
తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ (బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్)లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. మునుపటి డైరెక్టర్ దాదాపు 20 ఏళ్లపాటు నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ఇష్టారాజ్యంగా నిధులు, విధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్స్ కొనుగోళ్లలో కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలున్నాయి. ఆయనపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన అవినీతి అక్రమాలను వెలుగులోకి తేవడంపై విజిలెన్స్ దృష్టిసారించింది. గడిచిన రెండు నెలలుగా ప్రత్యేక బృందం అంతర్గత విచారణను చేపట్టింది. ఆశాఖ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి ఆదేశాలతో డీఎస్పీ మల్లేశ్వర్‌రెడ్డి సహా నలుగురితో కూడిన బృందంతో శుక్రవారం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిసంబంధిత ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇష్టారాజ్యం
బర్డ్ హాస్పిటల్‌లో ఏళ్ల తరబడి నియంతృత్వ పాలనను గుర్తించిన టీటీడీ యంత్రాంగం దీనిపై దృష్టి సారింది. మరో సారి డైరెక్టర్‌గా అందలమెక్కాలనే విశ్వ ప్రయత్నాలు చేశారని తెలిసింది. ఆయన లేకపోవడం వల్ల సేవలు పడిపోయాయని అనుకూల మీడియాలో కథనాలు కూడా రాయించారు. మళ్లీ ఆయన వస్తేనే పూర్వవైభవం అంటూ విస్తృతంగా ప్రచారం చేయించారు. దీనిపై టీటీడీ కన్నెర్రజేసింది. బర్డ్‌లో అసలేం జరుగుతుందో అనే దానిపై దృష్టి సారించింది. దీంతో డాక్టర్ జగదీష్ పాలనంతా స్వలాభం, ఒక సామాజికాపేక్ష కోసమే పనిచేశారని వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో ఆయనపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విజి లెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దృష్టి సారించింది. ఆ తర్వాత ప్రభుత్వం టీటీడీ విజిలెన్స్‌ను పక్కనపెట్టి ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్‌కు విచారణ బాధ్యతలను అప్పగించింది.
నమ్మలేని నిజాలు
బర్డ్ నిర్వహణ కోసం టీటీడీ ఏటా 50కోట్ల నిధులను కేటాయిస్తోంది. ఈ నిధులను మునుపటి డైరెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఖర్చు చేశారని తెలిసింది. ఏపీఎంఐడీసీ చైర్మన్ భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బర్డ్‌లో పర్యటించి ప్రాథమిక విచారణ చేపట్టారు. మందులు, పరికరాల కొనుగోళ్లలో కోట్లాది రూపాయలు మారాయనే ఆరోపణలపై ఆయనపై వచ్చిన అవినీతి అక్రమాల నివేదికను రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్సుమెంట్‌ను అందజేశారు. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందం గడిచిన రెండునెలలుగా అవినీతి అక్రమాల కూపీ లాగుతోంది. గడిచిన ఐదారేళ్లకు సంబంధించిన వివరాలు మాత్రమే లభ్యమయ్యాయి. అంతకు ముందు 15 ఏళ్లకు సంబంధించిన కొనుగోళ్ల లావాదేవీల దస్త్రాలను ఆయన మాయం చేసినట్లు గుర్తించారు. వీటి ఆధారంగానే విచారణ చేపట్టి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలానే ద్వారకా తిరుమలలో విడ్ ఆస్పత్రికి సెక్రటరీగా వ్యవహరిస్తున్న డాక్టర్ జగదీష్ మెడికల్ క్యాంపుల పేరుతో ఏటా 6 కోట్లు శ్రీవారి నిధులను దారి మళ్లించారని తెలిసింది. టీటీడీకి ఎలాంటి సమాచారమూ లేకుండానే మెడికల్ క్యాంప్‌ల పేరుతో ఏకంగా అక్కడే ఆపరేషన్లు చేయించారని తేలడంతో విచారణాధికారులు విస్తుపోయారు. టీటీడీ గత చైర్మన్ మెప్పుకోసం బర్డ్ మందుల షాపును నిబంధనలకు విరుద్ధంగా కేటాయించినట్లు విచారణలో తేలిందని సమాచారం. క్యాంటీన్‌ను బినామీ పేరుతో నిర్వహిస్తూ లక్షలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment