కనిపించే ప్రాణులు కావు. ఈ మేకల వెనుక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. 15 నుంచి 17వ శతాబ్దం మధ్యలో ఐరోపా నుండి అన్వేషక నావికులు ప్రపంచమంతా నౌకలలో ప్రయాణించే వారు. ఆ ప్రయాణంలో సుదూర ప్రాంతాల్లో ఉండే చిన్న దీవులు కనిపించినప్పుడు ఆ దీవుల్లో కొన్ని మేకలు, పందులు, కోళ్లు, కుందేళ్లు మరియు తాబేళ్లను వదిలి వెళ్లేవారు. ఆ దారిన వెళ్లే ఇతర నౌకలకు లేక దురదృష్టవశాత్తు పడవ మునిగిపోతే బ్రతికి బయటపడి దీవికి చేరుకున్నవారికి ఆహారముగా ఇవి ఉపయోగపడతాయని వారి ఉద్దేశం.
1899 లో ఏ. ఓ. హ్యూమ్ ఒక కధనంలో ఈ దీవిపై పందులు, మేకలు, కోళ్లను వదిలిపెట్టారు అని వ్రాసారు. కానీ మొదటిసారిగా ఎప్పుడు వాటిని అక్కడ వదిలారో ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఆ కాలంలో వదిలిన వాటిని సముద్రపు దొంగలు లేక నావికులు ఆహారంగా తినేశారో లేక ఆ జంతువులే చనిపోయావో తెలియదు.
అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇలా యాదృచ్ఛికంగా దీవులలో వదిలిన జంతువుల ఆ దీవులలోని జీవ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వ అధికారులు నిర్మూలిస్తుండంగా, 1976 లో మన దేశ పోలీసులు రెండు జతల మేకలను ఈ దీవిపై పనిచేసే పోలీసుల ఆహారంకోసం ఉపయోగపడతాయని తీసుకువచ్చారు. ప్రతీరోజు మేక మాంసం తిని విసుగెత్తిపోయారో లేక తోటలను పెంచినట్టు ఆ దీవిలో మేకల పెంపకం పెద్ద వ్యాపారమే అయ్యిందో లేక మేకలు మిగతా దీవులలో వలె మేకలు నియంత్రణ లేకుండా చేయదాటిపోయాయో తెలియదు కానీ 1998 నాటికి ఆ దీవిపై దాదాపు 400 మేకలు చక్కగా భయంలేకుండా బ్రతుకుతూ కనిపించాయట!
1990 దశాబ్దం మొదట్లో పక్షులను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఈ దీవిపై నుండి ఈ మేకలను నిర్మూలించాలని అడగడం మొదలుపెట్టారు. సాధారణంగా అగ్నిపర్వతం పరిసరాలు చిన్న రాళ్లతో నిండి ఉంటుంది. ఈ పర్వతంపై పెరుగుతున్న చెట్ల వేళ్ళు ఆ రాళ్లను ఒడిసి పట్టి ఉంచడం వలనే ఆ దీవిని ఒక్కటిగా ఉంచడం సాధ్యపడిందని కొందరు వాదిస్తారు. ముఖ్యంగా అత్తి జాతి చెట్లు ఈ రకంగా తమ వేళ్ళతో రాళ్ళని ఒడిసిపడతాయి. హార్నబిల్ పక్షుల ఆ చెట్ల పళ్ళను తమ పిల్లలకు ఆహారంగా ఉపయోగిస్తాయి. అయితే ఈ దీవిపై అపరిమితంగా పెరిగిపోయిన మేకలు, మొలకెత్తుతున్న అత్తి జాతి మొక్కలను తినడం మూలంగా, కొత్త చెట్లు పెరగడానికి అవకాశం లేక ఆ హార్నబిల్ పక్షుల ఆహారానికి ఇబ్బంది కలిగి తద్వారా వాటి మనుగడ ప్రమాదంలో పడింది. చివరికి మేకలు ఆ దీవికి ప్రమాదకారులుగా మారాయి.
మేము ఈ దీవి చేరుకున్నాక, మూడు రోజులపాటు మేకల అడుగుల గుర్తుల కోసం, అవి తిని విసర్జించిన గుర్తుల కోసం, వాటి ఉనికిని తెలిపే ఏదైనా ఆధారాల కోసం దాదాపు ఆ దీవి మూడు వంతులు నడిచి పరిశీలించాము. ఆశ్చర్యంగా మాకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బహుశా అధికారులు పక్షి శాస్త్రవేత్తలు అడిగినట్లే ఎంతో కష్టపడి వారి కోరిక తీర్చినట్టు ఉన్నారు. అయితే ఇక్కడ నివసిస్తున్న పోలీస్ మాత్రం, అంతకు ముందరి వారమే రెండు మేకలు కొండపైకి పరిగెడుతూ పారిపోవడం చూశామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ దీవిపైనా ఆ మేకల ప్రభావం తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.
రచయిత్రి: జానకి లెనిన్
ఫోటోలు- రోహిత్ నానీవాడేకర్
Comments
Please login to add a commentAdd a comment