సిడ్నీ: పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్‌విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది.
ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్‌విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్‌లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్‌గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్‌లోని పుకొరోకొరో మిరండా షోర్‌బర్డ్ సెంటర్ ప్రకటించింది.
నీటిపై వాలితే మృత్యువాతే
గాడ్‌విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్‌డబ్ల్యూ అనే గాడ్‌విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్‌గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది.
ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు. గాట్‌విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్‌విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్‌విట్, హడ్సోనియన్ గాడ్‌విట్, మార్బ్‌ల్డ్ గాడ్‌విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి.
Comments
Please login to add a commentAdd a comment