Kalivi kodi
-
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి.. లంకమలలో కలివి కోడి జాడేది?
వైఎస్సార్ జిల్లాలో ఓ వైపు శేషాచలం.. మరోవైపు నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అదే జిల్లాలోని సిద్ధవటం–బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ పక్షి ‘ట్విక్–టూ.. ట్విక్–టూ’ అని అరుస్తోంది. ఎంత అన్వేషించినా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ నిశాచర పక్షిని ‘కలివి కోడి’ అని పిలుస్తున్నారు. ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని ప్రపంచం పక్షిశాస్త్ర నిపుణులు తేల్చేయగా.. ఇప్పటికీ సిద్ధవటం అటవీ ప్రాంతంలోని పొదల్లో ఇవి సజీవంగా ఉన్నాయని ఎస్వీ యూనివర్సిటీ బృందం చెబుతోంది. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కలివి కోడి జాడను కనిపెట్టవచ్చంటోంది. కలివికోడి ఆవాసం కోసం సిద్ధవటం ప్రాంతంలో సుమారు 3 వేల ఎకరాలను రూ.28 కోట్లతో సేకరించి 177 కెమెరాలతో పరిశోధకులు అన్వేషిస్తున్నారు. సాక్షి, అమరావతి: ‘కలివి కోడి’.. నిజానికి ఇది కోడి కాదు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. రంగు రంగుల ఈకలు.. చిన్నపాటి ఆకారం.. వినసొంపైన కూతలతో ఆకట్టుకునే కలివి కోడి (జర్డాన్స్ కోర్సర్) సంక్షోభంలో పడింది. అత్యంత అరుదైన ఈ పక్షి అంతరించిపోతున్న జాతుల్లో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలోని లంకమల అడవుల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా కలివి కోడి కనిపించదు. ఇది వందేళ్ల క్రితమే అంతరించిపోయిందని ప్రపంచ పక్షి శాస్త్రవేత్తలు భావించినా.. లంకమల అడవుల్లో ఇంకా సంచరిస్తూనే ఉందని అడపాదడపా వార్తలు వెలువడుతున్నాయి. వైఎస్సార్ జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో ఆ ప్రాంతాన్ని లంకమల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్లపాటు శోధించినా.. కలివి కోళ్ల ఆచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్లు ఖర్చు చేసి రెండేళ్లపాటు అలుపెరగని ప్రయత్నాలు జరిపినా ఫలితం కనిపించలేదని ఎస్వీ వర్సిటీ జువాలజీ విభాగానికి చెందిన మాణిక్యం తెలిపారు. అన్నీ కాలాలు, అన్ని ప్రాంతాల్లో శోధించి, పరిశోధనలు చేస్తే తప్ప కలివి కోడి పూర్తిగా అంతరించిందని చెప్పలేమంటున్నారు. లంకమల అభయారణ్యంలోని వీటి ఆవాసాలను పోలిన ఆవాసాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని సమగ్ర సర్వే చేస్తే ఈ పక్షి జాతిని గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పక్షి కోసం అన్వేషణను కొనసాగించి.. వీటిని పరిరక్షించడం అందరి బాధ్యతని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం కడపటి చూపు కలివి కోడిని 1848లో పెన్నా నది పరీవాహక ప్రాంతంలో థామస్ జర్డాన్స్ మొదటిసారి కనుగొన్నారు. 1985 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్నకు ఈ పక్షి కనిపించగా.. దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలిసి ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వెంటనే వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం పరిశోధకులు ప్రొఫెసర్ నందకుమార్, అమీర్‌బాషా, మారం రాజశేఖర్ బృందం దాదాపు 8 పక్షులను గుర్తించింది. వీటి ఆవాసాన్ని రిమోట్ సెన్సింగ్ విధానంలో పరిశీలించి ఏ పరిసరాల్లో ఎక్కువగా ఉంటాయి, వాటి అభివృద్ధికి అక్కడ చేయాల్సిన మార్పులు ఏమిటనేది ఆ బృందం సూచించింది. ఆ తర్వాత 2002లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, రాయల్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ సహకారంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కలివి కోడి పాద ముద్రను, కూతను నమోదు చేసింది. ఈ పక్షి ‘ట్విక్–టూ.. ట్విక్–టూ’ అంటూ అరుస్తుంది. పగలు నిద్రించి.. రాత్రి వేటాడుతుంది వీటి జాడ 2002 తర్వాత కనిపించలేదు. ఈ పక్షుల సమగ్ర గణన సైతం జరగలేదు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో వీటి ఆవాసాల్లో గత రెండు దశాబ్దాలుగా వచ్చిన మార్పులను గమనిస్తే.. అరుదైన ఈ పక్షి జాతి ఉనికిని తెలుసుకునే అవకాశం ఉంటుందని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్ ఎం.రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ పక్షి ముదురు గోధుమ రంగులో.. పొడవాటి కాళ్లతో ఉంటుంది. మెడలో రెండు వెండి గొలుసుల వంటి చారలతో ఉంటుంది. ఇతర పక్షుల్లా ఎత్తుకు ఎగరలేవు. పగటిపూట నిద్రపోతూ.. రాత్రి పూట ఆహార సేకరణ కోసం బయటకు వస్తాయి. 2 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు కలివి పొదలు (ముళ్లతో ఉండేవి) వీటి ఆవాసాలు. పొదల మాటున దాగి ఉంటూ వాటి మధ్యలోని ఖాళీ ప్రదేశాల నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. చెదలు, పురుగులు, చీమలు, కీటకాలను తింటూ పంట పొలాలకు వ్యాధుల రాకుండా సంరక్షించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఇవి దోహదపడతాయి. ఇవి గులక రాళ్లను సేకరించి.. వాటి మధ్యలో గుడ్లు పెట్టి ఇతర జంతువులు గుర్తించకుండా జాగ్రత్తపడతాయి. -
అరుదైన పక్షి ‘కలివికోడి’
కడప కల్చరల్: ‘కలివి కోడి’.. పిల్లలూ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. నిజానికి ఇది కోడి కాదు కానీ అరుదైన పక్షి. ప్రపంచంలో ఈ పక్షి అంతరించిపోయిందని అందరూ భావించారు. కానీ ఆ మధ్య మన జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో ఈ పక్షి కనిపించింది. మన జిల్లాకు మరో ప్రత్యేకతను చేకూర్చి పెట్టింది. మరీ ఆ విషయాలు తెలుసుకుందామా! మన జిల్లాలో అటు శేషాచలం.. ఇటు నల్లమల అడవులు ఉన్నాయి. జిల్లాలోని సిద్దవటం, బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పేర్కొంటారు. ఈ అడవిలో ఎన్నోజాతుల పక్షులు, జంతువులు ఉన్నాయి. ఈ అడవిలోనే కలివికోడి కనిపించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరిగే కలివి పొదల్లో ఉండడంతో దీన్ని కలివి కోడి అంటున్నారు. 1948 నాటికే ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షిశాస్త్ర నిపుణులు సైతం నిర్ణయించారు. 1985 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్నకు ఈ పక్షి కనిపించగా, దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. వారు దాన్ని కలివికోడిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వెంటనే వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. దురదృష్టవశాత్తు ఆ పక్షి ఆయన చేతిలోనే మరణించింది. అప్పటి నుంచి మళ్లీ ఆ పక్షి కనిపిస్తుందేమోనని నేటివరకు వెతుకుతూనే ఉన్నారు. లంకమల అడవుల్లో పలుచోట్ల ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని వివరాలు కలివికోడికి ‘జోర్డాన్ కొర్సర్’ అని శాస్త్రీయమైన పేరుంది. ఇది పెద్ద సైజు కంజు పక్షిలా పొడవాటి కళ్లతో ఉంటుంది. ముదురు గోధుమరంగు ఈకలతో మెడలో దండలు ధరించినట్లు ముదురు రంగు చారలు ఉంటాయి. ఇది ముళ్ల పొదలతో కూడిన పచ్చిక మైదానాలలో నివసిస్తుంది. రాత్రి వేళ మాత్రమే తిరుగుతుంది. దీని కూత దాదాపు 200 మీటర్ల దాక వినిపిస్తుంది. నేషనల్ సొసైటీ ఆఫ్ ఇండియా కలివికోడి కూతను రికార్డు చేయించి దాని గురించి కరపత్రాలు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయించారు. -
కలివికోడి కనిపించేనా..?
సాక్షి, అట్లూరు : కలివి కోడి అంటే మన జిల్లావాసులకు పరిచయం చేయనక్కరలేదు. కలివికోడి అంటే అట్లూరు మండలం అందరికీ గుర్తు వస్తుంది. సిద్దవటం రేంజ్ పరిధిలోని అట్లూరు మండలం కొండూరు బీట్ పరిధిలోని లంకమల్ల అభయారణ్యం ప్రాంతంలో 30 ఏళ్ల కిందట కలివికోడి కథ మొదలైంది. అప్పటి నుంచి అటవీశాఖ, ప్రత్యేక పరిశోధనా సంస్థల ప్రతినిధులు దీని ఉనికి కనుగొనేందుకు.. దాని ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కలివికోడి ఆవాసం కోసం అంటూ అట్లూరు, బద్వేలు మండలాల పరిధిలోని సుమారు మూడు వేల ఎకరాలకు సంబంధించి రూ.28 కోట్లు నష్టపరిహారం చెల్లించి రైతుల నుండి భూములు స్వాధీనం చేసుకున్నారు. సుమారు వందకు పైగా కెమెరాలను అమర్చి అన్వేషిస్తున్నారు. బాంబే హిస్టరీ నేషనల్ సొసైటీ లాంటి పలు సంస్థల ప్రతినిధులతో కొట్లాది రూపాయలు అదనంగా ఖర్చు చేసి అన్వేషిస్తున్నారు. దాదాపు రూ.50 కోట్లకు పైనే ఖర్చు చేసినట్లు సమాచారం. కలివి కోడి అన్వేషణ కోసం పరిశోధనా కేంద్రం... అరుదైన కలివికోడి జాడ కనుగొనేందుకు అట్లూరు మండల పరిధిలోని కొండూరు ఫా రెస్టు కార్యాలయ ప్రాంగణంలో 2013 నవంబరు నెలలో కలివికోడి పరిశోధనా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అడవిలో కలివికోడి ఉనికిని కనుగొనేందుకు అమర్చిన 177 కెమెరాలలో నమోదైన దృశ్యాలను ఈ కలివికోడి పరిశోధనా కేంద్రంలో పరిశీలించేందుకు రూపకల్పన చేశారు. అయితే 30 సంవత్సరాల అన్వేషిస్తున్నా.. దాని జాడ కపిపించడం లేదు. తెరపైకి మరో సంస్థ... గత కొన్నేళ్లుగా కలివికోడిని కనుగొనేందుకు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ సంస్థ పరిశోధనలు నిర్వహించి అది కనిపించక పోవడంతో రెండేళ్ల క్రితం వారు వెనుదిరిగారు. అయితే బెంగుళూరుకు చెందిన అశోక్‌ట్రస్టు రీచర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటు అనే సంస్థ కలివికోడి కోసం అన్వేషణ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. వారు అన్వేషణ సాగిస్తున్నారు. అన్వేషణ కొనసాగుతుంది.. గతంలో కలివికోడి ఉనికిని కనుగొనేందుకు బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ సంస్థ ద్వారా 177 కెమెరాలు అమర్చి కొన్నేళ్లపాటు శ్రమించారు. కలివికోడి కనిపించలేదు. ప్రస్తుతంలో బెంగూరుకు చెందిన అశోక్‌ట్రస్టు రీచర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటు సంస్థ అధునాతన వాయిస్ రికార్డర్లను అమర్చి కలివికోడి కూతలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 110 రకాల పక్షు జాతులకు సంబంధించిన కూతలు రికార్డు అయ్యాయి. ఆ రికార్డులను బెంగుళూరులో పరిశీలిస్తున్నారు. – ప్రసాద్, సిద్దవటం రేంజ్ అధికారి కలివి కోడి కథ గురించి తెలుసుకుందాం.. 1848లో బ్రిటీష్ సైనిక అధికారి పీసీ జోర్ధన్ కలివికోడిని కనుగొన్నారు. అయితే అరుదైన అంతరించిపోతున్న పక్షిజాతికి చెందిన పక్షిగా గుర్తించారు. అయితే ఈ పక్షిని ఆయన కనుగొనడంతో ఆయన పేరుతోనే జోర్ధన్ కోర్సర్‌గా ఆంగ్లేయ భాషలో నామకరణం చేశారు. అనంతరం 1871లో భద్రాచలం నదీపరివాహక ప్రాంతంలో పలుమార్లు ఆపక్షి దర్శనమిచ్చినట్లు అధికారులు చెపుతుంటారు. అయితే సిద్దవటం రేంజ్ కొండూరు బీటు పరిధిలో 1986 జనవరి నెలలో కలివిచెట్ల మధ్యలో ఐతన్న అనే వ్యక్తికి ఈ పక్షి దొరికింది. అయితే అది అప్పటికే చనిపోయినట్లు సమాచారం. అయితే అప్పటినుండి దీని ఉనికిని కనుగొనేందుకు అన్వేషణ మొదలైంది. అనంతరం 2008 సంవత్సరంలో మరో మారు కనిపించినట్లు అధికారులు చెపుతున్నారు. అయితే ఆధారాలు మాత్రం లేవు. అయినా నేటికీ అన్వేషణ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే అట్లూరు మండల పరిధిలోని కలివిచెట్ల పొదల మాటున తిరుగుతుందని పరిశోధనలలో తేలడంతో దీనిపేరు కలివికోడిగా ఇక్కడ పిలుస్తున్నారు. -
కలివికోడీ...కనిపించవే..!
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. అందులోనూ అంతరించిపోతున్న జాతుల్లో ఇదీ ఒకటి. ఈ పిట్ట 30 ఏళ్ల క్రితం ఒక్కసారి తళుక్కుమంది. అప్పటినుంచి ఇప్పటివరకు చూస్తామంటే కనిపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు కుమ్మరిస్తున్నా జాడ కూడా దొరకలేదు. రాత్రిపూట మాత్రమే తిరగాడే ఈ పిట్ట ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు శోధిస్తున్నారు. ఆ పిట్టే కలివికోడి. ఇది 1948లో బ్రిటీషు సైన్యాధిపతి చూశారు. తర్వాత 1986లో వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలంలోని కొండూరు బీటులో ముచ్చెమ్మకుంటలో కనిపించింది. అప్పటినుంచి ఇప్పటివరకు జాడలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని కలివికోడి లంకమల అటవీప్రాంతంలో కనిపించిన నేపథ్యంలో ఇక్కడే కలివికోడి జాతికి చెందిన పక్షులుంటాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 30 ఏళ్లుగా నిరీక్షణ.. 1986లో ఒక్కసారి మాత్రమే కనిపించిన కలివికోడి జాడ కోసం అటవీ అధికారులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇప్పటికి స్థానిక అధికారులు వెతుకులాట కొనసాగిస్తునే ఉన్నారు. ఆరుగురు ప్రత్యేక ప్రొటెక్షన్ సిబ్బందితోపాటు సుమారు 144 కెమెరాలను త్వరలోనే అమర్చేందుకు అటవీశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నెలకు కెమెరా బ్యాటరీలకు, సిబ్బంది జీతాలకుగాను దాదాపు రూ.45 వేలు ఖర్చు వస్తోంది. లంకమల్లేశ్వర అభయారణ్యంలో ఉన్న వేలాది హెక్టార్లలో ఈ కెమెరాలను అమర్చనున్నారు. పరిశోధనల్లో కనిపించని ఫలితం ఎనిమిదేళ్ల క్రితం ముంబయికి చెందిన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన సభ్యులు ఇక్కడ పరిశోధనలు చేశారు. ఉదయాన్నే అడవిలోకి బయలుదేరడం, సాయంత్రానికి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటూ కొంతమంది సభ్యుల బృందం నాలుగేళ్లపాటు కలివికోడి ఆనవాళ్ల కోసం పరిశోధనలు చేశారు. అడవిని గాలించినా...అంతా శోధించినా జాడ కనిపించలేదు. నాలుగేళ్లపాటు లంకమల అభయారణ్యంలో జల్లెడ పట్టిన పరిశోధన బృందం ఉసూరుమంటూ వెనుదిరిగింది. కొండూరులో ఉన్న పరిశోధన కేంద్రం ప్రస్తుతం మూతపడింది. భారీగా ఖర్చు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలివికోడి ఆచూకీ కోసం రూ.50 కోట్లకు పైగా ఖర్చుచేశాయి. అట్లూరు మండలంలోని కొండూరు, ఎస్.వెంకటాపురం, గుజ్జలవారిపల్లె, తంబళ్లగొంది, ఎర్రబల్లి, బద్వేలు మండలంలోని రాజుపాలెం, తిప్పనపల్లె తదితర గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి కలివికోడి సంరక్షణ అభయారణ్యంలో కలిపింది. అందుకోసం రైతుల భూములకు పరిహారంగా రూ.28 కోట్లు చెల్లించారు. ఇతర అన్ని అవసరాలకు మరో రూ.22 కోట్లకు పైగా ఖర్చుచేశారు. సిద్దవటం-బద్వేలు రోడ్డును ఇప్పుడు కూడా అభయారణ్యం పరిధిలో ఇబ్బంది కలుగుతుందని రాత్రిపూట వాహనాలను నిలిపివేస్తున్నారు. అనేకరకాల చిత్ర విచిత్రమైన జంతువులు అడవిలో అమర్చిన కెమెరాల్లో కనిపిస్తున్నా...కలివికోడి మాత్రం కనిపించకపోవడం అధికారులను కలవరపెడుతోంది. కనిపిస్తుందని ఆశ ఉంది: మహమ్మద్ దివాన్ మైదిన్, కడప అటవీశాఖాధికారి లంకమల్లేశ్వర అభయారణ్యంలో నిధుల కొరతతో కెమెరాలు దాదాపు ఎనిమిది నెలలుగా అమర్చలేదు. రీవ్యాలిడేషన్ నిధులు ఉండటంతో ప్రస్తుతం 144 కెమెరాలను అడవిలో పెట్టేందుకు సిద్ధమయ్యాం. త్వరలోనే వాటిని అక్కడక్కడ బిగించి కలివికోడి కోసం శోధిస్తాం. ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. కనిపిస్తుందన్న ఆశ మాత్రం ఉంది. -
అచ్చంగా..కలివికోడిలా...!
పులివెందుల టౌన్: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పట్టణ శివారులో అరుదైన కలివి కోడిని పోలిన పక్షి లభ్యమైంది. పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకులు అంబకపల్లె నారాయణస్వామి, రాజులు శుక్రవారం కనంపల్లె గ్రామ సమీపంలో ఉన్న తమ పొలానికి వె ళ్లగా అక్కడ ఓ వైపు సరిగా నిలబడలేని పక్షి కనిపించింది. ఇది కలివి కోడిలా ఉందని భావించి వెంట తీసుకొచ్చారు. శనివారం స్థానిక అటవీ శాఖ అధికారి రజనీ కుమార్‌కు అందజేశారు. కలివి కోడి చాలా అరుదైన పక్షి అని, దీని మనుగడ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, ఇది కలివికోడి అవునో.. కాదో నిర్ధారణ కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని రజనీ కుమార్ తెలిపారు. మూడు దశాబ్దాలుగా గాలింపు కలివికోడి గురించి ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా జాడ తెలియడం లేదు. మూడు దశాబ్దాలుగా గాలింపు సాగుతోంది. ప్రత్యక్షంగా ఇవి కనిపించకుండా పోయాయి. బాంబే న్యాచురల్ సొసైటీ, అటవీ శాఖ అధికారులు ఈ పక్షిపై సర్వే కొనసాగిస్తున్నారు. 1948లో తొలిసారిగా కడప- నెల్లూరు సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఒకసారి కనిపించాయి. 1986లో వైఎస్ఆర్ జిల్లా అట్లూరు ప్రాంతంలో, 2008లో బద్వేలు అటవీ ప్రాంతంలో కనిపించడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ జాతి పక్షి అంతరించి పోకుండా ఇప్పటి వరకు రూ. 28 కోట్లు ఖర్చు చేసింది.