కలివికోడి కనిపించేనా..? | Kalivi Kodi Searching In YSR Kadapa | Sakshi
Sakshi News home page

కలివికోడి కనిపించేనా..?

Published Tue, Aug 13 2019 10:39 AM | Last Updated on Tue, Aug 13 2019 10:47 AM

Kalivi Kodi Searching In YSR Kadapa - Sakshi

కలివికోడి పరిశోధనా కేంద్రం

సాక్షి, అట్లూరు : కలివి కోడి అంటే మన జిల్లావాసులకు పరిచయం చేయనక్కరలేదు. కలివికోడి అంటే అట్లూరు మండలం అందరికీ గుర్తు వస్తుంది. సిద్దవటం రేంజ్‌ పరిధిలోని అట్లూరు మండలం కొండూరు బీట్‌ పరిధిలోని లంకమల్ల అభయారణ్యం ప్రాంతంలో 30 ఏళ్ల కిందట కలివికోడి కథ మొదలైంది.  అప్పటి నుంచి అటవీశాఖ, ప్రత్యేక పరిశోధనా సంస్థల ప్రతినిధులు దీని ఉనికి కనుగొనేందుకు.. దాని ఆచూకీ కోసం   ప్రయత్నిస్తూనే ఉన్నారు.

  • కలివికోడి ఆవాసం కోసం అంటూ అట్లూరు, బద్వేలు మండలాల పరిధిలోని సుమారు మూడు వేల ఎకరాలకు సంబంధించి రూ.28 కోట్లు నష్టపరిహారం చెల్లించి రైతుల నుండి భూములు స్వాధీనం చేసుకున్నారు. సుమారు వందకు పైగా  కెమెరాలను అమర్చి అన్వేషిస్తున్నారు.  బాంబే హిస్టరీ నేషనల్‌ సొసైటీ లాంటి పలు సంస్థల ప్రతినిధులతో కొట్లాది రూపాయలు అదనంగా ఖర్చు చేసి అన్వేషిస్తున్నారు. దాదాపు రూ.50 కోట్లకు పైనే ఖర్చు చేసినట్లు సమాచారం. 

కలివి కోడి అన్వేషణ కోసం  పరిశోధనా కేంద్రం...
అరుదైన కలివికోడి జాడ కనుగొనేందుకు అట్లూరు మండల పరిధిలోని కొండూరు ఫా రెస్టు కార్యాలయ ప్రాంగణంలో 2013 నవంబరు నెలలో కలివికోడి పరిశోధనా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అడవిలో కలివికోడి ఉనికిని కనుగొనేందుకు అమర్చిన 177 కెమెరాలలో నమోదైన దృశ్యాలను ఈ కలివికోడి పరిశోధనా కేంద్రంలో పరిశీలించేందుకు రూపకల్పన చేశారు. అయితే  30 సంవత్సరాల అన్వేషిస్తున్నా.. దాని జాడ కపిపించడం లేదు.  

తెరపైకి మరో సంస్థ...
గత కొన్నేళ్లుగా కలివికోడిని  కనుగొనేందుకు బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ సంస్థ పరిశోధనలు నిర్వహించి అది కనిపించక పోవడంతో రెండేళ్ల క్రితం వారు వెనుదిరిగారు. అయితే  బెంగుళూరుకు చెందిన అశోక్‌ట్రస్టు రీచర్చ్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్మెంటు అనే సంస్థ కలివికోడి కోసం అన్వేషణ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. వారు అన్వేషణ సాగిస్తున్నారు.

అన్వేషణ కొనసాగుతుంది..
గతంలో కలివికోడి ఉనికిని కనుగొనేందుకు బాంబే నేషనల్‌ హిస్టరీ సొసైటీ సంస్థ ద్వారా 177 కెమెరాలు అమర్చి కొన్నేళ్లపాటు శ్రమించారు. కలివికోడి కనిపించలేదు. ప్రస్తుతంలో బెంగూరుకు చెందిన అశోక్‌ట్రస్టు రీచర్చ్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్మెంటు సంస్థ అధునాతన వాయిస్‌ రికార్డర్లను అమర్చి కలివికోడి కూతలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 110 రకాల పక్షు జాతులకు
సంబంధించిన కూతలు రికార్డు అయ్యాయి. ఆ రికార్డులను బెంగుళూరులో పరిశీలిస్తున్నారు.  –  ప్రసాద్, సిద్దవటం రేంజ్‌ అధికారి

కలివి కోడి కథ గురించి తెలుసుకుందాం..
1848లో బ్రిటీష్‌ సైనిక అధికారి పీసీ జోర్ధన్‌ కలివికోడిని కనుగొన్నారు. అయితే అరుదైన అంతరించిపోతున్న పక్షిజాతికి చెందిన పక్షిగా గుర్తించారు. అయితే ఈ పక్షిని ఆయన కనుగొనడంతో ఆయన పేరుతోనే జోర్ధన్‌ కోర్సర్‌గా ఆంగ్లేయ భాషలో నామకరణం చేశారు. అనంతరం 1871లో భద్రాచలం నదీపరివాహక ప్రాంతంలో పలుమార్లు ఆపక్షి దర్శనమిచ్చినట్లు అధికారులు చెపుతుంటారు. అయితే  సిద్దవటం రేంజ్‌ కొండూరు బీటు పరిధిలో 1986 జనవరి నెలలో కలివిచెట్ల మధ్యలో ఐతన్న అనే వ్యక్తికి ఈ పక్షి దొరికింది. అయితే అది అప్పటికే చనిపోయినట్లు సమాచారం. అయితే అప్పటినుండి దీని ఉనికిని కనుగొనేందుకు అన్వేషణ మొదలైంది. అనంతరం 2008 సంవత్సరంలో మరో మారు కనిపించినట్లు అధికారులు చెపుతున్నారు. అయితే ఆధారాలు మాత్రం లేవు. అయినా నేటికీ అన్వేషణ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే అట్లూరు మండల పరిధిలోని కలివిచెట్ల పొదల మాటున తిరుగుతుందని పరిశోధనలలో తేలడంతో దీనిపేరు కలివికోడిగా ఇక్కడ పిలుస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement