
గైయినెస్‌విల్లే: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షిగా గుర్తింపుగా పొందిన ‘కాసోవారీ’ తన యజమాని ప్రాణం తీసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న గైయినెస్‌విల్లే నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం... కాసోవారీ శుక్రవారం తన యజమానిపై దాడి చేసి చంపేసింది. మృతుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. ‘ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టుగా కనబడుతోంది. తనకు సమీపంలో జారిపడిన యజమానిపై కాసోవారీ దాడి చేసివుండొచ్చ’ని పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చూడటానికి ఈము పక్షిలా కనబడే కాసోవారీ దాదాపు 6 అడుగుల ఎత్తు, 60 కేజీల బరువు పెరుగుతుంది. ఎగరలేని ఈ భారీ పక్షి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూగినియాలో కనిపిస్తుంది. శాన్‌డియాగో జూ వెబ్‌సైట్ ప్రకారం... ఇవి చాలా ప్రమాదకరమైన పక్షి. దీని కాళ్లకు దాదాపు 10 సెంటీమీటర్లు పొడవుండే కత్తుల్లాంటి గోళ్లుంటాయి. ముప్పు వాటిల్లినప్పుడు వేగంగా స్పందించి ఒక్క దెబ్బతో సత్తా చూపగలదు. దట్టమైన అడవుల్లోనూ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అమెరికాలో వీటిని మంసాహారం కోసం పెంచరు. అరుదైన జాతికి చెందిన కాసోవారీని కాపాడాలన్న ఉద్దేశంలో పక్షి ప్రేమికులు వీటిని సంరక్షిస్తున్నారు.