అదొక సుందర సువిశాలమైన ఒక పెద్ద మైదానం. ప్రశాంతతకు మారుపేరైన ఆ ప్రదేశంలో, ఒక చెట్టుమీద ఒక పిచ్చుక నివసిస్తూ ఉండేది. కొద్దిరోజుల క్రితమే దానికి కొన్ని పిల్లలు పుట్టాయి. ఆ చిన్నారి పిచ్చుకలకు ఇంకా రెక్కలు రాకపోవడంతో అవి ఎగురలేని స్థితిలో ఉన్నాయి. స్వయంగా తామే ఆహారం సంపాదించుకోలేని పరిస్థితి వాటిది. తల్లే వాటికి ఆహారం సమకూర్చేది. ఇంతలో పరిస్థితి ఉన్నట్లుండి మారిపోయింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశంలో యుద్ధానికి తగిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇరుపక్షాల సైన్యాలూ బారులు తీరి నిలబడ్డాయి. దాంతో సైనికుల కోలాహలం, ఏనుగుల ఘీంకారావాలు, గుర్రాల సకిలింపులు, వీరులు తమ కత్తులను సానబట్టే శబ్దం, యుద్ధభేరీల శబ్దం, వీరుల శంఖ నాదాలతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. దాంతో చెట్టు మీద ఉన్న పిచ్చుక గడగడ వణికిపోయింది. తన పిల్లలను అక్కున చేర్చుకుని దేవుణ్ణి తలచుకుని, ‘‘దేవా! మమ్మల్ని ఈ ఆపద నుండి రక్షించు!’’ అని ప్రార్థించింది. దాని మొరను దేవుడు ఆలకించాడు. వెంటనే ఆయన పిచ్చుక గూడు కట్టుకుని ఉన్న చెట్టు వద్దకు వచ్చాడు. పిచ్చుకను చూసి ఆయన, ‘‘ఓ పిచ్చుకా భయపడకు! ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పటికీ, దానివల్ల నీకూ, నీ పిల్లలకూ ఎటువంటి ఆపదా రాకుండా చూస్తాను!’’ అని అభయమిచ్చాడు. ఆ తరువాత యుద్ధం ప్రారంభమయింది. ఆ యుద్ధం జరిగినంతకాలం పిచ్చుకకు, దాని సంతానానికి ఏ ఆపదా వాటిల్లలేదుభగవంతుడు మనుషులకే కాదు, పక్షులు, మృగాలు తదితర సకల జీవజాలాన్ని రక్షించి కాపాడుతూ ఉంటాడు. అందుకే దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నారు. భగవంతుణ్ణి చిత్తశుద్ధితో ప్రార్థించిన వారి మొరను తప్పక వింటాడు. అనుగ్రహిస్తాడు. మనకు ఉండవలసిందల్లా విశ్వాసమొక్కటే! – డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment