Honey Buzzard Is Species Of Bird That Lives By Eating Honey, Interesting Facts - Sakshi
Sakshi News home page

Honey Buzzard Facts: వెరీ ఇంట్రెస్టింగ్‌.. తేనెను మాత్రమే తిని జీవించే పక్షి.. ప్రత్యేకతలివే..

Published Thu, Feb 2 2023 6:52 PM | Last Updated on Fri, Feb 3 2023 6:50 AM

Honey Buzzard Is Species Of Bird That Lives By Eating Honey - Sakshi

పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): విమాన వేగంతో ఆకాశంలో నిరంతరం సంచరిస్తూ నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతులకు మకుటం లేని మహారాజులు ఈ గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై నిరంతర నిఘాతో ఆకాశం నుండే ఆహారాన్ని గుర్తించి, క్షణంలోనే దానిపై వాలి సేకరించటం ఈ పక్షుల ప్రత్యేకత. గద్ద జాతిలో అరుదైన గద్ద హనీ బజార్డ్‌. తేనెను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించే ఇటువంటి ప్రత్యేక ఆహారపు అలవాట్లు కలిగిన హనీ బజార్డ్‌ గద్దపై ప్రత్యేక కథనం..  

అభయారణ్యంలోని క్రిమి కీటకాలు, వన్యప్రాణుల కళేబరాలు, పెరుగుతున్న పాముల సంతతి తదితర వాటిని నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతున్న గద్దలు ప్రకృతిలో ఎంతో ముఖ్యమైనవి. నల్లమల అభయారణ్యంలో నైతిక ధైర్యంతో మిగతా జీవులకు ఆదర్శంగా నిలిచే గద్దల జీవనశైలి ఎంతో ముఖ్యమైనది. నల్లమలలో  క్రెస్టడ్‌ సర్పెంటీగల్, షార్ట్‌టౌడ్‌ స్నేక్‌ ఈగల్, క్రెస్టడ్‌హార్డ్‌ ఈగల్, బోనెల్లీస్‌ ఈగల్, శిఖర, బ్లాక్‌ షోల్డర్‌ కైట్, బ్లాక్‌ ఈగల్‌ లాంటి గద్ద జాతులు సంచరిస్తుంటాయి.

పర్యావరణాన్ని సంరక్షించే గద్ద జాతులు:  
నల్లమల అభయారణ్యంలో ఎన్నో రకాల వన్యప్రాణులతో పాటు, ఆకాశంలో సంచరించే పక్షి జాతులు కూడా ఎక్కువే. పక్షి సంతతిలో అత్యంత ముఖ్యమైనవిగా ప్రాచుర్యం పొందిన గద్దలు ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించి వాతావరణాన్ని సమతుల్యంగా ఉండేందుకు దోహద పడుతున్నాయి. ప్రకృతిలో ఎక్కువవుతున్న పాములు, క్రిమి కీటకాలు, మిడతలు, కుందేళ్లు తదితర వాటిని ఆహారంగా తీసుకోవటంతో పాటు నల్లమలలో జంతువులు వేటాడిన మృతకళేబరాలను భక్షిస్తూ ఎప్పటికప్పుడు నల్లమలను స్వచ్ఛంగా ఉంచేందుకు దోహద పడుతున్నాయి.

సహజంగా మాంసాహార జాతులైన గద్దలు కొనతేలిన ముక్కు, పొడవైన రెక్కలతో, ఎంత బరువున్న ఆహారాన్నైనా సునాయాసంగా తీసుకెళ్లే నైపుణ్యం కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా క్రిస్టడ్‌ సర్పెంటీగల్, షార్ట్‌టౌడ్‌ స్నేక్‌ ఈగల్‌లు దట్టమైన అభయారణ్యంలోని గడ్డి మైదానాలను, ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పాములను గుర్తించి వాటిని గురి చూసి వేటాడటం వీటి ప్రత్యేకత.  క్రెస్టడ్‌హార్డ్‌ ఈగల్, బోనెల్లీస్‌ ఈగల్‌లు అభయారణ్యంలోని కుందేళ్లను ఎక్కువగా వేటాడి చంపుతుంది.

ఒక్కో సారి గొర్రెలు, మేకల పిల్లలనుసైతం అవలీలగా ముక్కున కరుచుకుని పోయేటంత బలం వీటికి ఉంటుంది. శిఖర, బ్లాక్‌ షోల్డర్‌ కైట్, బ్లాక్‌ ఈగల్‌ తదితర రకాల గద్దలు మాత్రం మిడతలు, తొండలు, కీటకాలను ఆహారంగా తీసుకుని జీవనాన్ని కొనసాగిస్తాయి. నల్లమలలో సంచరించే గద్దలపై శ్రీశైలం ప్రాజెక్టు బయోడైవర్సిటీలో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి.

నైతిక ధైర్యానికి నిదర్శనం:                                                       
సహజంగా 70 ఏళ్ల పాటు జీవించే గద్దలకు 40 ఏళ్లు వచ్చే సరికి ఎన్నో జీవన్మరణ సమస్యలు ఎదురవుతాయి. ఆ సమయంలోనే అవి ఎంతో మానసిక స్దైర్యంతో తమ సమస్యను ఎదుర్కొని పునర్జన్మ ఎత్తి మరో ముప్పై ఏళ్ల పాటు జీవిస్తాయి. సాధారణంగా పొడవుగా, వాడిగా, పదునుగా ఉండే దాని ముక్కు నిరంతర రాపిడి వల్ల అరిగిపోతుంది. వాడిగా, పొడువుగా ఉండి సులభంగా ఒంగి ఆహారాన్ని తీసుకు పోయేందుకు ఉపకరించే కాలిగోళ్లు సైతం తమ సామరాధ్యన్ని కోల్పోతాయి. దీంతో పాటు పెరిగిన వయసు వల్ల బరువైన రెక్కలు, దట్టమైన ఈకలు దాని గుండెకు హత్తుకు పోయి ఎగరటంలో కష్టాన్ని కలిగిస్తాయి.

దీంతో నిర్వీర్యమైన పరిస్థితిలో ఉన్న గద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని శరీర పునర్నిర్మాణాన్ని చేపడతాయి. ఆ క్రమంలో అవి ఎత్తైన పర్వతాల మీదకు చేరుకుని అక్కడ కొండ రాళ్లకు తన ముక్కును ఢీకొడుతూ దాన్ని రాల్చి కొత్త ముక్కు వచ్చేంత వరకు వేచి ఉంటాయి. కొత్త ముక్కు రాగానే దాని సహాయంతో దాని పాత రెక్కలను పీకేసి కొత్త రెక్కలు వచ్చే వరకు వేచి ఉంటాయి. ఇలా ఐదు నెలల పాటు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని నైతిక ధైర్యంతో దాని జీవిత కాలాన్ని మరో 30 ఏళ్లు వరకు పొడిగించుకుంటాయి.

తేనె మాత్రమే తినే హనీ బజార్డ్‌
నల్లమల అభయారణ్యంలో మిగతా గద్దలకు విభిన్నంగా తేనెను మాత్రమే సేవించి తమ జీవనాన్ని గడిపే గద్దలు ఉన్నాయంటే ఎవరికైనా ఆశ్చర్యమనిపిస్తుంది. అలా జీవించే గద్దలే హనీ బజార్డ్‌. వీటి జీవనశైలి ఎంతో విచిత్రమైంది. ఇవి  నల్లమల అభయారణ్యం యావత్తూ ఆకాశంలో సంచరిస్తుంటాయి.  వీటి ప్రయాణంలో ఎక్కడైనా తేనె తుట్టెలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అవి అక్కడ వాలి తేనెను సేకరిస్తుంటాయి. ఈ క్రమంలో అవి వాటి భారీ రెక్కలను విసురుతూ తేనెటీగలను తరిమి వేస్తాయి. ఆకాశం గుండా  సంచరిస్తూ  ఎంత దూరంలోని తేనె తుట్టలనైనా గుర్తించటం హనీ బజార్డ్‌ల ప్రత్యేకత. ఇవి తేనె తప్ప మిగతా ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడవు.
చదవండి: ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్‌లో..

ఆ గద్దకు తేనే ఆహారం
హనీ బజార్డ్‌లు తేనెను మాత్రమే తాగి జీవించే గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై సంచరిస్తూ ఎక్కడ తేనె నిల్వలు ఉన్నా అక్కడ వాలి తేనెను సేకరించటం వీటి ప్రత్యేకత. కొన్ని గద్ద జాతులు పాములు, సరీసృపాలు, కీటకాలను భక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంటాయి. గద్దలు నైతిక ధైర్యానికి ప్రతీకలు. ఇవి జీవితంలో కఠినమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తాయి.   
షేక్‌ మహమ్మద్‌ హయాత్, ఫారెస్టు రేంజి అధికారి, శ్రీశైలం బయోడైవర్సిటీ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement