Elon Musk to auction off Twitter bird logo and other memorabilia - Sakshi
Sakshi News home page

Twitter Bird: ట్విటర్‌ పిట్టను కొంటారా? అమ్మకానికి పెట్టిన మస్క్‌

Published Thu, Aug 10 2023 6:02 PM | Last Updated on Thu, Aug 10 2023 7:10 PM

Elon Musk to auction Twitter bird logo and other memorabilia - Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్‌ (ట్విటర్‌)ను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతున్నాడు దాని అధినేత ఎలాన్‌ మస్క్‌. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్‌ లోగోతోపాటు పేరునూ మార్చేసిన సంగతి తెలిసిందే. లోగోలో ఉన్న పిట్ట స్థానంలోకి ఇంగ్లిస్‌ అక్షరం ‘ఎక్స్‌’ వచ్చేసింది. 

తాజాగా ట్విటర్‌లోని పాత విలువైన జ్ఞాపకాలను మస్క్‌ వేలానికి పెట్టనున్నారు. వీటిలో ట్విటర్‌ ప్రధాన కార్యాలయంపై పిట్ట బొమ్మతో ఉన్న సైన్‌బోర్డ్‌ కూడా  ఉండనుంది. ట్విటర్‌ను ఎక్స్ పేరిట రీబ్రాండ్‌ చేసిన కొన్ని రోజుల్లోనే మస్క్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం 584 లాట్లను వేలానికి తీసుకురానుండగా వీటిలో ట్విటర్ బర్డ్ కాఫీ టేబుల్, భారీ పంజరం, స్టూళ్లు, టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉపకరణాలు, సంగీత పరికరాలు, నియాన్ ట్విటర్ లోగో, హ్యాష్‌ట్యాగ్ గుర్తు వంటివి ఉన్నాయి. కాగా ఈ వేలానికి ‘ట్విటర్‌ రీబ్రాండింగ్‌ : ఆన్‌లైన్‌ ఆక్షన్‌ ఫీచరింగ్‌ మెమోరాబిలియా, ఆర్ట్‌, ఆఫీస్‌ అసెట్స్‌ అండ్‌ మోర్‌’ అని పేరుపెట్టారు.

ఉపకరణాలు, వస్తువులతోపాటు ప్రముఖుల నుంచి వైరల్ అయిన వారి ఆయిల్ పెయింటింగ్‌లు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఈ కళాకృతులలో చిరస్మరణీయమైన 2014 ఆస్కార్స్ ఎల్లెన్ డిజెనెరెస్ సెల్, సెలబ్రిటీ ట్రిబ్యూట్ ట్వీట్‌ల ఆకర్షణీయమైన ఫోటో మొజాయిక్ ఉన్నాయి. 2012 నవంబర్‌లో తిరిగి ఎన్నికైన తర్వాత అప్పటి అమెరికన్‌ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన ట్వీట్‌కు సంబంధించిన చిత్రం కూడా ఇందులో ఉంది. ఈ ప్రత్యేక ట్వీట్ అప్పట్లో అత్యధిక లైక​్‌లు పొందిన ట్వీట్‌గా గుర్తింపు పొందింది.

ఇదీ చదవండి: ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్‌ బంపరాఫర్‌

వేలం నిర్వహించే హెరిటేజ్ గ్లోబల్ పార్ట్‌నర్స్ ప్రకారం, ప్రతి లాట్‌కు ప్రారంభ బిడ్ 25 డాలర్లు. కొనుగోలుదారుల ప్రీమియం 19 శాతం, అమ్మకపు పన్ను 8.63 శాతం ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన బిడ్డింగ్ సెప్టెంబర్ 12న ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ట్విటర్‌ బర్డ్‌ లోగో శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్ట్రీట్‌-10లో ఉన్న ట్విటర్‌ ప్రధాన కార్యాలయ భవనానికి ఇంకా అలాగే ఉంది. దీనిని గతంలో తొలగించాలని ప్రయత్నించినా.. శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు అడ్డుకొన్నారు. దీంతో ట్విటర్‌ హెడ్‌క్వార్టర్స్‌పై ఉన్న పిట్ట బొమ్మను వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తే అధికారుల అనుమతి పొంది తరలించుకోవాలని వేలం వివరాల్లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement