అచ్చంగా..కలివికోడిలా...!
పులివెందుల టౌన్: వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల పట్టణ శివారులో అరుదైన కలివి కోడిని పోలిన పక్షి లభ్యమైంది. పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ నాయకులు అంబకపల్లె నారాయణస్వామి, రాజులు శుక్రవారం కనంపల్లె గ్రామ సమీపంలో ఉన్న తమ పొలానికి వె ళ్లగా అక్కడ ఓ వైపు సరిగా నిలబడలేని పక్షి కనిపించింది. ఇది కలివి కోడిలా ఉందని భావించి వెంట తీసుకొచ్చారు. శనివారం స్థానిక అటవీ శాఖ అధికారి రజనీ కుమార్‌కు అందజేశారు. కలివి కోడి చాలా అరుదైన పక్షి అని, దీని మనుగడ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, ఇది కలివికోడి అవునో.. కాదో నిర్ధారణ కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని రజనీ కుమార్ తెలిపారు.
మూడు దశాబ్దాలుగా గాలింపు
కలివికోడి గురించి ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా జాడ తెలియడం లేదు. మూడు దశాబ్దాలుగా గాలింపు సాగుతోంది. ప్రత్యక్షంగా ఇవి కనిపించకుండా పోయాయి. బాంబే న్యాచురల్ సొసైటీ, అటవీ శాఖ అధికారులు ఈ పక్షిపై సర్వే కొనసాగిస్తున్నారు. 1948లో తొలిసారిగా కడప- నెల్లూరు సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఒకసారి కనిపించాయి. 1986లో వైఎస్‌ఆర్ జిల్లా అట్లూరు ప్రాంతంలో, 2008లో బద్వేలు అటవీ ప్రాంతంలో కనిపించడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ జాతి పక్షి అంతరించి పోకుండా ఇప్పటి వరకు రూ. 28 కోట్లు ఖర్చు చేసింది.